close

తాజా వార్తలు

Updated : 25/07/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్ని జిల్లాలకు కరోనా టెస్టింగ్ అంబులెన్స్‌లు

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
 ఆరు అంబులెన్స్‌లు ఇస్తానని ప్రకటన
కేటీఆర్ బాటలో పార్టీ నాయకులు.. వంద అంబులెన్స్‌లను సమకూర్చాలని నిర్ణయం

హైదరాబాద్‌: తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆదర్శమంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర మంత్రిగా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను మానవీయకోణంలో పరిష్కరించే కేటీఆర్‌.. తన పుట్టిన రోజునాడు తనవంతుగా ఆరు అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు ఇస్తానని ప్రకటించారు.  పార్టీ నేతగా తాను ఇస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చెప్పారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఈటల రాజేందర్ ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈసందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండేందుకు ఆరు అంబులెన్స్‌లను తాను వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. అంబులెన్స్‌లను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని, పార్టీ తరఫున ఇవ్వాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ అంబులెన్స్‌ల్లో అన్ని సౌకర్యాలుంటాయని, కరోనా టెస్టులు కూడా చేసే వీలుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఉపయోగించుకోవాలని, అతిత్వరలోనే వీటిని అందజేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభినందించడంతోపాటు తాను కూడా తమ నియోజకవర్గం, కరీనంగర్ జిల్లా పార్టీ తరఫున 5 అంబులెన్స్‌లను సమకూరుస్తానని చెప్పారు. ప్రభుత్వపరంగా అంబులెన్స్‌లను సమకూరుస్తున్నప్పటికీ వీటి అవసరం ఎక్కువగానే ఉంటోందని, కరోనా టెస్టులను కూడా చేసేలా రూపొందించడంతో చాలా ఉపయోగం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఆస్పత్రులుగా ఇవి ఉపయోగపడేలా చూస్తామన్నారు. ప్రతీ అంబులెన్స్‌లో అత్యవసర మందులతోపాటు ఆక్సిజన్, వెంటిలేటర్ వంటివాటిని కూడా ఏర్పాటు ఉంటుందని, వీటిని ఉపయోగించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు చేయడానికి అవసరమైన సిబ్బంది అంబులెన్స్‌లలో ఉండేలా చూస్తామని ఆరోగ్య మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

మేము సైతం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు..

ఇక అదే సందర్భంలో మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా సూర్యాపేట, భువనగిరి యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఆరు అంబులెన్స్‌లను సమకూరుస్తామని చెప్పారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, గ్యాదరి కిషోర్, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తదితరులతో కల్సి మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. 

ఇక అక్కడే రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా తమ మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ, నేతల తరఫున 11 అంబులెన్స్‌లను సమకూరుస్తామని ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్ తదితరులతో కల్సి తమ వరంగల్ జిల్లా తరఫున 6 అంబులెన్స్‌లను ఇస్తామని ప్రకటించారు. పార్టీలోని మరింత మంది నాయకులు, దాతలతో చర్చించి ప్రతి నియోజకవర్గంలోని ఆస్పత్రికి కనీసం ఒక్కొక్క కొత్త అంబులెన్స్ ఉండేలా చేస్తామన్నారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా తాను నాలుగు అంబులెన్స్‌లను, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ మూడు సమకూర్చడానికి సిద్దమని ప్రకటించారు. అక్కడే ఉన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డిలతో కల్సి అయిదు అంబులెన్స్‌లు ఇవ్వడానికి సిద్దమన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మూడు అంబులెన్స్‌లను ఇవ్వడంతోపాటు వీటిని సకాలంలో తయారు చేయించే బాధ్యతలో కూడా పాలుపంచుకుంటానని చెప్పారు. ఎంపీలు రంజీత్‌రెడ్డి తన వంతుగా ఏడు అంబులెన్స్‌లు ఇస్తానన్నారు. లోక్‌సభలో తెరాస పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరు అంబులెన్స్‌లు, మంత్రి గంగుల కమలాకర్ తాను ఆరు, నిరంజన్‌రెడ్డి మూడు, మంత్రి మల్లారెడ్డి తాను కూడా ఆరు అంబులెన్స్‌లు  సమకూరుస్తానన్నారు.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కూడా తన వంతుగా రెండు అంబులెన్స్‌లను సమకూరుస్తానన్నారు. ఇలా అక్కడున్న నేతలంతా తమతమ జిల్లాల్లోని ఆస్పత్రులకు అవసరమయ్యే వీలైనన్ని అంబులెన్స్‌లను సమకూరుస్తామన్నారు.  వీరితోపాటు కొంతమంది పార్టీ సానుభూతిపరులు కూడా అంబులెన్స్‌లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మొత్తంగా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో వంద అంబులెన్స్‌లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. వీలైనంత త్వరగానే వీటిని ఆయా జిల్లాల్లోన్ని ఆస్పత్రులకు ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు. స్వచ్చంధంగా అంబులెన్స్‌లు సమకూర్చడానికి ముందుకు వచ్చినవారికి మంత్రి కేటీఆర్ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ఇంత స్పందన వస్తుందని తాను ఊహించలేదని, కరోనా సమయంలో అంబులెన్స్‌ల కొరత లేకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.