
తాజా వార్తలు
పోలవరం ఎత్తు తగ్గింపు సాధ్యంకాదు: జగన్
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఎత్తు తగ్గింపు సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పిల్వే, అప్రోచ్ ఛానల్, అప్స్ట్రీం కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ కాఫర్ డ్యాం, గేట్ల అమరిక తదితర అంశాలపై సీఎం వారితో చర్చించారు. మే చివరి నాటికి కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పిల్వే పనులు పూర్తయ్యాయని.. గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు.
నదుల అనుసంధానంపై రాష్ట్రం తరఫు నుంచి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నదుల అనుసంధానంతో ఇక్కడి ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. అయోమయాలు, సందిగ్ధతలకు తావులేకుండా ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. వీటిని కేంద్రానికి పంపుదామని అధికారులకు సీఎం తెలిపారు. పోలవరం వద్ద వైయస్సార్ గార్డెన్స్ నిర్మాణంపై సీఎం సమీక్షించారు. వైయస్సార్ గార్డెన్స్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.