
తాజా వార్తలు
ఇకపై ఫొటోలూ కదులుతాయ్..
కృత్రిమ మేధ ఆధారంతో అద్భుతం
జెరూసలేం: మన చిన్నపుడెపుడో కన్నుమూసిన పెద్దవారిని ఫొటోల్లో చూసి బాధ పడటమే కానీ వారిని, వారి కదలికల్ని మనం తిరిగి తీసుకురాలేం. కేవలం పెద్దవారివే కాక మన చిన్ననాటి ఫొటోలైనా, లేదా ఏవైనా సాధారణ ఫొటోలకు కూడా కదలిక వస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఓ సంస్థ కృత్రిమ మేధ సాయంతో ఫోటోలకు జీవం పోసేలా సరికొత్త ఆవిష్కరణ చేసింది. వివరాల్లోకెళ్తే.. ఇజ్రాయెల్‌కు చెందిన వంశవృక్ష సంబంధిత పరిశోధనలు చేసే ‘మై హెరిటేజ్’ అనే సంస్థ తమ వెబ్సైట్లో రెండు వారాల క్రితం డీప్ నాస్టాల్జియా పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. అందులో మనం ఏ ఫొటోలనైనా ఎంచుకొని అందులోకి వ్యక్తులు కదిలేలా చేయొచ్చు. కృత్రిమ మేధ సాయంతో జరిగే ఈ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను ఆ సంస్థ ఒక బ్లాగ్‌లో వివరించింది.
ముందుగా మై హెరిటేజ్ సంస్థ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అందులో ఫ్యామిలీ ట్రీ అనే విభాగాన్ని ఎంచుకొని మన ఫొటోలను అందులో అప్లోడ్ చెయ్యాలి. ఫొటోలో ఎవరు కదలాలనుకుంటున్నారో వారిని ఎంచుకోవాలి. తర్వాత ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేయ్యొచ్చు.
తాజాగా ఒక ట్విటర్ వినియోగదారుడు భగత్‌సింగ్, స్వామి వివేకానంద, బాల గంగాధర తిలక్ వంటి ప్రముఖుల ఫొటోలు ఎంచుకొని వాటికి ఈ ఫీచర్‌ను యాడ్ చేశారు. చరిత్రలో భాగమైన మహానుభావుల ఫొటోలకు కదలికలు రావడం చూస్తుంటే మరో అద్భుతాన్ని ఆవిష్కరించినట్లే ఉంది. ఇంకెందుకాలస్యం వాటిని మీరూ చూసేయండి.