close

తాజా వార్తలు

Updated : 01/09/2020 19:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రపంచానికి ‘రెండో’ ముప్పు..?

ప్రపంచ జీడీపీ మరింత కిందకు.. 

టీకాపై కచ్చితంగా చెప్పలేమన్న ఆంతోనీ ఫౌచీ

అమెరికాలో పరిస్థితిని దిగజారుస్తున్న జార్జిఫ్లాయిడ్‌ ఆందోళనలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనావైరస్‌ రెండో తరంగం ప్రపంచాన్ని ముంచేందుకు వేగంగా దూసుకొస్తోంది. ఇటీవలే ఆసియాలోనే అతిపెద్ద షిన్‌ఫడి హోల్‌సేల్‌ మార్కెట్లో కరోనావైరస్‌ పడగవిప్పడంతో బీజింగ్‌లో ప్రధాన ప్రాంతాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి.. మరోపక్క అమెరికాలో కూడా ‘స్టే ఎట్‌ హోమ్’‌ నిబంధనలు ఎత్తేయడంతో భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన మరిన్ని ఉద్యోగాలకు కోతలు పడే ప్రమాదం ఉంది. భారత్‌లో కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికాలోని వైద్య నిపుణులు కూడా రెండో తరంగం మొదలైందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అసలు రెండో తరంగం ఏమిటీ..?

మనుషులకు కొత్త రకం వైరస్‌లు సోకినప్పుడు వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి శరీరంలో ఉండదు. దీంతో ఇవి ప్రపంచ మహమ్మారులుగా మారి లక్షల సంఖ్యలో ప్రాణాలను బలికొంటాయి. స్వైన్‌ఫ్లూ, స్పానిష్‌ ఫ్లూ, కరోనావైరస్‌ ఇలాంటివే. ఇవి తొలిసారి వ్యాపించినప్పుడు కొంత మందికి సోకాక.. భౌతిక దూరం,  లాక్‌డౌన్ వంటి నిబంధనలతో వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తాం. మళ్లీ ఈ నిబంధనలు తొలగించాక వైరస్‌ రెండోసారి గతంలో కంటే మరింత బలంగా విజృంభిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. సీజన్‌లో చోటుచేసుకునే వాతావరణ మార్పులు వైరస్‌కు అనుకూలించడం.. వైరస్‌లో మార్పులు జరిగి వెంటనే గుర్తించడానికి వీల్లేకుండా శక్తిమంతంగా రూపాంతరం చెందడం.. భౌతిక దూరం నిబంధనలు తొలగించాక ప్రజల్లో కనిపించే అలసత్వం వంటి కారణాలతో వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తుంది. 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ  తొలిసారి వ్యాపించిన దానికంటే రెండో సారి వ్యాపించినప్పుడు ఎక్కువ మందిని బలి తీసుకొంది. ఇప్పడు కరోనా విషయంలో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని భయపడుతున్నారు.

ఆర్థిక వ్యవస్థలు కుదేలు..

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల కరోనా వైరస్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో రెండో తరంగం మొదలైందని భావిస్తున్నారు. ఇటీవల ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్) ఒక బాంబు పేల్చింది. కరోనావైరస్‌  రెండో తరంగం వస్తే ప్రపంచ జీడీపీ 7.5శాతం పతనం అవుతుందని పేర్కొంది. ఇది చాలా ఎక్కువ. దీంతో కనీసం 4 కోట్ల మంది ఉపాధి కోల్పోవడం ఖాయం. రెండో తరంగం రాకపోయినా ప్రపంచ జీడీపీ 6శాతం మేరకు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఓఈసీడీ డైరెక్టర్‌ జనరల్‌ ఎంజెల్‌ గుర్లా తెలిపారు. ఇక ఓఈసీడీ చీఫ్‌ ఎకనామిస్ట్‌ లౌరెన్స్‌ బునే అంచనాల ప్రకారం వైరస్‌ రెండో తరంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీయనుంది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి ప్రపంచానికి కొన్నేళ్ల సమయం పట్టవచ్చు. కొనుగోలుదారుల ప్రవర్తన కూడా మారిపోతుంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అమెరికాలో ఈ ఏడాది జీడీపీ 5.8శాతం పతనం అవుతుందని 48మంది ఆర్థిక వేత్తలు అంచనాగట్టారు. 1940 తర్వాత అత్యధిక పతనం ఇదే. వైరస్‌ రెండోసారి విజృంభించకపోతేనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని వారు పేర్కొన్నారు. 
కరోనాకు ముందు స్థితికి ఫ్రాన్స్‌ చేరాలంటే 2026వరకు సమయం పడుతుందని మార్క్‌ టౌటీ అనే అర్థిక వేత్త పేర్కొన్నారు. ప్రపంచలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌ ఈ ఏడాది 11శాతం జీడీపీ నష్టపోతుందని అంచనా వేశారు. ఇది కోలుకోవడానికే ఐదున్నరేళ్లు పడుతుందని భావిస్తున్నారు. 

మళ్లీ కరోనా విజృంభణ ఊహాజనితం కాదు..

కరోనావైరస్‌ రెండోసారి విజృంభించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు కూడా పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ మాట్లాడుతూ కరోనా రెండోసారి విజృంభణ ఒక వాస్తవిక ముప్పు అని వ్యాఖ్యానించారు. ‘‘చాలా దేశాల్లో లాక్‌డౌన్‌లను ఎత్తివేస్తే రెండోసారి వ్యాధి వ్యాపించి.. అత్యధిక మందికి సోకుతుంది. లేకపోతే కొన్ని దేశాల్లో మొదటి విడత వ్యాప్తే కొనసాగుతుంది. అంతేగానీ లాక్‌డౌన్‌ సమయంలో ఉన్నంత తక్కువగా మాత్రం ఉండదు. ఇవన్నీ వాస్తవాలు’’ అని సౌమ్య పేర్కొన్నారు.  

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఏమిటీ..?

* భారత్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేశాక రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య 6వేల నుంచి ఒక్కసారిగా పదివేలను దాటేసింది. ముంబయి, దిల్లీ వంటిచోట్ల ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడంలేదు. దీంతో మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో చైన్నైలో పరిస్థితి చేజారే స్థితికి చేరడంతో రెండో విడత లాక్‌డౌన్‌ను ప్రకటించారు. 
* అమెరికాలో కేసుల సంఖ్య రెండు మిలియన్లు దాటేసింది. గత వారం 18 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. ఆరు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల 50 శాతం దాటింది.  ఇప్పుడు అమెరికాలో ‘జార్జ్‌ఫ్లాయిడ్‌’ ఆందోళనల కారణంగా వైరస్‌ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణలు అంచనావేస్తున్నారు. 
* చైనాలో జిలిన్‌ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో అక్కడ కూడా ఆంక్షలను విధించారు. ఇదే సమయంలో వుహాన్‌లో కూడా రెండోవిడత కేసులు రావడంతో కోటిమందికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా బీజింగ్‌లో కేసులు పెరగడంతో చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. 
* తాజాగా న్యూజిలాండ్‌లో కూడా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ ఇటీవలే కొవిడ్‌ రహిత దేశంగా ప్రకటించుకొంది. 

కచ్చితంగా టీకా వస్తుందనే హామీ లేదు...

అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంతోనీ ఫౌచీ మాట్లాడుతూ కచ్చితంగా టీకా వస్తుందని చెప్పలేమన్నారు. ఇప్పటి వరకు నాలుగైదు టీకాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. టీకా విఫలమవడానికి చాలా పరిస్థితులు కారణం అవుతాయన్నారు. టీకాలపై ఇప్పటి వరకైతే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని