
తాజా వార్తలు
హుస్సేన్‌సాగర్‌లో కొబ్బరినీళ్లు ఎక్కడ?: ఉత్తమ్
హైదరాబాద్: ఓట్ల కోసం తెరాస అబద్ధపు హామీలు ఇస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... తెరాస హామీల పట్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామని చెప్పారు.. ఏమైందని ప్రశ్నించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు కడతామని చెప్పిన తెరాస ఇప్పటివరకు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు. సెలూన్లకు ఉచిత విద్యుత్ హామీని గతంలో ఎన్నోసార్లు చెప్పారని.. ఇలా చెప్పినవే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు అందిస్తామని చెప్పారని.. అయితే ఇప్పటివరకు అములు చేయలేదని మండిపడ్డారు.
‘‘నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. నాలాల ఆధునికీకరణ గురించి గతంలో అనేకసార్లు చెప్పారు. ఏం చేయలేకపోయారు. నిమ్స్ ఆస్పత్రి పరిస్థితిని దిగజార్చి బస్తీ దవాఖానాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఉచితంగా తాగునీరు ఇవ్వలేకపోయారు. తెరాస అసమర్థత వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగింది. వరద బాధిత కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించలేదు. హైదరాబాద్‌కు మెట్రో రైల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పాతబస్తీ వరకు మెట్రోను ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్లలేకపోయింది. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తాయిలాల వల వేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం.. తర్వాత మర్చిపోవడం తెరాసకు మామూలే. తెరాసను, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో వేయాలి’’ అని ఉత్తమ్ విమర్శించారు.