close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/05/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్‌?

దక్షిణ కొరియాలో ప్రొఫెషనల్‌ బేస్‌బాల్‌ సీజన్‌ ఆరంభం

చైనాలో వరుసగా మూడో వారం మరణాల్లేవ్‌

అమెరికాలో ఆగమాగం.. రష్యాలో వైరస్‌ విజృంభణ 

లండన్‌: నావెల్‌ కరోనా వైరస్‌ ఆవిర్భావం తర్వాత ప్రపంచం రోజుకో రకంగా మారుతోంది. ఐరోపాలో అత్యధిక మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్‌ నిలిచింది! రష్యాలో వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో వరుసగా మూడో వారం కరోనా మరణాలేమీ లేవు. దక్షిణ కొరియాలో ప్రొఫెషనల్‌ బేస్‌బాల్‌ సీజన్‌ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నాటి వివరాలివీ..


అమెరికాలో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించేందుకు సిద్ధమవుతున్నాయి. లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రోజూ వేలాది మందికి కొత్తగా వైరస్‌ సోకుతోంది. మరణాలు సంభవిస్తున్నాయి.


బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య ఇటలీని దాటేసిందని సమాచారం. ఐరోపాలో ఇది సరికొత్త వైరస్‌ కేంద్రంగా మారింది. బ్రిటన్‌లోని ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌, ఇతర కేంద్రాల్లో 28,734 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. ఐతే పరీక్షలు చేయని, కొవిడ్‌-19 లక్షణాలతో మృతిచెందిన వారిని ఈ లెక్కల్లోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. అవన్నీ కలిపితే బ్రిటన్‌లో మరణాల సంఖ్య 30వేలు దాటుతుందని నిపుణులు అంటున్నారు. ఇటలీలో 29,079 మంది చనిపోయారు. కాగా ఈ రెండు దేశాల్లోనూ నర్సింగ్‌హోమ్‌లు, ఇతర ప్రాంతాల్లో మృతిచెందిన వారిని లెక్కలోకి తీసుకోలేదు.


రష్యాలో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ పదివేల కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బాధితులు పెరుగుతున్నప్పటికీ ఐరోపా దేశాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. ‘రెండో వేవ్‌ కచ్చితంగా ఉంటుందని తెలుసు. ఎక్కువమంది శాస్త్రవేత్తలు దీనిని విశ్వసిస్తున్నారు. మరికొందరైతే మూడో వేవ్‌నూ అంచనా వేస్తున్నారు’ అని జర్మనీ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం చీఫ్‌ లోథర్‌ వీలర్‌ అన్నారు.


కరోనాపై విజయం సాధించిన దక్షిణ కొరియాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మంగళవారం కేవలం మూడు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 18 తర్వాత ఒక  రోజు నమోదైన అత్యల్ప కేసులు ఇవే. దశల వారీగా పాఠశాలలు తెరుచుకున్నాయి. మే 13 నుంచి హైస్కూల్‌ సీనియర్స్‌ ఆరంభమవుతాయి. ప్రొఫెషనల్‌ బేస్‌బాల్‌ లీగ్‌ మొదలవ్వడమే మంగళవారం హైలైట్‌. ఖాళీ స్టేడియాల్లో ఛీర్‌ లీడర్స్‌ చిందులు వేశారు. అంపైర్లు పీపీఈలు ధరించి విధులు నిర్వర్తించారు. స్టేడియంలో ప్రవేశించేటప్పుడు ఆటగాళ్లు, అంపైర్లు, కోచ్‌లు, సిబ్బందికీ స్టేడియంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి.


ఈ సీజన్‌ సంగతేంటా అని అమెరికాలోని మేజర్‌ బేస్‌బాల్‌ లీగ్‌ నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారు. వారానికి ఆరు కేబీవో మ్యాచులు ప్రసారం చేసేందుకు ఈఎస్‌పీఎన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. సీజన్‌ మొదటి రోజైనా మంగళవారం శామ్‌సంగ్‌ లయన్స్‌, ఎన్‌సీ డినోస్‌ తలపడ్డాయి. ప్రొఫెషనల్‌ సాకర్‌ లీగ్‌ శుక్రవారం నుంచి ఆరంభమవుతుంది. ప్రేక్షకులు లేకుండానే సుమా!


చైనాలో వరుసగా మూడో వారం మరణాలేమీ నమోదవ్వలేదు. గతేడాది చివర్లో కరోనా వైరస్‌ పురుడు పోసుకుంది ఇక్కడేనన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఒక కొత్త కేసు నమోదైంది. 400 కన్నా తక్కువ మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.


ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని హాంకాంగ్‌, తైవాన్‌, వియత్నాం, థాయ్‌ల్యాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కరోనా జాడ మాయమైంది. కొత్తకేసులేమీ కనిపించలేదు. ఆసియాలో భారత్‌ మాత్రం ఇంకా గరిష్ఠ కేసులు చూడలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆరోగ్యసేతు తరహాలో బ్రిటన్‌ ఒక మొబైల్‌ యాప్‌ తీసుకువస్తోంది. కొవిడ్‌-19 సోకిన వ్యక్తికి చేరువగా వెళ్తే అలర్ట్‌ వస్తుంది. ఇంగ్లాండ్‌ సౌత్‌కోస్ట్‌లో దీనిని పరీక్షిస్తున్నారు. ఈ నెలాఖరుకు బ్రిటన్‌ కోలుకుంటుందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేయాలని ఆయనపై విమర్శలు వస్తున్నాయి.


అమెరికాలోని సౌత్‌ డకోటాలో పంది మాంసం ప్రాసెస్‌ కేంద్రం ఆరంభానికి చర్యలు మొదలయ్యాయి. ఇందులో 800 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఆ దేశంలో మొట్టమొదట ఇంట్లోనే ఉండాలని ఆంక్షలు జారీ చేసిన కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ శుక్రవారం నుంచి కొన్ని వ్యాపారాలు తెరవొచ్చని పేర్కొన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనాపై రాజకీయ పోరాటాలు కొనసాగుతున్నాయి. జాన్స్‌ హప్‌కిన్స్‌ వర్సిటీ ప్రకారం అమెరికాలో రోజూ 20వేలకు పైగా కొత్త కేసులు, 1000కి పైగా మరణాలు నమోదవుతున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా 2,51,000 మందికి పైగా మరణించారు. ఒక్క అమెరికాలోనే 69,000 మంది చనిపోయారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుండటంతో వ్యాక్సిన్‌ కనుగొనేందుకు రాజకీయ నాయకులు నిధులు విడుదల చేస్తున్నారు. శాస్త్రవేత్తలపై ఒత్తిడి నెలకొంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.