కరోనా ఎఫెక్ట్‌: రెండు పోలీస్‌ స్టేషన్లు మూత!
close

తాజా వార్తలు

Published : 26/04/2020 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎఫెక్ట్‌: రెండు పోలీస్‌ స్టేషన్లు మూత!

కోయంబత్తూర్‌: కరోనా వైరస్‌ పోలీసులకు కూడా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కోయంబత్తూర్‌లో ఆరుగురు పోలీసులకు కొవిడ్‌-19 నిర్ధారణ అయ్యింది. దీంతో వారు పనిచేసే పొదనూర్, కునియాముత్తూర్‌ పోలీసు స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మిగతా సిబ్బందిని స్థానిక ఫంక్షన్‌ హాళ్లకు తరలించారు. వీరితోపాటు కలిసి పనిచేసిన 105మంది పోలీస్‌ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా వీరందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని పోలీస్‌ కమిషనర్‌ సుమిత్‌ శరణ్‌ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన పోలీసులకు నగరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉంటే, తమిళనాడులో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. కేవలం శనివారం ఒక్కరోజే 66పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1821కి చేరింది. అయితే వీరిలో దాదాపు 900మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 23మంది మరణించారు. 

ముంబయిలో కానిస్టేబుల్‌ మృతి..

ముంబయిలో కరోనావైరస్‌ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. తాజాగా ముంబయి నగరంలో కరోనా వైరస్‌ సోకి కానిస్టేబుల్ మరణించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. దీంతో కరోనాతో నగరంలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 96మంది పోలీసులు ఈ వైరస్‌ బారినపడినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో 15మంది ఉన్నతాధికారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7628మంది కొవిడ్‌ బారినపడగా 323మంది మృత్యువాతపడ్డారు.

2368మంది ఖైదీలు విడుదల..

ఛత్తీస్‌గఢ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2368మంది ఖైదీలను విడుదల చేసినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తామ్రాధ్‌వాజ్‌ సాహు వెల్లడించారు. ఖైదీలు వైరస్‌బారిన పడకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఆరోగ్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మృతి..

కరోనా వైరస్‌తో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి మరణించిన సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో అసిస్టెంట్‌ హోదాలో ఉన్న అధికారి కరోనా సోకి ఈ ఉదయం మరణించినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 24గంటల్లో 1990 కేసులు 

మే 3 తర్వాత స్వదేశానికి భారతీయులు? 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని