close

తాజా వార్తలు

Updated : 09/11/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రంప్‌ వెళ్లేలోపు చైనాకు చుక్కలేనా?

బైడెన్‌ను ఇరుకున పెట్టేందుకేనంటున్న నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాతో సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ఇంకా నిరాకరిస్తున్న ట్రంప్‌ మిగిలి ఉన్న దాదాపు రెండు నెలల పదవీకాలంలో డ్రాగన్‌ను మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తద్వారా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదని నిపుణుల అభిప్రాయాల్ని పేర్కొంటూ ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఎందుకంటే..

వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆధిపత్యాన్నీ ట్రంప్‌ సవాల్‌ చేశారు. కరోనా వైరస్‌ను ‘చైనా వైరస్‌’గా పేర్కొని డ్రాగన్‌ను ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టారు. బైడెన్‌ రాకతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే, శతృత్వం పూర్తిగా తొలగిపోయే సూచనలు మాత్రం లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ చేతులు కట్టేసేలా.. చైనాతో సంబంధాల్ని ట్రంప్‌ మరింత జటిలం చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా అనేకసార్లు ‘చైనా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని’ ఆయన హెచ్చరించడం ఇక్కడ గమనార్హం.

అవే ట్రంప్‌ పావులు..

ఈ వ్యూహంలో భాగంగా తైవాన్‌ అంశాన్ని ఓ పావుగా వాడుకునే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల నిపుణుడు మార్క్‌ మాంగియర్‌ అభిప్రాయపడ్డారు. అలాగే, షింజియాంగ్ ప్రావిన్సులో వీగర్‌ ముస్లింలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణల్ని అడ్డంపెట్టుకొని ఇప్పటికే చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల వీసాల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరికొంత మందిని చేర్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే బీజింగ్‌లో జరగబోయే శీతాకాల ఒలింపిక్స్‌-2022లో పాల్గొనకుండా అమెరికా ఆటగాళ్లకు అడ్డంకులు సృష్టించే అవకాశమూ లేకపోలేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరిన్ని చైనా కంపెనీలపై ఆంక్షలు, మిలిటరీ సంబంధిత ఎగుమతులపై నిషేధం, టిక్‌టాక్‌, వీచాట్‌ తరహాలో మరిన్ని యాప్‌లపై నిషేధం, 5జీ నెట్‌వర్క్‌ సంస్థ హువావేకు సెమీకండక్టర్ల విక్రయాలపై నిషేధం వంటి చర్యలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

బైడెన్‌కూ తప్పదేమో..

అయితే, గత నాలుగేళ్లలో ట్రంప్‌ను దీటుగా ఎదుర్కొనే క్రమంలో చైనా సైతం దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు బైడెన్‌‌ సైతం ట్రంప్‌ విధానాల్ని మరో రూపంలోనైనా అమలు చేయక తప్పకపోవచ్చునని కార్నెల్‌ యూనివర్శిటీలో ‘లా అండ్‌ గవర్నమెంట్’ ప్రొఫెసర్‌ సారా క్రెప్స్‌ విశ్లేషించారు. ప్యూ రీసెర్చి సెంటర్‌ అధ్యయనం ప్రకారం.. అమెరికా జనాభాలో 73 శాతం మంది చైనాపై గుర్రుగా ఉన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన నాటితో పోలిస్తే ప్రస్తుతం డ్రాగన్‌పై వ్యతిరేకత యూఎస్‌లో తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యలో బైడెన్‌ విధానం ఎలా ఉండనుందో ఆసక్తికరంగా మారింది. మరోవైపు జనవరిలో అనివార్యంగా పదవి నుంచి దిగిపోవాల్సిన ట్రంప్‌.. ఓటమిని అంగీకరించి హుందాగా దిగిపోతారా లేక తన కక్ష్యపూరిత వైఖరితో బైడెన్ ముందు ముళ్లబాటను ఉంచి వెళతారా చూడాల్సి ఉంది! 

ఇదీ చదవండి..
బలపడనున్న బంధం


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని