
తాజా వార్తలు
చైనా సైన్యం కనుసన్నల్లో ఆ కంపెనీలు..!
శ్వేతసౌధం ఆరోపణ
మరికొన్ని సంస్థలపై ఆంక్షలు
వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం విధిస్తున్న ఆంక్షల పర్వం కొనసాగుతోంది. డ్రాగన్‌కు చెందిన ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’(పీఎల్ఏ)తో సంబంధాలున్నట్లు తేలిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాతో మరో 31 కంపెనీలను చేర్చింది. ఇవన్నీ పీఎల్ఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం ఆరోపించింది. ఆయా కంపెనీల్లో అమెరికన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడాన్ని, వాటాలు కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ గురువాం శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది.
నిషేధిత జాబితాలో చైనా టెలికం కార్పొరేషన్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, హిక్విజన్ వంటి ప్రముఖ టెలికం సంస్థలు ఉన్నాయి. జనవరి 11, 2021 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. అయితే, ఆయా కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన లావాదేవీలను పూర్తిచేయడానికి నవంబరు 11, 2021 వరకు గడువిచ్చారు.
చైనా తన సైనిక, నిఘా సహా ఇతర రక్షణ వ్యసవ్థలను ఆధునికీకరించుకునేందుకు అమెరికా పెట్టుబడుల్ని దుర్వినియోగం చేస్తోందని ఆ ఉత్తర్వుల్లో శ్వేతసౌధం ఆరోపించింది. తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే కావడం గమనార్హం. మిగిలిన కొన్ని రోజుల పదవీకాలంలో చైనాపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న నిపుణుల విశ్లేషణల నేపథ్యంలో ట్రంప్ పాలక వర్గం నుంచి ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. చైనా పట్ల తన విధానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో వివరించాల్సి ఉంది.
ఇదీ చదవండి..
ట్రంప్ వెళ్లేలోపు చైనాకు చుక్కలేనా?