close

తాజా వార్తలు

Published : 27/09/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఓ పాటసారీ... నిను మరువమోయీ!

నిత్య పరిమళాలు వెదజల్లే పాటల పూదోటను ప్రపంచం కోసం పదిలపర్చిన స్వర బ్రహ్మ సెలవు తీసుకున్నారు. సంగీతమే శ్వాసగా, పాటే ప్రాణంగా తుది వరకు గళ మాధుర్యాన్ని పంచిన గాన కళాతపస్వి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కుటుంబీకులు, అభిమానులు, సహచరులు, సినీ ప్రముఖులు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. చెన్నై శివారు తామరైపాక్కంలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియల క్రతువును ప్రారంభించారు. మంత్రోచ్చారణల మధ్య కుమారుడు చరణ్‌ ఈ ప్రక్రియ చేపట్టారు. అభిమానుల ఆర్తనాదాలు, అమర్‌రహే నినాదాలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వారికి డబ్బు చేసింది!

కరోనా కేసుల నమోదు తొలి రోజులలో చికిత్స అందించేందుకు ఒక్క ప్రైవేటు ఆసుపత్రీ ముందుకు రాలేదు. ప్రాణ భయంతో తలుపులే తెరవలేదు. వైరస్‌ బాధితుల్లో 85% మంది సాధారణ చికిత్సతోనే బాగవుతుండటం, ప్రభుత్వమూ ఒత్తిడి చేయడంతో  ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు క్రమంగా ఇటువైపు దృష్టిపెట్టాయి. మెరుగైన చికిత్సకు వీటిని ఆశ్రయిస్తున్న వారి నుంచి కొన్ని యాజమాన్యాలు లక్షలాది రూపాయలను గుంజుతున్నాయి. దాంతో బిల్లులు చెల్లించేందుకు పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేస్తూ... ఆస్తులు అమ్మేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కాసులు తిన్నారు కానివారి మృతదేహం ఇచ్చారు

3. చుక్‌చుక్‌ రైలు దొరకదులే!

దసరా.. దీపావళి.. జనవరిలో సంక్రాంతి. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా వస్తున్న పెద్ద పండగలు. ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవాళ్లు ఈ పండగలకు సొంతూరి బాట పడతారు. ఈ సమయాల్లో తిరిగే రైళ్లలో ఇప్పటికే దాదాపుగా రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌ లిస్ట్‌)లోనూ దొరికే పరిస్థితి లేదు. సంక్రాంతికి నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోవడంతో పండుగ ప్రయాణాలు వ్యయప్రయాసలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మత్తు దందా

బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. ఔషధాల తయారీకి ఇక్కడ అన్ని రకాల వనరులు విరివిగా లభిస్తుంటాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని ముఠాలు పేట్రేగిపోతున్నాయి. మాదకద్రవ్యాల్ని తయారు చేస్తున్నాయి. ఏకంగా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాయి. నష్టాల ఊబిలో ఉన్న పరిశ్రమలను అడ్డాగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నాయి. ఇటీవలే జిన్నారంలో రూ.వంద కోట్ల విలువైన మాదకద్రవ్యాల వ్యవహారం బహిర్గతమైన నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ’ బృందం మత్తు ముఠాల వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పలు విషయాలు వెలుగుచూశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘దిశ’ హత్యాచార ఘటనతో.. దిశ.. ఎన్‌కౌంటర్‌

గతేడాది హైదరాబాద్‌ శివార్లలో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడీ ఘటన ఆధారంగా ‘దిశ.. ఎన్‌కౌంటర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆనంద్‌ చంద్ర దర్శకుడు. అనురాగ్‌ కంచర్ల నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం  దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో.. నవంబరు 26 ఉదయం వెటర్నీ డాక్టర్‌ దిశ రోడ్డు పక్క తన స్కూటీ ఆపడం, అదే రోజు సాయంత్రం నలుగురు లారీ డ్రైవర్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడి.. ఆమెను సజీవ దహనం చేయడం వంటి సన్నివేశాలను చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వంట నూనెలకు డ్రాగన్‌ దెబ్బ

వర్షాకాలంలోనూ వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో హోటళ్లు, శుభకార్యాలు అంతగా లేకపోవడంతో నూనెలకు డిమాండు లేక ధరలు తగ్గాలి. కానీ గత పక్షం రోజుల్లోనే విజయ బ్రాండు పొద్దుతిరుగుడు లీటరు నూనె ధర రైతుబజార్లలోనే రూ.100 నుంచి 130కి పెరిగింది. బయటి చిల్లర మార్కెట్లలో బ్రాండును బట్టి రూ.140కి పైగా ధర పలుకుతోంది. గత నెల ఒకటో తేదీతో పోలిస్తే ఏకంగా రూ.30 అదనంగా పెరిగింది. ఇదొక్కటే కాకుండా వేరుసెనగ, రైస్‌బ్రాన్‌, పామాయిల్‌ ధరలూ మండిపోతున్నాయి. ‘విజయ’ బ్రాండు పేరుతో వంటనూనెలను విక్రయిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తగ్గనున్న ఎంబీబీఎస్‌ ఫీజులు!

 పీజీలో తగ్గినట్లే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్యలోనూ యాజమాన్య కోటా ఫీజులు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ వెల్లడించారు. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ‘బి’ కేటగిరీ సీటును రూ.13,37,057తో భర్తీ చేసినట్లు తెలిపారు. దాంతో ఈ విద్యా సంవత్సరం పీజీ వైద్యవిద్యలో ఫీజులు తగ్గాయన్నారు. వీటి ప్రకారం ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ ‘బి’ కేటగిరీ సీటు ఫీజు రూ.3 లక్షల వరకు తగ్గొచ్చని చెప్పారు. దీనికి అనుగుణంగానే ‘సి’ కేటగిరీ సీట్ల ఫీజులూ తగ్గుతాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వారసత్వం కాదు ధీరసత్వం!

అబ్బాయిపుడితే... ‘నా తర్వాత నువ్వేరా... ’ అంటాడు నాన్న ఆస్తికయినా, అస్తిత్వానికైనా మా వారసుడివి నువ్వే అనే అర్థం వచ్చేలా! అబ్బాయిలో... విరాట్‌కోహ్లీ, జుకర్‌బర్గ్‌లు కనబడతారు కానీ అమ్మాయిలో మాత్రం పెళ్లిఖర్చే కనబడుతుంది.... అమ్మాయంటే ఖర్చేనా... మరేం కాదా? ఎందుక్కాదూ.... అమ్మాయంటే నిలువెత్తు ప్రేమ..సంద్రమంత బంధం... అన్నింటికంటే ముఖ్యంగా సవాళ్లని సైతం వారసత్వంగా అందిపుచ్చుకునే సమర్థత. అవన్నీ తమకున్నాయని నిరూపించారు వీళ్లంతా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మిస్త్రీ వాటాకు డబ్బులెలా?

స్వయంగా రతన్‌ టాటానే సైరస్‌ మిస్త్రీ చేయిపట్టుకుని టాటా సన్స్‌ ఛైర్మన్‌ సీట్లో కూర్చోబెట్టారు. అది జరిగింది 2012లో. అయిదేళ్లు తిరిగేసరికి.. అదే మిస్త్రీని ఆ సీటు దిగి వెళ్లిపొమ్మంటూ గ్రూప్‌ ప్రకటించింది. కార్పొరేట్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఏమిటిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? అని తలలు బద్దలు కొట్టుకున్నారు. అయితే టాటా సన్స్‌లో మైనారిటీ వాటాదార్లుగా ఎస్‌పీ గ్రూప్‌ కొనసాగుతూ వచ్చింది. కాలచక్రం మరో నాలుగేళ్లు తిరిగింది. ఇపుడు ఉన్న ఆ కాస్త బంధం కూడా తెగిపోతోంది. టాటాసన్స్‌లో తమకున్న మైనారిటీ వాటాను తెగనమ్ముకుని బయటకు వచ్చేయాలని మిస్త్రీ బృందం భావిస్తున్నారు. ఇపుడు ఆ వాటాను కొనుగోలు చేయడం టాటాలకు అంత సులువా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇదేం అంపైరింగ్‌?

పీఎల్‌లో పేలవ అంపైరింగ్‌పై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ అంపైరింగ్‌ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. టోర్నీ రెండో రోజు పంజాబ్‌ ఆటగాడు జోర్డాన్‌ రెండో పరుగు సరిగ్గానే పూర్తి చేసినప్పటికీ.. అతను క్రీజులో బ్యాటు పెట్టలేదంటూ ఫీల్డ్‌ అంపైర్‌ ఒక పరుగు తక్కువ ఇవ్వడం మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేయడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. తర్వాత రాజస్థాన్‌-చెన్నై మ్యాచ్‌లో ఒక అంపైర్‌ నిర్ణయం అయితే విస్మయానికి గురి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జోరు కొనసాగించేదెవరు?


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.