close

తాజా వార్తలు

Updated : 25/09/2020 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. చైనా తగ్గితేనే.. కొండ దిగేది!

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా తన పద్ధతి మార్చుకునే వరకూ కీలకమైన పర్వత శిఖరాల నుంచి తన బలగాలను వెనక్కి తీసుకోరాదని భారత్‌ గట్టిగా భావిస్తోంది. తద్వారా డ్రాగన్‌ సేనపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకుంది. మరోవైపు.. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో వెలువడిన ఉమ్మడి ప్రకటనలతో పరిస్థితి మరింత అదుపు తప్పకుండా.. స్థిరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఇటీవల భారత్‌, చైనాల మధ్య విదేశాంగ మంత్రులు, కోర్‌ కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రెండు ఉమ్మడి ప్రకటనలు వెలువడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 57,621 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,381 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1080కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,021 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,50,160కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పది కాలాలు.. ప్రజలకు మేలు

3. ఎస్పీ బాలు పరిస్థితి విషమం

సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కరోనా సోకి.. స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు.. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. వ్యాధి పూర్తిగా నయం కావడంతో ఇక వీలైనంత త్వరలోనే తన తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవుతారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ కూడా చెప్పారు. ఆసుపత్రిలో రోజూ దాదాపు 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారని, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌లో నేటి నుంచి సిటీ బస్సులు

సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌ సిటీ బస్సులతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్‌ రాష్ట్ర బస్సులు శుక్రవారం నుంచి నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. తొలిదశలో కేవలం 25 శాతం మాత్రమే సిటీ బస్సులను నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇచ్చారన్నారు. కరోనా నేపథ్యంలో గడిచిన ఆరు నెలలుగా హైదరాబాద్‌ సిటీ, అంతర్‌ రాష్ట్ర బస్సులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల వ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌... గురువారం మంత్రి పువ్వాడతో సమీక్షించారు. ‘‘నగర శివార్ల నుంచి ఇతర ప్రాంతాలకు బుధవారం 150 బస్సులను ప్రారంభించాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాదు.. కాదంటూనే తరలింపు!

 విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయాన్ని మరో ప్రాంతానికి మార్చారు. సామగ్రిని తరలిస్తున్నారు. ఈ మేరకు నోటీసులో పేర్కొన్నారు. అద్దెభారం ఎక్కువగా ఉండటంతో మరో ప్రాంతానికి మార్చుతున్నట్లు ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి చెప్పారు. మరోవైపు విశాఖలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే.. అదే ప్రధాన కార్యాలయం కానుందని తెలుస్తోంది. అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) పేరుతో 2014లో విజయవాడలో ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రయోగాత్మకంగా ఆరోగ్యవంతుల్లోకి కరోనా

కొవిడ్‌-19 నివారణ టీకా అభివృద్ధిలో భాగంగా ‘సవాళ్లతో కూడిన ప్రయోగాన్ని’ చేపట్టనున్నట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టీకా పొందిన ఆరోగ్యవంతులైన వాలంటీర్లలోకి కరోనా వైరస్‌ను చొప్పిస్తామని చెప్పారు. ఈ టీకా ద్వారా రక్షణ లభిస్తుందా అన్నది పరిశీలించడం దీని ఉద్దేశమని తెలిపారు. తొలిసారిగా ఈ తరహా ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. దీనిపై లాంఛనంగా త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రయోగం జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సివంగిలా దూకబోతోంది!

భారత నారీమణులు త్రివిధ దళాల్లో తమ సత్తా చాటుతున్నారు. మొన్న.. ఆర్మీలో శాశ్వత కమిషన్‌లోకి అడుగుపెట్టారు. నిన్న.. నేవీ యుద్ధ నౌకల్లోని మల్టీరోల్‌ హెలికాప్టర్లు వారి చేతికి వచ్చాయి. నేడు.. వాయుసేనకు చెందిన ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం ఓ మహిళ దక్కించుకుంది. తొలి మహిళా రఫేల్‌ ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించబోతోన్న ఆ సివంగి... ఫ్లయిట్‌ లఫె్టినెంట్‌ శివాంగీ సింగ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎప్పుడొచ్చామని కాదు.. అదరగొట్టామా? లేదా?

సలే కరోనా కాలం.. అయితేనేం పబ్లిక్‌ ఇష్యూలు అదరగొడుతున్నాయి. జులై నుంచి ఇప్పటివరకు మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి.. ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఆ కంపెనీలు.. రొసారీ బయోటెక్‌, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌, రూట్‌ మొబైల్‌. ఈ మూడు ఇష్యూలకు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి రోజే ఈ కంపెనీల షేర్లు మదుపర్లపై లాభాల వర్షం కురిపించాయి. హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ షేర్లు మదుపర్ల పెట్టుబడిని మొదటి రోజే రెట్టింపు చేయగా.. మిగిలిన రెండు కంపెనీల షేర్లు 74%, 86% చొప్పున లాభపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రకుల్‌ నేడు.. దీపిక రేపు

సుశాంత్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద ఆత్మహత్య కేసులో మాదకద్రవ్యాల కోణం దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్‌సీబీ)ముందు శుక్రవారం నటీమణులు రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. శనివారం దీపిక పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాదాస్‌ హజరుకానున్నారు. ఈ మేరకు ఎన్‌సీబీ వర్గాలు ధ్రువీకరించాయి. రకుల్‌కు సమన్లు జారీ చేశామని.. ఆమె అందుకుందని, విచారణకు సహకరిస్తానని తెలిపారని అధికారులు చెప్పారు శుక్రవారం రకుల్‌తో పాటు.. దీపిక మేనేజర్‌ కరిష్మ ప్రకాశ్‌ను కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాహుల్‌ 132.. బెంగళూరు 109

యూఏఈ కూడా బెంగళూరు రాత మార్చలేదేమో! ఐపీఎల్‌ వేదిక మారినా.. కోహ్లీసేన ఆట మాత్రం అదే. విజయంతో టోర్నీలో బోణీ కొట్టిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లోనే పాత తడబాటును ఏమాత్రం తేడా లేకుండా ప్రదర్శించింది. కనీస పోరాటమైనా లేకుండా చేతులెత్తేసింది. అదే సమయంలో పంజాబ్‌ బలంగా పుంజుకుంది. కెప్టెన్‌ రాహుల్‌ అదరగొట్టిన వేళ.. ఆరంభ మ్యాచ్‌ షాక్‌ నుంచి తేరుకుంటూ బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. చూడచక్కని బ్యాటింగ్‌తో అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేసిన రాహుల్‌.. కడ బంతి వరకూ క్రీజులో నిలిచి ఈ సీజన్‌కే తొలి శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.