close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలి: సుప్రీం

దేశ ప్రజలందరికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. శశాంక్‌ డియో సుధి అనే న్యాయవాది వేసిన వ్యాజ్యాన్ని విచారించిన  ధర్మాసనం ఈ సూచన చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రూ.4,500 వసూలు చేసేలా ప్రైవేటు ల్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘కరోనా పరీక్షల కోసం పెద్ద మొత్తంలో వసూలు చేసేలా ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతినివ్వకూడదు. ప్రభుత్వమే దీనికి సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ మరో 49 పాజిటివ్‌ కేసులు: ఈటల

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం వరకు కొత్తగా 49మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరుకుందన్నారు. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏపీలో 19 పాజిటివ్‌ కేసులు

3. అలాంటి వాళ్లనే సీఎం విమర్శించారు: తలసాని

 కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లనే సీఎం కేసీఆర్‌ విమర్శించారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అంటే తమకు గౌరవమేనని.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామని మంత్రి చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేరళ పోలీసుల డ్రోన్‌ పరుగో పరుగు.. వీడియో 

 దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. దీనికనుగుణంగా కొందరు నిబంధనలకు లోబడి లాక్‌డౌన్‌ పాటిస్తున్నప్పటికీ కొందరు ఆకతాయిలు మాత్రం నిబంధనలు ఉల్లఘించి పోలీసులకు తలనొప్పిగా మారారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నింబంధనలు ఉల్లఘించే వారి ఆటకట్టించేందుకు కేరళ పోలీసులు విన్నూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. డ్రోన్‌ కెమెరాలతో వారిపై నిఘాను పెట్టారు. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం ప్రజలు గుమిగూడటం ఉండటం కనిపించింది. అయితే డ్రోన్‌ కెమెరాలను చూసిన వెంటనే ప్రజలు చెల్లాచెదురుగా పరిగెత్తడం వీడియోలో చూడొచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వేతనాల కోతపై హైకోర్టులో విచారణ

ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను తెలంగాణ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. సీనియర్‌ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్‌ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అమర్‌నాథ్‌ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా

ఏపీలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో ఈ ఒక్కరోజే 7 పాజిటివ్‌ కేసులు నమోదవగా వారిలో నలుగురు వైద్య సిబ్బంది ఉన్నట్లు డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌ వెల్లడించారు. వైద్యసిబ్బంది అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చెందినవారని ఆయన తెలిపారు. చికిత్స సమయంలో జరిగిన పొరపాటు వల్ల సిబ్బందికి వైరస్‌ సోకిందన్నారు. ఇటీవల హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందాడని.. అతడికి చికిత్స చేసిన వైద్య సిబ్బందికీ కరోనా సోకినట్లు తాజాగా నిర్ధారణ అయిందని వివరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐటీ శాఖ గుడ్‌న్యూస్‌

రోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. ఐదు లక్షల రూపాయల్లోపు ఉన్న రిఫండ్‌లను తక్షణం విడుదల చేయనున్నారు. ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఉపశమనం లభించనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా అదుపులోకి వచ్చేవరకు విమానాలు బంద్!

8. నిన్న భిల్వారా.. నేడు జబల్పూర్‌

 ప్రపంచమంతా కరోనా వైరస్‌తో వణికిపోతోంది. దీని నివారణకు విరుగుడుగా లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం పైగా ప్రజలు వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేసిన జబల్పూర్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో యావత్‌ దేశం దృష్టి జబల్పూర్‌పై పడింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీసు విచారణకు తబ్లిగీ జమాత్‌ అధినేత

క్వారంటైన్‌ ముగియగానే తబ్లిగీ జమాత్‌ ప్రధాన నేత మౌలానా సాద్‌ ఖాందల్వి విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. సాద్‌ సహా ఏడుగురిపై దిల్లీ పోలీసు నేర విభాగం మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యక్తిగత దూరం పాటించలేదని నిజాముద్దీన్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు చేశారు. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 91 ప్రకారం వివరాలు కోరుతూ దిల్లీ నేర విభాగం బుధవారం సాద్‌కు లేఖ రాసింది. ‘ప్రస్తుతం సాద్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. 14 రోజుల గడువు పూర్తవ్వగానే విచారణకు హాజరవుతారు’ అని ఆయన తరఫున న్యాయవాది తౌసీఫ్ ఖాన్‌ మీడియాకు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ముంబయిలో మాస్క్‌ తప్పనిసరి

10. రోగనిరోధక శక్తికి సోనాలీ 3 చిట్కాలివే!

శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే మూడు చిట్కాల్ని పంచుకున్నారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో మనలోని ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనకు క్యాన్సర్‌ ఉందని తెలిసిన తర్వాత పాటించిన మూడు ఆరోగ్య సూత్రాల్ని అందులో చెప్పారు. మొదటిది ముఖానికి ఆవిరి పట్టుకోవడం, రెండోది గ్లాసు వేడి నీరు తాగడం. మూడోది... ఆపిల్‌, క్యారెట్‌, అల్లం, ఆల్మాండ్‌, తాజా పసుపు, ఉసిరి తదితర పదార్థాల్ని కలిపి జ్యూస్‌చేసి తాగమని కోరారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.