close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. లాక్‌డౌన్‌ ఎత్తివేత కుదరకపోవచ్చు: మోదీ

దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ దీనికి హాజరయ్యారు. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్‌-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వెల్లడించారు. ‘వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతలతో మోదీ పేర్కొన్నారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘లాక్‌డౌన్‌ ఆంక్షలు వైకాపా నేతలకు వర్తించవా?’

 లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి నగదును వైకాపా నేతలు పంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వైకాపా అభ్యర్థులు ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. అధికారులు చేయాల్సిన పని వైకాపా అభ్యర్థులు చేస్తున్నప్పటికీ అటు పోలీసులు, ఇటు జిల్లా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దన్న ప్రభుత్వం ఆంక్షలు వైకాపా నేతలకు వర్తించవా అని కాలవ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రోజుకు 2వేల ర్యాపిడ్‌ కిట్లు:మంత్రి గౌతమ్‌రెడ్డి

రాష్ట్రంలో మాస్కులు, పీపీఈలు తయారుచేసేందుకు అనుమతిచ్చామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. నిత్యావసరాలు తయారు చేసే పరిశ్రమలకు కావాల్సిన ముడిసరకు అందిస్తామని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ ఖర్చుతోనే కరోనా నిర్ధరణ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పరిశ్రమలకు కార్మికుల సమస్య లేకుండా చేస్తున్నామని చెప్పారు. మే నాటికి 7.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తామన్నారు. ఈ పీపీఈలు మన అవసరాలకు ఉంచుకుని మిగతా రాష్ట్రాలకు పంపిస్తామని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లాక్‌డౌన్‌ పొడిగింపును పరిశీలిస్తున్నాం

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. ‘‘ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.  అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. తాజా కూరగాయలు అవసరంలేదు..పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* యూపీలో పోలీసుసిబ్బందికి రూ.50లక్షల బీమా

5. కరోనా:న్యూయార్క్‌కు మరోసారి తీరని ఆవేదన

కరోనా వైరస్‌ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇక ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న న్యూయార్క్‌లో నిన్న ఒక్కరోజులో 731 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఆ మహానగరంలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4000కు చేరుకుంది. కాగా, ఇది నాటి 9/11 ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య కంటే అధికంగా ఉండటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా పోరులో..కారులోనే వైద్యుడి నివాసం!

ప్రపంచంపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరులో వైద్యులే యోధులుగా మారుతున్నారు. వృత్తిధర్మంలో భాగంగా తమ ప్రాణాలను పణంగాపెట్టి బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఎంతోమందిని కదిలిస్తోంది. ఇలాంటి అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వారి కుటుంబాలకే దూరంగా ఉంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారులోనే నివాసమున్న ఘటన అందర్నీ ఆకర్షిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* దాక్కుంటే శిక్ష తప్పదు

7. కరోనా: బ్రెజిల్ అధ్యక్షుడి నోట రామాయణం

 కొవిడ్ 19 చికిత్స నిమిత్తం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలంటూ కోరిన దేశాల జాబితాలో ఇప్పుడు బ్రెజిల్ కూడా చేరింది. డ్రగ్ పంపిణీ గురించి మాట్లాడుతూ భారత ఇతిహాసమైన రామాయణం ప్రస్తావన తెచ్చారు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో. ఇప్పటికే అమెరికాకు ఈ ఔషధాలు సరఫరా చేయడానికి భారత్ అంగీకరించిన సంగతి తెలిసిందే. మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం జైర్‌ భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘పురాణ పురుషుడు రాముడి సోదరుడు లక్ష్మణుడిని రక్షించడం కోసం హిమాలయాల నుంచి హనుమంతుడు ఔషధాన్ని తీసుకువచ్చాడు. జీసస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నవారిని స్వస్థపరిచాడు. అలాగే  ప్రజల రక్షణార్థం కరోనా కట్టడికి మనం కలిసి పనిచేద్దాం’ అని దానిలో కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మళ్లీ 30వేల దిగువకు

దేశీయ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. కరోనా కష్టాల నుంచి కోలుకుని నిన్న ఒక్కసారిగా దాదాపు 2500 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌ మళ్లీ 30వేల దిగువకు చేరుకుంది. రోజు మొత్తం షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య సుమారు 1600 పాయింట్లు కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 173.25 పాయింట్ల నష్టంతో 29,893.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 43.45 పాయింట్లు కోల్పోయి 8,748.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.37 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాస్కు వల్ల చారలా? ఇలా చేయండి!

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అందరూ సూచిస్తున్న అంశాల్లో ఒకటి భౌతిక దూరం.. మరొకటి మాస్క్‌. నిత్యం మాస్కు ధరించడం వల్ల చాలామందికి ముక్కు, ముఖం మీద చారలు వస్తున్నాయి. అత్యవసర విధులు నిర్వహించే వారు ఈ విషయంలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ముఖానికి మాస్కు ధరించడం వల్ల ముక్కు పైభాగం, బుగ్గల దగ్గర ఎక్కువగా చారలు వస్తుంటాయి. ఈ ఇబ్బంది తొలగడానికి చర్మ ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అక్టోబర్‌లో మాత్రమే ఐపీఎల్‌ సాధ్యం: నెహ్రా

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వహించడం సాధ్యం కాదని, అక్టోబర్‌లో అయితే పూర్తి ఐపీఎల్ జరుగుతుందని టీమ్ఇండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘‘ఆగస్టులో ఐపీఎల్‌ను నిర్వహిస్తే ఎక్కువ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతాడు. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో ఎన్నో ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్‌లో అయితే అనుకూల వాతావరణం ఉంటుంది. 100 శాతం పూర్తి ఐపీఎల్ సాధ్యమవుతుంది’’ అని నెహ్రా అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.