close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. రేషన్‌దుకాణాల ఎదుట నిలబెట్టడం సరికాదు

కరోనా వ్యాప్తి దృష్ట్యా రేషన్‌ దుకాణాల ఎదుట ప్రజలను క్యూలో నిలబెట్టడం తగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వల్ల ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. 4.55 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇళ్లకే నిత్యవసరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రతి కుంటుంబానికి తక్షణమే రూ.5 వేలు చెల్లించాలి. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. గిట్టుబాటు ధర రావడం లేదు. ఉద్యాన పంటలు, ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అక్రమ మద్యం విక్రయాలను తక్షణమే నిలిపివేయాలి’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం  

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్‌ చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ఇవాళ సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో  చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా వేళ.. ఇంటింటికీ రేషన్‌ ఎలా?: కొడాలి

రాష్ట్రంలో ఇంటింటికీ నాణ్యమైన బియ్యం అందించే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న దృష్ట్యా రేషన్‌ దుకాణాల్లో వేలి ముద్ర వెయ్యెద్దని సీఎం జగన్‌ ఆదేశించినందునే  బయోమెట్రిక్‌ విధానాన్ని  అమలు చేయడం లేదన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంటే రేషన్‌ను ఇంటింటికీ ఎలా పంపిణీ చేస్తామని ప్రశ్నించారు. ప్యాకేజింగ్‌ పద్ధతి ఏపీలో ఇంకా అమలులోకి రాలేదని.. దీనివల్లే చౌక దుకాణాల ద్వారా బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనాపై వదంతుల వ్యాప్తిని అరికట్టండి: సుప్రీం

వలస కూలీలు, కరోనా నివారణ చర్యలపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు వలసకార్మికుల పరిస్థితిపై నేడు కేంద్రం కోర్టుకు స్టేటస్‌ రిపోర్టును సమర్పించింది. దేశంలో 4.14 కోట్ల మంది వలసదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. కరోనాపై వస్తున్న వదంతుల వల్లే భయంతో వారంతా స్వస్థలాలకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారని కోర్టు దృష్టికి సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. బాధితుల చికిత్సకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. వదంతుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరిగే అవకాశం

రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. దిల్లీ వెళ్లి వచ్చిన వారికి సంబంధించి కొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరి కొన్ని పాజిటివ్‌ కేసులు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలో 3,500 మందిని క్వారంటైన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. దిల్లీలో మత ప్రార్థనలకు ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి వెళ్లారని, ఆయా రైళ్లలో వారితో పాటు ప్రయాణించిన ప్రకాశం జిల్లా వాసులపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గుంటూరులో ఆ 39 మంది కోసం అన్వేషణ

6. లైసెన్సు, పర్మిట్లు జూన్ 30వరకు చెల్లుబాటు!

వాహనదారులకు ఉపశమనం కలిగించే విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలం ముగిసిపోయే అన్ని వాహనాల పర్మిట్లు, ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు ఇతర డాకుమెంట్లు జూన్‌ 30వరకూ చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. దీంతో ఇప్పటికే గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు మోటార్‌ వాహన చట్టం కింద వచ్చే అన్ని పత్రాలు జూన్‌ 30వరకు చెల్లుబాటు అవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముఖం తాకకుండా ఉండండిలా...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ఈ వైరస్‌ బారి నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించాలి.. సబ్బుతో చేతులు కడగాలి.. శుభ్రత పాటించాలి.. ముఖంపై చేతులు పెట్టకూడదని నిపుణులు సలహాలిస్తున్నారు. మనమూ జాగ్రత్త వహిస్తూ తుమ్ము వచ్చినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకుంటున్నాం. శానిటైజర్లతో చేతులు శుభ్రపర్చుకుంటున్నాం.. మరి ముఖంపై చేతులు పెట్టకుండా ఉంటున్నామా? చేతులకు అంటిన వైరస్‌ కళ్లు, ముక్కు, నోరు ద్వారా త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే అన్నింటికన్నా ముఖ్యంగా మన చేతులు మన ముఖాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా నిజం.. కఠిన పాఠం..!

8. అలాంటి వారికి మద్యం కోసం ప్రత్యేక పాసులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం లభించక వింతగా ప్రవర్తిస్తున్న వారు మద్యం కొనుగోలు చేసుకునేలా అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లు జారీచేయాలని నిర్ణయించింది. అయితే దీనికి వైద్యుల నుంచి మద్యానికి బానిస అయినట్లుగా ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంది. అప్పుడే ఎక్సైజ్‌ శాఖ వారికి అనుమతిస్తుంది. దీన్ని వైద్యుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికి.. మందు బాబులు సమాజంలో వింతగా ప్రవర్తించడం, ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మద్యం దుకాణాలను తెరిచేది కేవలం వాళ్ల ప్రయోజనం కోసమేని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 1028 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

భారత స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కరోనా భయం ఇంకా కొనసాగుతున్నప్పటికీ మదుపర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ 1,028.17 పాయింట్లు లేదా 3.62 శాతం, లాభపడి 29,468.49 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఏకంగా 316.65 పాయింట్లు (3.82%) ఎగబాకి 8597.75 వద్ద ముగిసింది. 1495 కంపెనీల షేర్ల ధరలు పెరగగా 767 సంస్థల షేర్ల ధరల తగ్గుముఖం పట్టాయి. 150 కంపెనీల షేర్ల ధరల్లో మార్పు లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: కరోనా లాక్‌డౌన్‌ ఏడో రోజు

దిల్లీలో ఇటీవల జరిగిన ప్రార్థనలకు హాజరై వచ్చినవారిలో పలువురికి కరోనా పాజిటివ్‌ ఉండడంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దిల్లీకి వెళ్లినవారితో పాటు వారి కుటుంబ సభ్యులను గుర్తించి అనుమానితుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. వారిని ఇంట్లోనే క్వారంటైన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితోపాటు మత ప్రార్థనలకు వెళ్లినవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో కరోనా విస్తరించకుండా లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాల్సిన సమయమిది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఏడో రోజు చిత్రాలు మీ కోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.