close

తాజా వార్తలు

వాళ్లు నేరస్థులు కాదు.. విద్యార్థులు

ఈ అంశంమీదే అమెరికా అధికారులతో గట్టిగా చర్చిస్తున్నాం
 ‘ఈనాడు’తో కాబోయే తానా అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరి

హైదరాబాద్‌: ‘అమెరికాలో ఇమిగ్రేషన్‌, భద్రతా విభాగాలు అరెస్టు చేసిన విద్యార్థులు నేరస్థులు కాదని అధికారులతో గట్టిగా చర్చిస్తున్నాం. సీపీటీ ఇచ్చారు కాబట్టే, వారు తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారని, ఇవ్వకుంటే చేయరు కదా.. అని వాదిస్తున్నాం’ అని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు కాబోయే అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరి అన్నారు. తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం 130 మంది పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. అమెరికాలో 28 రాష్ట్రాల్లో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని, అన్నిచోట్లా న్యాయవాదులను నియమించాల్సి రావడం సమస్యగా పరిణమిస్తోందని జయ్‌ అన్నారు. అయినా, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై అన్ని తెలుగు సంఘాలతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. భద్రాచలానికి చెందిన జయ్‌ ఏడాది క్రితం జరిగిన తానా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన ఈ ఏడాది జులైలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ పదవిలో 2021 జులై వరకు ఉంటారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్టు గురించి ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖాముఖి సారాంశం ఆయన మాటల్లోనే..

తల్లిదండ్రుల ఆర్థిక చేయూత అవసరం
అమెరికాలోని వర్సిటీల్లో రుసుములు ఎక్కువ ఉండటంతో తల్లిదండ్రులపై భారం పడకూడదని విద్యార్థులు వర్సిటీల్లో చేరిన నాటి నుంచే సంపాదన వైపు దృష్టి సారిస్తున్నారు. సంపాదించాలనే తపనతో నిబంధనలను ఉల్లంఘిస్తే అసలుకే ఎసరు వస్తుంది. అమెరికాలో స్థిరపడాలనే కలలు కల్లలవుతాయి. అమెరికాలో ప్రవేశం తర్వాత పిల్లలు ఫీజులకు డబ్బులు అడగకుంటే అక్కడ ఏం చేస్తున్నారనేదీ తల్లిదండ్రులే ఆరా తీయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని చెప్పాలి. కొంతకాలమైనా వారికి ఆర్థికంగా అండగా నిలవాలి.

వీసా మార్పు మనవాళ్లకు ప్రయోజనమే
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020 అక్టోబరు 1 నుంచి ప్రారంభం) హెచ్‌1బీ వీసాల జారీలో మార్పులు చేస్తుండటం మంచిదే. దానివల్ల అమెరికాలో చదివిన విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు 65 వేల సాధారణ హెచ్‌1బీ వీసాలను విదేశీ ఉద్యోగులకు, 20 వేల వీసాలను ప్రత్యేకంగా అమెరికాలో చదివిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఇక నుంచి 65 వేలలో కూడా విద్యార్థుల దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వనుండటం వల్ల అదనంగా 16% (5,340 మంది) విదేశీ విద్యార్థులకు దక్కుతాయి. హెచ్‌1బీ వీసాల్లో గరిష్ఠ వాటా భారతీయ విద్యార్థులకే అందుతుంది. రానున్న ఏప్రిల్‌ 1 నుంచి వీసాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అందువల్ల అమెరికా చదువుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని అనుకోవడం లేదు.

ఉత్తమ వర్సిటీల్లోనే ఉజ్వల భవిష్యత్తు
ఉత్తమ వర్సిటీల్లో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలి. అందుకు జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లాంటి స్కోర్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడం మంచిది. ఇప్పుడు ఫర్మింగ్టన్‌ విశ్వవిద్యాలయం తరహాలో ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేం. జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.