close

తాజా వార్తలు

Updated : 10/03/2020 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారి ‘వార్‌’లో ట్రంపే బాధితుడు..!

 కుదేలవనున్న అమెరికా షెల్‌ చమురు కంపెనీలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఎన్నికల వేళ పాపం ట్రంప్‌కు కష్టాలు ఎదురొస్తున్నట్లున్నాయి. కష్టపడి సిరియా, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌లలో ఏదో చేశానని చెప్పుకొందామనుకుంటే అక్కడ పరిస్థితులు ఎదురుతన్నుతున్నాయి. మరోపక్క చైనాతో ట్రేడ్‌వార్‌ బొప్పికట్టడంతో ఎన్నికలకు ముందు రాజీ చేసుకొని బయటపడ్డారు. ఇప్పుడు తనకు ఏమాత్రం సంబంధంలేని ఒపెక్‌+, రష్యా మధ్య వివాదంలో ట్రంప్‌ అదేనండి.. అమెరికా బాధిత దేశంగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

చమురు ఉత్పత్తి ఖరీదే కీలకం..

ప్రపంచంలో చమురు నిల్వలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. కానీ, అవి చమురు ఉత్పత్తి చేసే ధర కీలకం. చమురు లభించే ఉపరితలం, ఉపయోగించాల్సిన టెక్నాలజీ, ముడిచమురు నాణ్యత వంటివి దీనిని ప్రభావితం చేస్తాయి. సముద్రంలో చమురు ఉత్పత్తితో పోలిస్తే భూమిపై నుంచి వెలికి తీయడం కొంచెం చౌకగా ఉంటుంది. ఈ విధానంలో నిలువుగా భూమిపై డ్రిల్లింగ్‌ చేసి చమురును వెలికి తీస్తారు. ఇది లభించే లోతు.. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయి. మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌ వంటి గల్ఫ్‌ దేశాల్లో తక్కువ ఖర్చవుతుంది. పన్నులను తొలగిస్తే రష్యా వీటి తర్వాతి స్థానంలో నిలుస్తుంది. ఉత్పత్తి ఖర్చు బ్యారెల్‌కు సౌదీలో 3డాలర్ల వరకు ఉండగా.. రష్యాలో కూడా అంతే ఉంది. కాకపోతే రష్యాలో మూలధన వ్యయం, పన్నులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ధర మొత్తం మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. 

ఇక షెల్‌ విధానంలో చమురు ఉత్పత్తి అంటే భారీ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. అత్యున్నత స్థాయి సాంకేతికతను వాడతారు. భూమిలో చాలా లోతుకు నిలువుగా డ్రిల్లింగ్‌ చేసి మళ్లీ అక్కడి నుంచి 90డిగ్రీల కోణంలో అడ్డంగా డ్రిల్‌ చేసుకొంటు చమురు నిల్వలను చేరుకొని వాటిని ప్రత్యేకమైన టెక్నాలజీతో వెలికి తీస్తారు. ఇదంతా భారీ ఖర్చుతో కూడుకొన్నది.అమెరికా, కెనడాల్లో ఇప్పుడు షెల్‌ విధానంలో చమురు ఉత్పత్తి భారీగా జరుగుతోంది. అమెరికాలో షెల్‌ విధానంలో ఖర్చు వీటికి రెట్టింపు ఉంది. దీనికి తోడు మూలధన వ్యయం, పన్నులు, రవాణా ఖర్చుతో కలిపి తడిసి మోపెడవుతుంది. 2016 లెక్కల ప్రకారం ఇవన్ని కలుపుకొని బ్యారల్‌కు 23.35 డాలర్ల వరకు ఖర్చవుతోంది. అదే కఠిన ప్రదేశాల్లో చమురు ఉత్పత్తికి అత్యధికంగా బ్యారెల్‌కు 90డాలర్లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది.

అతిపెద్ద ఉత్పత్తిదారుకే ఎక్కువ దెబ్బ..

2018 లెక్కల ప్రకారం అమెరికా రోజుకు 17,886,000 పీపాల చమురును ఉత్పత్తి చేసింది. అదే సౌదీ 12,419,000, రష్యా 11,401,000 పీపాల చమురును ప్రతిరోజు ఉత్పత్తి చేశాయి. కానీ, వీరిలో అమెరికా చమురు ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. పీపాకు 23.35 డాలర్లు ఖర్చై ధర 40 డాలర్లలోపుగా పడిపోతే అమెరికా షెల్‌ కంపెనీల లాభం ఎక్కువ శాతం ఆవిరైపోతుంది. అదే 20 డాలర్లకు అటుఇటుగా ధర చేరిందో.. అమెరికా  కంపెనీలు నష్టాలబారినపడటమో.. ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొనడమో జరుగుతుంది. ఇప్పటికే డైమండ్‌బ్యాక్‌ ఎనర్జీ ఐఎన్‌సీ, పార్స్‌లే ఎనర్జీ ఐఎన్‌సీలు డ్రిల్లింగ్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అప్పుడు ఉద్యోగాల కోత తలెత్తితే అధ్యక్షుడు ట్రంప్‌కు ఎన్నికల ప్రచారంలో ఎదురుదెబ్బ తగులుతుంది. 

రష్యా మొండిగా ఎందుకు..?

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్‌ ప్రభావం ఏమేరకు ఉందో వాస్తవంగా అంచనా వేయడానికి అవకాశం ఉండేలా ధరలను తగ్గించకూడదని రష్యా భావించింది. కానీ, ధరలను తగ్గించి ఆర్థికవ్యస్థలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఒపెక్‌+దేశాలు భావిస్తున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాదు.. తన ప్రత్యర్థి అయిన అమెరికాలోని షెల్‌ చమురు ఉత్పత్తి కంపెనీలు ఎంత బలంగా ఉన్నాయో కూడా పరీక్షంచాలనుకుంది. ఒపెక్‌ దేశాలు అమెరికా కోసం చమురు ఉత్పత్తిలో కోత విధించి షెల్‌ చమురు కంపెనీలకు సహకరించాలని భావిస్తున్నట్లు రష్యా అనుమానిస్తోంది. అందుకే ఏదీ ఏమైనా రష్యా వెనక్కి తగ్గలేదు.   

సౌదీ స్వీయశిక్ష..

ఇటీవల రష్యా బడ్జెట్‌ బ్యాలెన్స్‌ చేసుకోవాలంటే చమురు ధర 40 డాలర్లు ఉంటే చాలు. అదే సమయంలో రష్యాలో చమురు సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయికతో ఉంటాయి.  రష్యా వద్ద భారీగా విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇక సౌదీకి బడ్జెట్‌ అవసరాలు తీరాలంటే చమురు ధర 80డాలర్ల వరకు ఉండాలి. కానీ, రష్యా ఉత్పత్తి తగ్గింపునకు అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు చమురు యుద్ధానికి తెరతీసి సౌదీ కూడా ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన ఆరామ్‌కో లిస్టైంది. చమురు ధర తగ్గితే ఆ కంపెనీ మార్కెట్‌ విలువపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. కాకపోతే చాలా దేశాలకు చమురు సరఫరా చేసే  మార్గాలు సౌదీకి అనుకూలంగా ఉన్నాయి. ఇటు ఆసియా, అటు యూరప్‌కు సౌదీ చమురు సరఫరా చేయడం కొంచెం తేలిక. మొత్తంగా చూసుకొంటే ఈ చమురు యుద్ధ తొలి బాధితులు అమెరికాలోనే తేలనున్నారు. ఈ చమురు గాయాలను కప్పి పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిన్న ట్విటర్‌లో ప్రయత్నించారు. ‘చమురు ధరలు పతనం కావడం వినియోగదారులకు ప్రయోజనం’ అని ట్వీట్‌ చేశారు. మరోపక్క అమెరికా మార్కెట్లు మాత్రం గంగవెర్రులెత్తినట్లు అత్యంత భారీగా పతనానికి గురయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి జరగలేదనే విషయాన్ని ఈ ఘటన వెల్లడిస్తోంది. అంటే ఈ చమురు యద్ధంలో అమెరికా ప్రథమ బాధితుడిగా తేలినట్లేగా..!


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని