close

తాజా వార్తలు

భాజపాపై మమత కొత్త అస్త్రం!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఇటీవల మూడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని దూకుడుగా ఉన్న అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఇప్పుడు మరో అస్త్రం సిద్ధం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో  ఆధిపత్యం కనబరిచిన కమలం పార్టీని ‘ఎన్‌ఆర్‌సీ’తో నిలువరించిన ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా పౌరసత్వ చట్ట సవరణ బిల్లు (క్యాబ్‌)తో ఆ దూకుడును మరింత తగ్గించాలని యోచిస్తోంది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు అంశాలను ప్రధానంగా చేసుకుని భాజపాను అడ్డుకోవాలని భావిస్తోంది.

భారత్‌కు పొరుగు దేశాలైన అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి మతపరమైన దాడులు, హింస కారణంగా వేరే మార్గాల్లో వచ్చిన హిందు, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్శీ, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించడం ‘క్యాబ్‌’ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరసత్వ చట్టం-1955లోని నిబంధనలను ఇందులో సవరించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ బిల్లునుద్దేశిస్తూ మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రస్తావన లేకుండా అందరికీ పౌరసత్వం కల్పిస్తే తాను ఈ బిల్లును స్వాగతిస్తానని చెప్పారు. ఎన్‌ఆర్‌సీ, క్యాబ్‌ను అడ్డుకుంటామని తెలిపారు. దీన్ని రెండో స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించారు.

తృణమూల్‌ వ్యూహమిదీ..
లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 18 స్థానాలు సాధించి భాజపా.. మమతకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆరు నెలల గడవకు ముందే జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఎన్‌ఆర్‌సీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే అందుకు కారణమని భాజపా రాష్ట్ర నేతలు సైతం అంగీకరించారు. అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సీ ప్రభావం ఉందని ఆ పార్టీ నేతలు ఒప్పుకోకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యాబ్‌ సైతం ఆ పార్టీకి మరింత చేటు చేయనుందని టీఎంసీ సీనియర్‌ నేత ఒకరు చెప్పుకొచ్చారు. తాము కూడా శరణార్థ కాలనీలను క్రమబద్ధీకరించినప్పటికీ వాళ్లలా (భాజపా) మతాన్ని ప్రాతిపదిక చేసుకోలేదని వివరించారు. ఈ బిల్లును వ్యతిరేకించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరనుందని తెలిపారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు అంశాలు తమ విజయానికి తోడ్పడగలవని అభిప్రాయయపడ్డారు. మైనారిటీలు, శరణార్థులే 120 స్థానాల్లో ఫలితాలను నిర్ధేశించగలరని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు అంశాలు తమకు ట్రంప్‌ కార్డులా ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. 

భాజపా ఏమంటోంది?

హిందూ ఓట్ల సమీకరణకు క్యాబ్‌ ఉపయోగపడుతుందని భాజపా రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడుతోంది. హిందూ, ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఈ బిల్లును ఒకవేళ తృణమూల్‌ వ్యతిరేకిస్తే ఆ పార్టీకి హిందూ వ్యతిరేక ముద్ర అంటుకుంటుందని ఆ పార్టీ భావిస్తోంది. మైనారిటీ ఓటు బ్యాంకు కోల్పోతామని ఆ పార్టీ తెగ బాధపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ అన్నారు.

బెంగాల్‌లో పరిస్థితి ఇదీ..

1971లో బంగ్లాదేశ్‌ విభజన సమయంలో సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్‌కు పెద్ద ఎత్తున శరణార్థులు తరలివచ్చారు. వారి ఓటు బ్యాంకుతో అప్పట్లో అక్కడి వామపక్షాలు లబ్ధి పొందాయి. 2011 తర్వాత మారిన పరిస్థితుల్లో వారంతా తృణమూల్‌ పక్షాన చేరారు. అదే సమయంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శరణార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భాజపాకు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఎప్పుడైతే అసోంలో ఎన్‌ఆర్‌సీ ప్రకటించారో అప్పటి నుంచి ఇక్కడి ప్రజల్లో భాజపా పట్ల వ్యతిరేకత మొదలైంది. దీంతో ఉప ఎన్నికల్లో టీఎంసీకి విజయం కట్టబెట్టారు.

మరోవైపు వచ్చేవారం పార్లమెంట్‌లో చర్చకు రానున్న ఈ పౌరసత్వ బిల్లు విషయంలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడిగా పోరాడాలని తృణమూల్‌ సిద్ధమైంది. ఒకేదేశం, ఒకేసారి ఎన్నికలు అంటూ నినాదాలిచ్చే భాజపా.. ఆరో షెడ్యూల్‌, ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ అంటూ ఈశాన్య రాష్ట్రాలను ఈ సవరణల నుంచి మినహాయించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరి కాదా? అని తృణమూల్‌ ఎంపీ ఒకరు ప్రశ్నించారు.

ఇదీ చదవండి..
పౌరసత్వ బిల్లుకు పచ్చజెండా


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.