close

తాజా వార్తలు

పెద్దరికం

- వాడపల్లి రాధ

 

ఎర్రెర్రని సంధ్యకాంతులు మెల్లగా వాకిలినిండా పరచుకుని అందాలు చిందుతున్నా. పూబాలలు కళ్ళు విప్పార్చి చూస్తున్నట్లుగా రేకులన్నీ విప్పి ఘుమఘుమలతో పరిసరాలను నింపేస్తున్నాయి. అప్పటికే దేవునికి దీపారాధన చేసేసి, కోడలు సుమ అందించిన కాఫీ తాగి, వరండాలో కూర్చున్నాను. ‘‘అమ్మా, అమ్మా... ఏం చేస్తున్నావు?’’ అంటూ రాజా వరండాలోకి వచ్చాడు. ‘‘ఏమిటి నాన్నా’’ అడిగాను. ‘‘ఏం లేదమ్మా, రేపు నేను క్యాంపుకి వెళ్ళాలి... పదిరోజులు. మరి, నువ్వూ సుమానే ఇల్లు చూసుకోవాలి. పెద్దదానివి కదా... నీకే అప్పజెప్తున్నా- నీ కోడలినీ మనవణ్ణీ’’ నవ్వుతూ అన్నాడు. అంటూనే... నావైపు చూసి వెంటనే నాలిక్కర్చుకున్నాడు. ‘‘సారీ అమ్మా, ‘పెద్ద’ అనే మాటంటే నీకు చిరాకని నాకూ తెల్సు. కానీ, ఏదో అలా వచ్చేసింది. సారీ, నువ్వూ సుమా కలిసి ఇల్లు చూసుకోండి’’ అనేసి గబుక్కున లోపలికెళ్ళిపోయాడు. నిజమే. ఈ ‘పెద్ద’ అనేమాట నన్నెంత ఇబ్బందిపెట్టిందో, పనికిరాని ఈ ‘పెద్ద’రికం నన్ను ఎన్ని సంతోషాలకి దూరంచేసిందో అనుభవించిన నాకూ, నావంటి ‘పెద్ద’లకూ బాగానే తెలుస్తుంది. మనసంతా చేదుగా మారింది. ఆ చిరాకు నుంచి దూరం కావడానికి లోపలినుంచి వత్తుల బుట్ట తెచ్చి ముందేసుకుని,  వత్తులు చేయడం మొదలుపెట్టాను. కొడుకు ఆఫీసుకీ కోడలు పిల్లవాడిని బడిలో దింపడానికీ వెళ్ళిపోయారు. అలవాటుగా చేతులు పత్తిని విడదీసి వత్తులు చేస్తున్నాయి. మనసు మాత్రం గతంలోకి...  నన్ను ‘పెద్దదానివి’ అంటూ ఎన్నో ఆశలు అణచివేసిన గతంలోకి పరుగుదీస్తోంది.

***

నాకు పదేళ్ళున్నప్పుడు...
‘‘నీలూ, నీలూ... ఎక్కడున్నావ్‌? నేను పనిలో ఉన్నాగానీ చిన్నది ఏడుస్తోంది, కాసేపు ఆడించు’’ అంటున్న అమ్మ పిలుపు వినబడింది. పక్కింటి వనజతో ఆడుకుంటున్న నేను, నా ఆట మధ్యలో ఆపేసి వచ్చి చిన్న చెల్లెల్ని ఎత్తుకుని ఆడించసాగాను. నెమ్మదిగా అది నిద్రలోకి జారుకుంది. నేను ఆడుకోవడానికి మళ్ళీ బయటకు వెళ్తుంటే... ‘‘ఏంటీ, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నావా? పెద్దపిల్లవు కదా... కాస్త ఇంట్లో పనిచేస్తూ సాయానికి రావద్దూ? రా, రా... ఆ తోమిన గిన్నెలన్నీ చక్కగా బోర్లించు. గదులన్నీ ఒకసారి ఊడ్చెయ్‌’’ అని అమ్మ గదమాయించింది.
‘‘ఇందాకట్నుంచీ రాజీ ఆడుకుంటూనే ఉందిగా, దానికి చెప్పవేం? అన్నీ నాకే చెప్తావు’’ ఉక్రోషంగా అన్నాను. ‘‘నువ్వు పెద్దదానివి కదే... ముందు నువ్వే నేర్చుకోవాలి. అది చిన్నది... నీ తర్వాత అదే చేస్తుందిలే’’ అమ్మ సర్దేసింది.
‘‘నన్నూ చిన్నదానిగానే ఉంచాల్సింది. నన్నసలు ఆడుకోనివ్వకుండా- చెల్లాయికి తల దువ్వూ చిన్నదాన్ని నిద్రబుచ్చూ గిన్నెలు సర్దూ ఇల్లు ఊడ్చూ... అంటూ అన్నీ నాకే చెప్తావు’’ కోపంగా కాళ్ళు నేలకేసి కొడుతూ అన్నాను. ఇంతలో మా మామ్మ వచ్చేసింది. ‘‘ఏమిటే, ఆ చిందులు? పెద్దదానివేగానీ బుద్ధి మాత్రం లేదు. ఇలాగేనా మాట్లాడేది. నెమ్మదిగా అణకువగా ఉండొద్దూ?’’ అంటూ కోప్పడసాగింది. ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అమ్మ చెప్పిన పనులు చేశాను.
అలా వాదిస్తూనే... ‘పెద్దదానికి వాదన పెరిగింది, ప్రతిదానికీ పోట్లాడుతోంది’...అనిపించుకుంటూనే మరో అయిదేళ్ళు గడిచాయి. కాలేజీలో చేరాను. కొత్త సింగారాలూ కొత్త ఉత్సాహం... ఉల్లాసంగా మిత్రులతో కబుర్లూ పెరిగాయి. ఒకరోజు కాలేజీలో మిత్రులు మా ఇంటికొచ్చారు. అందరం ముందు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ జోక్స్‌ వేసుకుని నవ్వుకుంటూ గడిపాం. మా మామ్మ ఒకట్రెండుసార్లు వచ్చి చూసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. ఓ గంట కూర్చుని టీలు తాగి మా స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ తర్వాత మొదలైంది క్లాసు...
‘‘ఏమే నీలూ, ఏమిటా ఇకయికలూ పకపకలూ ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నామనే జ్ఞానం లేదూ. మీ స్నేహితురాళ్ళు సరే, నీకూ బుద్ధి లేదా’’ అంటూ అమ్మా...
‘‘ఏమిటే నీలూ, వాళ్ళంతా నీ కాలేజీ స్నేహితులా! ఆ డ్రస్సులేమిటే, అచ్చం సినిమావాళ్ళలా వేసుకున్నారు. నువ్వూ అలాగాని వేసుకునేవు గనక! మనిళ్ళల్లో ఎవరూ అలా వేసుకోలేదు. ఇంటికి పెద్దపిల్లవి. నువ్వు చక్కగా బుద్ధిగా ఉండకపోతే... రేపు నీ చెల్లెళ్ళూ అలాగే ఉంటామంటారు, జాగ్రత్త’’ అంటూ బామ్మా హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ మా స్నేహితులేమీ మిడీలూ షార్టులూ వేసుకోలా! చుడీదార్లూ లెగ్గిన్సూ టాప్‌లూ వేసుకునే వచ్చారు. వాటిక్కూడా వీళ్ళ వంకలే!
‘‘ఒళ్ళంతా కనబడేలా ఏం వేసుకోలేదుగా’’ విసుగ్గా అరిచాను.
‘‘నోర్ముయ్‌, పెద్దా చిన్నా లేదూ’’ అమ్మ కసిరేసింది.
వాదనలూ కోపాలూ అలకలూ...

అంతలోనే ‘బాధపడకు నీలూ, పెద్దదానివి అయ్యావు. ఇంట్లో నువ్వే పెద్దమ్మాయివి. అందుకని ముందు జాగ్రత్త కోసం అలా చెప్తుంటామంతే’ అంటూ అమ్మ బుజ్జగింపులూ నడుస్తూనే ఉండేవి.
‘పెద్దమ్మాయి, పెద్దమ్మాయివంటూ నాకేనా ఆంక్షలన్నీ. రాజీలాగా చిన్నారిలాగా నేనుండలేనా?’ అని లోలోపలే చెల్లెళ్ళతో పోల్చుకుంటూ... అలా అలా రోజులు గడిచేవి.
రెండేళ్ళ తర్వాత పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఇక బామ్మ నీతిబోధలు పెరిగాయి. ‘నెమ్మదిగా మాట్లాడు, పొందికగా కూర్చో, ఇలా అలా...’ అంటూ చెప్తుండేది. పెళ్ళిచూపుల్లో తలొంచుకుని కూర్చున్నా కానీ కుతూహలం నిలవనిస్తేగా... పక్కనుంచి ఓరగా అబ్బాయిని చూశా. చాలా బాగున్నాడు. లోపలికొచ్చాక అమ్మకి అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేశా. వాళ్ళూ ముందే చెప్పినట్లున్నారు. ఇక ఇల్లంతా పెళ్ళి సందడి. ఒకటే హడావుడి. అమ్మ, మామ్మా పెళ్ళి పనుల్లో మునిగి తేలుతుంటే...
రాజీ మెల్లగా నా దగ్గరకొచ్చి ‘‘అక్కా, బావగారు ఆ ఇంటి పెద్ద కొడుకట, నీకు తెలుసా!’’ అంది.
‘‘అయితే!’’ అయోమయంగా అన్నాను.
‘‘మరి నువ్వు ఆ ఇంటికి పెద్దకోడలిగా వెళ్తావు. మరి నీ మరుదులూ ఆడబడుచూ వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి’’
అని బాంబు పేల్చింది. నాకు గుండె ఆగినట్లయింది.
‘‘ఇక్కడ పెద్ద కూతుర్నని ఆంక్షలు... అక్కడ పెద్దకోడలినా! ఏం ఖర్మరా, భగవంతుడా!’’ తల పట్టుకున్నాను.
మర్నాడు అమ్మతో మాట్లాడుతూ ‘‘అమ్మా, మా అత్తగారింట్లో నేను పెద్దకోడలిని అవుతానుగా... మళ్ళీ అందరి బాధ్యతలూ నాకే అప్పజెబుతారా? ఎలాగమ్మా, నేనీ పెళ్ళి చేసుకోను’’ అన్నాను.
అదిరిపడింది అమ్మ.

‘‘ఇప్పుడిలా అంటున్నావేంటే? పెళ్ళి దగ్గరకొచ్చింది, మంచి సంబంధం, అబ్బాయి నీకు నచ్చాడన్నాకే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇప్పుడేమైంది?’’ కోపంగా అంది.
‘‘అదే... ‘పెద్ద’కోడలవుతానని... భయం’’ కసిగా ‘పెద్ద’ అనే పదాన్ని నొక్కి పలికాను. నవ్వింది అమ్మ.
‘‘నీ మొహం! పెద్ద కోడలు అంటే బాధ్యతలొక్కటేనా! ఎంత గౌరవమూ హుందాతనమూ ఉంటాయి. అందరూ అన్నీ నీకు చెప్పి, నీతో సంప్రదించి చేస్తుంటే... ఎంత దర్జాగా ఉంటుంది. ముందు ముందు నీకే తెలుస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని, వెళ్ళి పడుకో’’ అనేసి పనిలోపడింది అమ్మ.
‘‘ఏమిటీ, పెద్దది ఏంటో రుసరుసలాడుతూ వెళ్తోంది’’ అని బామ్మ అమ్మని అడిగింది.
‘‘ఏముందీ... ‘పెద్దది’ అంటే దానికి నచ్చదు కదా, ఇప్పుడు అత్తగారింట్లోనూ పెద్ద కోడలినేనా అని చిరాకుపడుతోంది’’ వివరించింది.
‘‘పెద్దపిల్లేగానీ దానికింకా వివరం తెలీదే. పెద్ద కోడలంటే... ఎంత మర్యాదా ఎంత మన్ననా... ఆఁ...’’ అంటూ వాకిట్లోకి వెళ్ళింది బామ్మ.
వైభవంగా పెళ్ళయిపోయింది. అత్తవారింటికి వచ్చేశాను. అత్తామామలూ ఇద్దరు మరుదులూ ఒక ఆడబడుచు. మా ఇద్దరితో కలిసి ఏడుగురం. ఎప్పుడూ ఇల్లంతా ఒకటే సందడి. చిన్నగా అందరితో కలిసిపోవడానికి అలవాటుపడ్డాను. క్రమంగా ఆడబడుచుకి పెళ్ళి చేసి అత్తారింటికి పంపేశాను. ఇద్దరు తోడికోడళ్ళూ వచ్చేశారు.
అప్పుడు మొదలైంది మళ్ళీ నా ‘పెద్ద’ బాధ. అన్నిటికీ అందరూ పెద్దకోడలి నడగండి అన
మే. పెద్దకోడలు వంట బాగా చేస్తుంది అని అత్తగారన్నారట. ఇక చిన్నకోడళ్ళు వంటింటి వైపు రావడం మానేశారు. ఎప్పుడన్నా పిలిచినా, సాయం చేయమని
అడిగినా... ‘వద్దులెండి అక్కయ్యా, మన అత్తమామలకి మీరు చేస్తేనే ఇష్టం’ అనేసి హాయిగా వాళ్ళ గదుల్లో భర్తలతో ముచ్చట్లాడేవాళ్ళు. నేను మాత్రం వంటింట్లో మగ్గిపోతుండేదాన్ని.
మళ్ళీ ఈ ‘పెద్ద’ పెద్దరికం అన్ని విషయాలకీ ఉండదు. ఏదైనా కొనాలన్నా ఇంటికి ఫర్నిచర్‌ వంటివి తెస్తున్నా... ఎవ్వరూ నన్నొక్కమాటా అడగరు. అక్కడ నా ‘పెద్ద’రికం ఏదీ ఉండదు.
పిల్లల్ని ఏం చదివించాలో ఎలాంటి బట్టలు కొనాలో లాంటి వాటికి నా సలహా అక్కర్లేదు. మాట వరసకే ‘పెద్ద’కోడలు. పనిలో ఏదన్నా తేడావస్తే ‘ఇంటికి పెద్దకోడలివి, ఆ మాత్రం తెలీదూ’ అనీ... చిన్నకోడళ్ళు ఏమీ చెయ్యకపోతే ‘పెద్దకోడలివి నువ్వు, చెప్పి చేయించుకోవద్దూ’ అనీ అనటానికే నా పెద్దరికం. అంతే!
ఉద్యోగార్థులై అందరూ తలో దిక్కూ వెళ్ళిపోయాక, మేమూ వేరే ఊరు వచ్చేశాం. అత్తామామలు అక్కడే ఉండిపోయారు. బయల్దేరేముందు... ‘అమ్మా నీలూ, అప్పుడప్పుడూ వస్తుండండి. వాళ్ళంటే చిన్నవాళ్ళు, నువ్వు పెద్దకోడలివి. రేపు మాకు అన్నీ జరిపించాల్సింది మీరే’ అంటూ మరో ‘పెద్ద’రికపు బాధ్యతని గుర్తుచేస్తూ పంపించారు.
కాలం గడిచిపోతోంది. ఒక్కొక్కరినీ తనలో కలిపేసుకుంటూ వేగంగా సంవత్సరాలు తిరిగిపోయాయి. అత్తామామలూ భర్తా కూడా ఆ వేగంలో కనుమరుగైపోయారు. నా పెద్దరికం నన్ను అత్తగార్నీ నానమ్మనీ చేసేసింది. ఇప్పుడు అందరూ... ‘పెద్దవారు, మీరున్నారుగా పిన్నిగారూ! సుమని మాతో తీసుకెళ్తాం’ అంటూనో, ‘పెద్దమ్మగారూ, ఈ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తారా’ అంటూనో...
నా పెద్దరికాన్ని శాశ్వతం చేసేశారు. ఇంత ‘పెద్ద’ బాధ పడినవాళ్ళకే తెలుస్తుంది.
అప్పుడప్పుడూ- ‘పెద్ద’ అనగానే నేను చిరాకుపడటం మా అబ్బాయి చూస్తూనే ఉంటాడు. అందుకే ‘సారీ’ చెప్పాడు.
‘‘ఓరి భగవంతుడా! వచ్చే జన్మలోనైనా నన్ను చిన్నపిల్ల, చిన్నకోడలు అనుకునేలా... నేను చిన్నబోకుండా ఉండేలా చూడు స్వామీ!’ అనుకుంటూ... వత్తుల బుట్ట సర్దేసి ఇంట్లోకెళ్ళాను.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.