close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/04/2020 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా పోరులో వీళ్లే అసలైన హీరోలు

వ్యక్తిగత ఇబ్బందులు పక్కనపెట్టి డ్యూటీకే ప్రాధాన్యం

అహ్మదాబాద్‌: ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ వార్తలే, ఎక్కడ విన్నా దాని గురించి మాటలే. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఆ దేశాలతో పోలిస్తే భారత్‌ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉంది. అందుకు కారణం లాక్‌డౌన్‌. వైరస్‌ తీవ్రత ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో పోలీసుల చేస్తున్న కృషి ఎనలేనిది. వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. నిద్రహారాలు మాని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. రోడ్ల మీద మండుటెండల్లో నిల్చుంటూ, రాత్రి వేళ దోమలతో కుస్తీ పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యవంతమైన దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు పోలీసులు వ్యక్తిగత, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా, డ్యూటీకే ప్రాధాన్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు గుజరాత్‌ పోలీసులు. వారి గురించి మీరూ తెలుసుకోండి..


అన్న మరణించినా.. బాధను దిగమింగుకొని..

సొంత సోదరుడు మరణిస్తే ఎవరైనా ఎంతో బాధపడతారు. అంతటి బాధను దిగమింగుకొని డ్యూటీలో కొనసాగుతున్నారు దాహోద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ పీకే జాదవ్‌. ఇటీవల అహ్మదాబాద్‌లో తన పెద్ద సోదరుడు మరణించారు. అలాంటి పరిస్థితుల్లోనూ జాదవ్‌ సెలవులు పెట్టకుండా అంత్యక్రియల్లో పాల్గొని వెంటనే విధులు చేరారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని జాదవ్‌ను అభినందించారు. 


చేయి ఫ్రాక్చరైనా.. ప్లాస్టర్‌ వేయించుకొని..

సబర్‌కాంతాలోని గంభోయి పోలీస్‌స్టేషన్‌లో ఇంద్ర విజయ్‌సిన్హ్‌ రెహ్వర్‌ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అయినా విశ్రాంతి తీసుకోకుండా ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. తన చేతికి ప్లాస్టర్‌ వేయించుకొని డ్యూటీకి రావడంతో అధికారులు అతడి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. పెట్రోలింగ్‌ విభాగంలో పీసీఆర్‌ వ్యాన్‌లో డ్యూటీ వేశారు. సబర్‌కాంతా ఎస్పీ చైతన్య మాంద్లిక్‌ ఆ కానిస్టేబుల్‌ను మెచ్చుకున్నారు. 


కూతురు పుట్టినా.. సెలవులు పెట్టలేదు..

మోర్బీ జిల్లాలో విపుల్‌ ఫుల్తారియా అనే కానిస్టేబుల్‌ ఉన్నారు. తాజాగా ఆయన విధుల్లో ఉండగా కూతురు పుట్టిందనే వార్త తెలిసింది. అయినా ఇంటికి వెళ్లకుండా డ్యూటీ పూర్తి చేసుకొనే కూతురును చూడ్డానికి వెళ్లారు. తర్వాత మళ్లీ వచ్చి విధుల్లో చేరారు. 


రెండేళ్ల కుమార్తెతో మహిళా కానిస్టేబుల్‌..

కచ్‌ జిల్లాలో అల్కా దేశాయ్‌ అనే మహిళా కానిస్టేబుల్‌ రెండేళ్ల కూతుర్ని వెంట పెట్టుకొనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా కానిస్టేబుల్‌ కావడంతో ఇంటి దగ్గర పాపను చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో అల్కా దేశాయ్‌ తన వద్దే కూతుర్ని పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. దేశానికి సేవ చేయడానికే తాను పోలీస్‌ విభాగంలో పని చేస్తున్నానని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సెలవులు తీసుకోలేనని ఆమె పేర్కొన్నారు. అలాగే తాను ఒక తల్లిని అయినందున తన కూతుర్ని వెంటపెట్టుకుని విధులు కొనసాగిస్తానని చెప్పారు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే డ్యూటీ వేశారు. 


తలకు కుట్లు పడినా.. బాధతోనే విధుల్లో..

వడోదరలోని రావుపురా పోలీస్‌స్టేషన్‌లో జ్యోతీ పరిఖ్‌ అనే మహిళా కానిస్టేబుల్‌ పనిచేస్తున్నారు. ఇటీవల ఓ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో నుదుటికి కుట్లుపడ్డాయి. ఆ నొప్పిని భరిస్తూనే సెలవులు పెట్టకుండా ఉద్యోగంలో కొనసాగుతున్నారు జ్యోతి. ఈ విషయాలన్నీ గుజరాత్‌ పోలీసులు ట్విటర్‌లో వెల్లడించారు. 

ఇవి చదవండి:

చైనా కిట్లు .. నాణ్యత డొల్ల?

భారత్‌లో 414 మరణాలు, 12వేల కేసులు!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.