ఇంతకంటే దేశభక్తి ఏముంటుంది: సోనియా గాంధీ
close

తాజా వార్తలు

Updated : 14/04/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంతకంటే దేశభక్తి ఏముంటుంది: సోనియా గాంధీ

దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం

దిల్లీ: కరోనాపై పోరులో ముందుండి దేశ రక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశంసించారు. వీరు అందిస్తున్న సేవల కంటే గొప్ప దేశభక్తి ఏముంటుందని కొనియాడారు. వారి స్ఫూర్తిని తీసుకొని మరింత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఐక్యతాభావంతో ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఉదయం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న తరుణంలో సోనియా సందేశం రావడం గమనార్హం. 

కరోనా మహమ్మారిని ఓడించేందుకు దేశ ప్రజలు చూపుతున్న తెగువ, సహనానికి సోనియా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే పరంపరను మున్ముందూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని.. సామాజిక దూరం పాటించాలని గుర్తుచేశారు. మాస్కులు ధరించాలని సూచించారు. కరోనాతో పోరాడుతూ మరణించినవారి త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. దేశ ప్రజలందరి మద్దతు వల్లే ఈ పోరును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుతున్నామని అభిప్రాయపడ్డారు. వైద్యులు సహా అత్యవసర సేవలు నిర్వర్తిస్తున్న వారికి వ్యక్తిగత రక్షణా సాధనాలు కొరత ఉన్నప్పటికీ జాగ్రత్తగా, ధైర్యంగా వారి బాధ్యతను నెరవేస్తున్నారన్నారు. అనేక పరిమితులున్నప్పటికీ.. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. 

ఇతర ప్రభుత్వ అధికారులు సైతం ప్రజలను సురక్షితంగా కాపాడుకునేందుకు 24 గంటలు పనిచేస్తున్నారని సోనియా గుర్తుచేశారు. వీరందరికీ మన సహకారం ఉంటేనే ఈ పోరాటంలో యుద్ధం సాధిస్తామని.. లేదంటే వారి కృషి వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. వారి కృషి ఫలించేందుకు ప్రతిఒక్కరం సహకరించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యులపై దాడులు జరగడం శోచనీయమన్నారు. ఈ పోరులో ఎవరికీ వారు తమ స్తోమత మేరకు ఇతరులకు సాయం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. 

దేశం మొత్తం కరోనా మహమ్మారిని ఓడించేందుకు మహా పోరుకు సిద్ధమైన ఈ తరుణంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ బాధ్యతను నిర్వర్తించాలని సోనియా పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో కావాల్సిన సహకారాన్ని అందించాలని కోరారు. దీనికి కాంగ్రెస్‌ నాయకుల పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సంకట స్థితి నుంచి దేశం అత్యంత త్వరగా బయటకు రావాలని ఆకాంక్షించారు. 

ఇవీ చదవండి..

లెక్కకురాని మరణాలెన్నో
వుహాన్‌ పాఠాలివేTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని