
తాజా వార్తలు
కవిత కాపీ విషయంలో సీఎంపై ట్రోల్స్
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. గత నెల సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేసిన ఓ కవితను కాపీ చేసినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబరులో ఆయన మామ మృతి చెందారు. ఆ సమయంలో ఆయన భార్య సాధనా సింగ్ తన తండ్రిపై రాసినట్లు కవితను ఆమె ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. తండ్రిని గుర్తు చేసుకుంటూ తన భార్య రాసిన కవిత అని వివరిస్తూ దాన్ని నవంబరు 22న సీఎం ట్వీట్ చేశారు.
కవితపై గొడవేంటంటే..
‘కవిత రాసింది నేను.. మీ భార్య కాదు’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన భూమిక అనే మహిళ మంగళవారం సీఎం ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. గత నెల 21న తన తండ్రి మరణించడంతో ఆయనకు నివాళులు తెలుపుతూ కవిత రాసినట్లు ఆమె తెలిపారు. దాన్ని ఫేస్బుక్లో పోస్టు చేసినట్లు వివరించారు. తన తండ్రి అంతిమ సంస్కారాల సమయంలోనే ఫోన్లోని నోట్‌ప్యాడ్‌లో దాన్ని రాసినట్లు వివరించారు. అప్పుడే దాన్ని తన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేసినట్లు తెలిపారు. ఆ కవితను సీఎం భార్య తనదిగా వాట్సాప్‌లో షేర్ చేసినట్లు భూమికకు ఆమె స్నేహితురాలు స్క్రీన్‌షాట్ పంపారు. దీనిపై భూమిక తొలుత పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ కవితను ట్వీట్ చేయడం.. ఆయన భార్య తన తండ్రికి గుర్తుగా ఇది రాసిందనడంతో భూమిక స్పందించారు.
తనకు సీఎం అంటే గౌరవం అని తెలిపిన భూమిక.. ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదని వివరించారు. కవిత రాసిన తనకే ఆ గౌరవం దక్కాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కవిత కాపీపై ఆ రాష్ర్ట కాంగ్రెస్ సీనియర్ నేత అరుణ్ యాదవ్ సీఎంపై విమర్శలకు దిగారు. వేరే వాళ్లు చేసిన పనులకు పేర్లు మార్చి తమదని నమ్మించడం భాజపాకు అలవాటే అని ట్వీట్ చేశారు.