కరోనా కేసులు.. లాక్‌డౌన్‌ భయాలు
close

తాజా వార్తలు

Updated : 15/06/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కేసులు.. లాక్‌డౌన్‌ భయాలు

మరోసారి భారీ నష్టాలను చవి చూసిన దేశీయ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లను కరోనా మరోసారి భయపెట్టింది. అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం చూపిన వేళ మార్కెట్లు నష్టపోయాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 552 పాయింట్లు నష్టపోయి 33,288 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 9,813 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.02 వద్ద కొనసాగుతోంది.

ఉదయం స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 96 పాయింట్లు పతనమైంది. చైనాలో కరోనా వైరస్‌ రెండోసారి విజృంభిస్తుండటంతో ఆ భయాలు మన మార్కెట్‌పైనా ప్రభావం చూపాయి. దీనికి తోడు దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వైరస్‌ విజృంభణ ఆగకపోవడం మదుపరుల్లో భయాన్ని నింపింది. ఈ దశలో సెన్సెక్స్‌ 767 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా చివరకు భారీ నష్టాలతోనే ముగిశాయి. 

సోమవారం నాటి ట్రేడింగ్‌లో గెయిల్‌, విప్రో, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా తదితర షేర్లు లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 

మార్కెట్‌ నష్టాలకు కారణాలివే..!

* చైనాలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభణ మొదలవడం ఆసియా మార్కెట్లతో పాటు, మన మార్కెట్లపైనా ప్రభావం చూపింది. కరోనా వైరస్‌ కొత్త క్లస్టర్లు ఏర్పడుతుండటంతో చైనాలో సెకండ్‌ వేవ్‌ ఇన్‌ఫెక్షన్‌ భయం నెలకొంది.

* గత ఐదు రోజులుగా దేశంలో రోజూ 11వేల కేసులకు పైగా నమోదవుతుండటంపై మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కరోనా బాధితుల సంఖ్య 3.30లక్షలు దాటడం, ప్రపంచ దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, అహ్మదాబాద్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

* ఈ వారాంతానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి మూడు నెలలు పూర్తవుతుంది. కాగా, జూన్‌ మొదటివారంలో చాలా వరకు నిబంధనలను సడలించారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో మరోసారి కంటైన్మెంట్‌ జోన్లు, రెడ్‌జోన్‌లలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడంతో పాటు, జులై వరకూ పొడిగిస్తారన్న వార్తలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

* గత రెండు నెలలుగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈ షేర్లు నష్టాలను చవిచూశాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని