close

తాజా వార్తలు

అంతర్జాలంలో అన్వేషించి.. ఇళ్లను కొల్లగొట్టి!

ధనిక ప్రాంతాలను ఎంచుకుని మరీ దొంగతనాలు
నిఘానేత్రాలకు వెరవకుండా చోరీలు
నిందితుల్లో ఇతర ప్రాంతాల వారే అధికం
న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

గరంలో ముఖ్యమైన ప్రాంతంగా గుర్తింపు పొందిన పశ్చిమ మండలంపై దొంగలు దృష్టి సారించారు. ‘కొండల్లో’ ఉన్న ప్రముఖుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీల బాట పడుతున్నారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన చాలా మంది దొంగలు అంతర్జాలంలో నగరంలోని ధనిక ప్రాంతాలుగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లను గుర్తించి.. తమ చోరీలకు లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. అంతర్జాలంలో వెదికి మరీ ఈ ప్రాంతంపై దొంగలు దృష్టి సారిస్తుండడం కలవరం కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలు ఇక్కడికొచ్చి దర్జాగా ఇక్కడికొచ్చి దోచుకెళ్లిపోతున్నారు.

మహ్మద్‌ ఇర్ఫాన్‌.. బిహార్‌లోని జోగియా ప్రాంతానికి చెందిన ఇతను ముంబైలో మకాం పెట్టాడు. దిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ప్రముఖులు లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడే ఇతను అక్కడ పోలీసులకు దొరకడంతో నగరంపై దృష్టి పెట్టాడు. అంతర్జాలంలో ప్రముఖుల ప్రాంతాలుగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లను గుర్తించి ఇక్కడ చోరీలకు పాల్పడ్డాడు. రూ. 4కోట్లకు పైగా బంగారు వజ్రాభరణాలను చోరీ చేశాడని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. చోరీలకు పాల్పడిన అతను తన ఖరీదైన వాహనంలో ముంబై లేదా బెంగళూరుకు వెళ్లేవాడు. ఇటీవల బెంగళూరులో పోలీసులకు చిక్కాడు.

* చెన్నైకి చెందిన నటరాజ్‌ అంతర్జాలం ద్వారా బంజారాహిల్స్‌లో చోరీకి యత్నించాడు. ఏడాది క్రితం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 7 ప్రాంతంలో చోరీకి యత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు.


అందరి దృష్టి ఇక్కడే..

జూబ్లీహిల్స్‌, బంజరాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిఘానేత్రాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు ముఖ్యమైన రాజకీయ నేతలు, పార్టీ కార్యాలయాలు, సినీ, వ్యాపార, ఇతర ప్రముఖులుండేది ఇక్కడే.


అంతర్జాలంలో చూసుకొని..
జూబ్లీహిల్స్‌లో విల్లామేరీ కళాశాల యజమాని ఇంట్లో, ఓ సిమెంటు ఫ్యాక్టరీ యజమాని నివాసంలో చోరీకి యత్నించిన, బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ ముంబై నుంచి వచ్చాడు. అంతర్జాలంలో లక్ష్యం ఎంచుకుని ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నటరాజన్‌ సైతం ఇలాగే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాడు.

జయేష్‌ రాజ్వీ సేజ్‌పాల్‌.. గుజరాత్‌కు చెందిన ఇతను స్టార్‌ హోటళ్లను లక్ష్యంగా చోరీలకు పాల్పడుతుంటాడు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, జలంధర్‌, చండీగఢ్‌, ఆగ్రా, బెంగళూరు, గుర్గావ్‌, కాన్పూర్‌, ఆగ్రా తదితర ప్రాంతాల్లో నక్షత్రాల హోటళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుంటాడు. హోటల్‌లోకి దిగే కొత్త జంటలను గుర్తించి వారి వద్ద చోరీకి పాల్పడుతాడు. బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో గతేడాది మార్చిలో చోరీ చేశాడు. అతన్ని పోలీసులు ముంబైలో అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిలుపై బయటకు వచ్చి మళ్లీ చోరీల బాట పట్టాడు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతానికి ఆటోలో వచ్చి చోరీకి పాల్పడి.. తిరిగి అదే ఆటోలో వెళ్లిపోవడం ఇతనికి అలవాటు.


కర్రి సతీష్‌.. దాదాపు ఏడెనిమిదేళ్లు పశ్చిమ మండల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో పలువురు ప్రముఖుల ఇళ్లను కొల్లగొట్టాడు. ఒక మాజీ పోలీసు అధికారితో పాటు సినీ నిర్మాత కుమారుడి నివాసాలున్నాయి. కేవలం స్క్రూ డ్రైవర్‌ ఉపయోగించే ఇతను సాంకేతికతకు చిక్కకుండా చాలా కాలం తప్పించుకొని తిరిగాడు. దొంగతనానికి పాల్పడిన ఇంట్లో ఏదైనా కారు తాళం కనిపిస్తే ఆ కారును చోరీ చేసి తీసుకెళ్లడమే కాకుండా అయిదారు నెలల అనంతరం తిరిగి తీసుకొచ్చి అదే ఇంటి ముందు పెట్టి వెళ్లడం విశేషం. దాదాపు రూ. 5 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. చోరీలకు పాల్పడిన అనంతరం రైలులో తన సొంతూరైన వైజాగ్‌కు వెళ్లేవాడు. చోరీ సొత్తును అక్కడే విక్రయించేవాడు. చివరికి చిన్న ఆధారంతో వైజాగ్‌లో పోలీసులకు చిక్కాడు.


నిఘా నేత్రాలున్నా..
జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కమ్యూనిటీ నిఘానేత్రాలు నగరంలోనే అత్యధికంగా ఇక్కడున్నాయి. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కెమెరాలతో కలిపి రెండు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దాదాపు పది నుంచి పదిహేను వేలకు పైగా నిఘానేత్రాలున్నాయి. అయినప్పటికీ ఇక్కడ చోరీల సంఖ్య తగ్గకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి. ఒకవైపు పోలీసులు చోరీల కేసులను ఛేదిస్తున్నప్పటికి కొత్తగా వస్తున్న చోరులు ఎప్పటికప్పుడు సవాలు విసురుతూనే ఉన్నారు. నిఘానేత్రాలకు చోరులు చిక్కుతున్నా చాలా సందర్భాలలో వారు దర్జాగా చోరీ చేసుకొని వెళ్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో ఇక్కడి పోలీసులకు చిక్కబోమనే ఆలోచనతో వీరు ఇక్కడికి చోరీలకు వస్తున్నట్లు ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమన్వయం కారణంగా ఆయా ఆధారాలతో ఘటన జరిగిన సమయంలో సరిపోల్చుకుంటున్నామని, ఈ కారణంగానే కేసులు ఛేదించే వీలు ఏర్పడుతుందన్నారు. కర్రి సతీష్‌, సేజ్‌పాల్‌, ఇర్ఫాన్‌.. ఇలా అంతా కెమెరాలకు చిక్కినప్పటికీ కొద్ది రోజులపాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగారు.


అప్రమత్తంగా ఉండాలి
-ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, డీసీపీ, పశ్చిమ మండలం

పోలీసులు 24 గంటలూ దృష్టి సారించినా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. కాపలాదారులను రాత్రివేళలా అప్రమత్తం చేసి ఉంచండి. నిఘానేత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లు వదిలి వెళ్లేటప్పుడు ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పాటు సంబంధిత పోలీస్‌ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. సీసీ టీవీ కెమెరాలను నిలిపివేయవద్దు. ఇంట్లో విలువైన వస్తువులు, నగలు ఉంటే కచ్చితంగా వాటిని సురక్షితమైన లాకర్లలలో ఏర్పాటు చేసుకోవాలి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 17లో జరిగిన ఘటనలో ఇంటి ముందు కాపలాదారు దొంగలు వచ్చిన సమయంలో నిద్రపోతున్నాడు. ఇక కాలనీవాసులు సురక్షిత కాలనీగా తీర్చిదిద్దుకొనే ప్రయత్నం చేయాలి. చాలా కాలనీలు, బస్తీల్లో ఇంకా నిఘానేత్రాల అవసరం ఉంది.


 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.