close

తాజా వార్తలు

పారాణి..రాయకనే..నూరేళ్లు నిండాయి

● చీకటిలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న టవేరా

● అదుపు లేని వేగమూ దుర్ఘటనకు దోహదం

● ఓర్వకల్లు వద్ద రహదారి ప్రమాదం

● పెళ్లి నిశ్చితార్థమైన యువతితో సహా ముగ్గురు దుర్మరణం

● కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 12 మందికి గాయాలు


ఓర్వకల్లు వద్ద జరిగిన రహదారి ప్రమాదం

కర్నూలు నేరవిభాగం, ఓర్వకల్లు, ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: కల్యాణ కాంతులు త్వరలో రాబోతున్నాయని అప్పటి వరకూ మురిసిన యువతి కుటుంబాన్ని కారుమబ్బులు మింగేశాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ శివార్లలోని ద్వారకానగర్‌లో ఉంటున్న ఈదుల గోత్నవి(23)కి హైదరాబాద్‌కు చెందిన యువకుడితో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం నిమిత్తం శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అద్దె కారు తీసుకుని ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. వెళ్లిన వారిలో గోత్నవి తండ్రి మల్లికార్జునరెడ్డి(60), తల్లి ఇందిర(45), చిన్నాన్న శివారెడ్డి(40), చిన్నమ్మ సక్కుబాయి(40), పక్కింటికి చెందిన లత(29), పెద్ద మనిషి మార్తల కొండారెడ్డి(67), బి.కోడూరు మండలం పాయలకుంట్లకు చెందిన కాసా నారాయణరెడ్డి(60) ఉన్నారు. నిశ్చితార్థ వేడుక అనంతరం అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు బయల్దేరారు. రాత్రి 9.30 గంటలకే కర్నూలు చేరుకుని అక్కడ భోజనాలు చేశారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రయాణమయ్యారు. ఓర్వకల్లు సమీపంలోని రాక్‌ గార్డెన్స్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఒక లారీ అధిగమించబోయింది. దాన్ని తప్పించేందుకు కారు డ్రైవరు వాహనాన్ని ఎడమ వైపు తిప్పారు. అదే సమయంలో రహదారిపై ఎలాంటి లైట్లు, సైడ్‌ సిగ్నల్స్‌ లేని ట్రాక్టరు ట్రాలీని కారు ఢీకొట్టింది. అధిక వేగాన్ని అదుపుచేయలేక.. బలంగా ట్రాక్టరు ట్రాలీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. టవేరా, ట్రాక్టరులో ఉన్న 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మూడు ప్రాణాలు బలి

ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వధువు ఈదుల గోత్నవి కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఘటనా స్థలిలోనే పాయలకుంట్లకు చెందిన కాసా నారాయణరెడ్డి, ప్రొద్దుటూరు ద్వారకానగర్‌ వాసి మార్తల కొండారెడ్డి మృత్యువాత పడ్డారు. మల్లికార్జునరెడ్డి రెండు కాళ్లు, నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి. శివారెడ్డికి రక్త గాయాలయ్యాయి. ఇందిరకు నాలుక ముందుభాగం తెగి, కుడి వైపు పెదవి దెబ్బతింది. లత ఎడమ చేయి, గడ్డం కింద తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవరు మహబూబ్‌బాషాకు కూడా దెబ్బలు తగిలాయి. డ్రైవరు అతివేగంగా కారును నడిపినట్లు బాధితుల్లో ఒకరైన శివారెడ్డి ఓర్వకల్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నపాటి వాహనంలో ఏకంగా తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. ముందుభాగంలో డ్రైవరు పక్కనే కాసా నారాయణరెడ్డి, మార్తల కొండారెడ్డి కూర్చున్నారు. సరిగ్గా వీరు కూర్చున్న పక్కనే ట్రాలీని ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక భాగంలో శివారెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఇందిర కూర్చున్నారు. ఇక మధ్యభాగంలోని గోత్నవి, లత, సక్కుబాయి ప్రయాణించారు. పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ముగ్గురు మృత్యువాత పడగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆగిఉన్న ట్రాక్టరులో ఉన్నవారిలో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.

ప్రమాదం ఇలా..

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామానికి చెందిన దాదాపు వంద మంది మూడు ట్రాక్టర్లలో బేతంచెర్ల మండలంలోని మద్దిలేటిస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళుతున్నారు. రాతివనాల ఎదురుగా ఓ ట్రాక్టర్‌కు ముందు లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. డ్రైవరు పరశురాముడు ట్రాక్టరును రహదారిపై నిలిపేసి లైట్లు ఆరిపోవటానికి గల కారణాలను వెతుకుతున్నారు. వెనకనుంచి ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ను కుడి వైపున అధిగమిస్తున్న సమయంలో బస్సు వెనకే వస్తున్న టవేరా వాహన డ్రైవర్‌ మహబూబ్‌బాషా బస్సును అధిగమించేందుకు వేగంగా ఎడమ వైపు మళ్లించారు. అక్కడే ఉన్న ట్రాక్టర్‌ను గమనించకుండా మళ్లించటంతో ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ కావటంతో వేగంతో వెళుతున్న టవేరా వాహన డ్రైవర్‌కు ట్రాక్టర్‌ కనిపించక ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రాక్టర్‌ చోదకుడు వడ్డె పరశురాముడు, బోయ శ్రీనివాసులు, బోయ నర్సంహులు, బోయ పవన్‌కుమార్‌, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

కలచివేసిన పెద్దాయన మృతి

ద్వారకా నగర్‌ కాలనీలో అన్నింటికి చేదోడు, వాదోడుగా ఉంటూ ఆపద సమయాల్లో ఆదుకునే మార్తల కొండారెడ్డి మృతి ఆ వీధివాసులను కలచి వేసింది. ఇదే వీధిలో నివసిస్తున్న ఓ ఆర్‌ఎంపీకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే మరో వ్యక్తిని కూడా ఆరోగ్యం సహకరించనపుడు ఆయనే దగ్గరుండి చూపిస్తూ వచ్చారు. స్థానికులు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఇన్నాళ్లు హుందాగా, కాలనీకే పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆ కాలనీ వాసులు హతాశులయ్యారు. కొండారెడ్డికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తన ఇంటి సమీపంలో మల్లికార్జునరెడ్డి నివాసం ఉండటంతో పరిచయం ఏర్పడి సన్నిహితులయ్యారు. నీటి పారుదలకు సంబంధించిన నిర్మాణ పనులు చేసే గుత్తేదారుగా కొండారెడ్డి కొనసాగుతున్నారు. కుమార్తె పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమానికి ఆయన్ను మల్లికార్జునరెడ్డి పెద్దమనిషిగా ఆహ్వానించటంతో హైదరాబాదు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కాంట్రాక్టు పనులకు సంబంధించి దాదాపు రూ.1.50 కోట్ల బిల్లులు మంజూరు కాక ఇబ్బంది పడుతున్న సమయంలో కొండారెడ్డి మృతితో ఆయన కుటుంబంలో అయోమయ పరిస్థితి ఏర్పడింది.

అందరివాడు.. అందని లోకాలకు..

పాయలకుంట్లకు చెందిన కాసా నారాయణరెడ్డి వ్యవసాయం చేసేవారు. ఆయనకు భార్య మంగమ్మ, కుమారుడు ఉన్నారు. కుమారుడు రాయలసీమ గ్రామీణ బ్యాంకు ఉద్యోగిగా ఉన్నారు. ఆయన తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి మూడుసార్లు సర్పంచిగా పనిచేసి రాజకీయాల్లో కొనసాగుతున్నా నారాయణరెడ్డి మాత్రం వాటికి అతీతంగా అందరివాడిలా ఉండేవారు. ఊరి విడిచి వెళ్లేందుకు ఇష్టపడని ఆయన శుక్రవారం ప్రొద్దుటూరులో బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యారు. తన భార్య తరఫున వరసకు గోత్నవి మనుమరాలు కావటంతో మల్లికార్జునరెడ్డి ఆహ్వానం మేరకు వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు మరణవార్త తెలిసి విషాదంలో మునిగిపోయారు.

అర్ధరాత్రి దిక్కుతోచలేదు.. - శివనాగిరెడ్డి, గోత్నవి చిన్నాన్న

హైదరబాద్‌ నుంచి సాయంత్రం టవేరా వాహనంలో బయలుదేరాం. ముందు డ్రైవర్‌ పక్కన కొండారెడ్డి, నారాయణరెడ్డిలు కూర్చోగా మేమంతా వెనుక కూర్చున్నాం. అంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మా డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయి చీకట్లో హఠాత్తుగా కనిపించిన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. వాహనం దెబ్బతినటంతో అంతా ఇరుక్కుపోయాం. చిమ్మచీకట్లో దిక్కుతోచలేదు. ముందు కూర్చున్న కొండారెడ్డి, నారాయణరెడ్డి మృతి చెందారు. నేను తప్ప అంతా గాయపడటంతో స్థానికుల సాయంతో బయటకు తీశాం.

ఆగిన రెండు నిమిషాలకే ఢీకొట్టింది - మోక్షేశ్వరుడు, వడ్డెమాను

అంతా ట్రాక్టర్‌లో మద్దిలేటిస్వామి గుడికి నాలుగు ట్రాక్టర్లలో బయలుదేరాం. లైట్లు మరమ్మతుకు గురికావటంతో వాహనం డ్రైవర్‌ ఆపి ముందుభాగంలో సరిచేసుకుంటున్నారు. చిమ్మచీకటి ఉండటంతో ఎవరూ వాహనం దిగలేదు. రెండు నిమిషాలకే టవేరా వాహనం వచ్చి ఢీకొట్టింది. దాంతో వాహనం దాదాపు నాలుగు అడుగులు జరిగింది. మావాళ్లు ఆరుగురికి గాయాలయ్యాయి.

ప్రైవేటు ఉపాధ్యాయినిగా చేస్తూ..

మృతిచెందిన యువతి ఈదుల గోత్నవి ప్రస్తుతం వైఎంఆర్‌ కాలనీలోని సరస్వతి విద్యామందిర్‌లో ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గతేడాది ఒక కార్పొరేట్‌ పాఠశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేశారు. చిన్ననాటి నుంచి ఈమె చదువులో మంచి ప్రతిభ చూపారు. 2012లో పట్టణంలోని కేశవరెడ్డి పాఠశాలలో పది చదివి 9.2 జీపీఏ సాధించారు. ఇంటర్‌ కూడా పట్టణంలోని శ్రీవిద్య కళాశాలలో చదివి ఎంపీసీ విభాగంలో 751/1000 మార్కులు సాధించారు. చాపాడు వద్ద ఉన్న సీబీఐటీలో 2014-18 వరకూ బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈమె మృతి నేపథ్యంలో సరస్వతి విద్యామందిర్‌ పాఠశాల ప్రధానాచార్యులు రామచంద్ర సంతాపం తెలిపి, సెలవు ప్రకటించారు. గోత్నవి సోదరుడు శివారెడ్డి రెండేళ్ల క్రితం ఉరేసుకుని మృతి చెందారు. చేతికి ఎదిగివచ్చిన బిడ్డలను ఆ కుటుంబం కోల్పోయారు.

అతి వేగంతోనే ప్రమాదాలన్నీ...- బైకుల తర్వాత కారు, లారీలతోనే అధిక శాతం దుర్ఘటనలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతి వేగం వల్లే అధిక శాతం దుర్ఘటనలు చోటుచేసుకుంటుండగా ఇతరత్రా కారణాలతో తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాల తర్వాత అత్యధికంగా కారు, లారీ ప్రమాదాల్లో అధికంగా నష్టం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గమనిస్తే..

వేగానికి కళ్లమేదీ..

జిల్లాలో అధిక వేగంతో వెళ్లే వాహనాలపై చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. రాత్రి సమయాల్లో అసలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా శాఖతోపాటు జిల్లా ఆరు సబ్‌ డివిజన్లకు స్పీడ్‌ లేజర్‌ గన్‌లు ఉన్నాయి. గత ఎస్పీ గోపీనాథ్‌ జెట్టి అన్ని సబ్‌ డివిజన్లకు వీటిని సమకూర్చారు. అధిక వేగంతో వెళ్లే వాహనాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 15,137 వాహనాలపై మాత్రమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. పలు సబ్‌డివిజన్లలో వీటిని ఉపయోగించటం లేదనే విమర్శలున్నాయి.

ఆగి ఉన్న వాహనాలతో ముప్పు

జిల్లాలో మరమ్మతుకు గురై అకస్మికంగా నిలిచిపోయే వాహనాలతో అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఉల్లిందకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హమారా ఘర్‌ సమీపంలో రహదారి మధ్యలో నిలిచిపోయిన ఇనుప కడ్డీల లోడు లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొనటంతో ముగ్గురు మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఓర్వకల్లు మండలం రాక్‌గార్డెన్స్‌ వద్ద అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను టవేరా వాహనం ఢీకొనటంతో ముగ్గురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్ల తప్పిదం కనిపిస్తోంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ చుట్టూ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవటం, టవేరా వాహన డ్రైవర్‌ అతివేగంతో వాహనాన్ని నడపటం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హైవే పెట్రోలింగ్‌ వాహనాలకు సరిపడే డీజిల్‌ ఇవ్వకపోవటం, ప్రతినెలా కేవలం 140 లీటర్ల డీజిల్‌ మాత్రమే ఇవ్వటంతో సరిగా గస్తీ విధులు నిర్వర్తించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆగి ఉన్న వాహనాలు గుర్తించి సూచికలు ఏర్పాటు చేయటం, ప్రమాదాలు జరిగిన సందర్భంలో సహాయసహకారాలు అందించాల్సిన పెట్రోలింగ్‌ వాహనాల సిబ్బందికి డీజిల్‌ కొరత సమస్యగా మారింది.

● కార్లు, లారీలు నిర్దిష్ట సమయంలో గమ్యస్థానాలు చేరుకోవాలన్న లక్ష్యంతో అతివేగంతో వెళ్లటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీ డ్రైవర్లు అవిశ్రాంతంగా వాహనాలు నడపటం, మద్యం తాగటం, సరైన అంచనా లేకుండా ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే యత్నం చేయటం వంటి ప్రధాన కారణాల వల్ల లారీల ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్ల డ్రైవర్లు కూడా దాదాపు ఇవే తప్పిదాలు చేస్తుండటంతో ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయి.


గోత్నవి ఇటీవల చిత్రం


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.