
తాజా వార్తలు
‘PR మీడియా వ్యూహాలతో చైనాను ఎదుర్కోలేం’
కేంద్రంపై రాహుల్‌గాంధీ విమర్శలు
దిల్లీ: ఓవైపు కాంగ్రెస్ అధినాయకత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతుండగా.. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వివాదాస్పద డోక్లామ్ పీఠభూమి సమీపంలో పొరుగు దేశం చైనా కీలక నిర్మాణాలు చేపట్టినట్లు వార్తలు రావడంతో మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. పీఆర్(పబ్లిక్ రిలేషన్ అధికారి)లతో నడిచే మీడియా వ్యూహాలతో మోదీ ప్రభుత్వం చైనాను ఎదుర్కోలేదని దుయ్యబట్టారు.
డోక్లాంలో చైనా నిర్మాణాలపై ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్విటర్లో షేర్ చేసిన రాహుల్.. ‘చైనా భౌగోళిక రాజకీయ వ్యూహాలను పీఆర్‌లతో నడిచే మీడియా వ్యూహాలతో ఎదుర్కోలేం. ఇంత చిన్న విషయం భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి అర్థమైనట్లు లేదు’ అని ఎద్దేవా చేశారు. చైనా విషయంలో రాహుల్ గతంలో కూడా పలు మార్లు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చైనాకు మోదీ లొంగిపోయారంటూ రాహుల్ ఆ మధ్య ఘాటు వ్యాఖ్యలు చేయగా.. భాజపా వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
డోక్లామ్ పీఠభూమికి చేరువలో భూటాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి గ్రామాన్ని నిర్మించిన చైనా.. ఆ ప్రాంతంలో రోడ్డు కూడా వేస్తోందని తాజాగా వెల్లడైంది. ఈ మేరకు హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా బట్టబయలైంది. అంతేగాక, రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అధునాత రాడార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. లద్ధాఖ్ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ చైనా తాజా నిర్మాణాలు కొత్త వివాదానికి తెరతీస్తున్నాయి.
ఇవీ చదవండి..
5-స్టార్ సంస్కృతి పోవాలి: ఆజాద్