
తాజా వార్తలు
కరోనా ‘చిత్రం’: బిఫోర్.. ఆఫ్టర్
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 వ్యాప్తికి ముందు, తరువాత పరిస్థితులను పోలుస్తూ చిత్రాలను వీడియోలను పోస్టు చేయటం ఇప్పుడు నెట్టింట్లో నూతన ఒరవడిగా మారింది. ఈ క్రమంలో ఓ నర్సు షేర్ చేసిన ఓ చిత్రం.. తొమ్మిదిన్నర లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఈమె @కేథరిన్ఐవీ అనే పేరుతో ఆమె కరోనా వైరస్ ప్రారంభ దశలో తన ఫొటోను.. ఇప్పటి చిత్రాన్ని ఈ పోస్టు చేశారు. తొలి చిత్రంలో అందంగా, ఆరోగ్యవంతంగా ఉన్న ఆమె.. రెండో చిత్రంలో ముఖమంతా గీతలతో, కళ్లు లోనికి పోయి.. దయనీయంగా ఉంది. కాగా, దీనిని చూసిన వారు షాక్‌కు గురౌతున్నారు. ఈ చిత్రం మొత్తం వైద్యారోగ్య సిబ్బంది పరిస్థితిని కళ్లకు కడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘‘కొవిడ్ ఓ క్రూరమైన వ్యాధి. నా ఆగర్భ శత్రువుకు కూడా అది సోకకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల.. మిమ్మల్ని మీరు రక్షించుకోవటం మాత్రమే కాదు.. తద్వారా మీ చుట్టూ ఉన్న వారిని కూడా కాపాడుతున్నారని అర్థం చేసుకోవాలి.’’ అనే వ్యాఖ్యను కూడా ఆమె జతచేశారు. ‘‘మీరు చాలా అందంగా, ధైర్యంగా ఉన్నారు.. మీ సేవలకు కృతజ్ఞతలు.. ధన్యవాదాలు.. ’’ అని ఆమె వంటి వైద్య సిబ్బంది సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్లు వెల్లువెత్తాయి.