close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/07/2020 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనా కంపెనీలపై కేంద్రం కీలక నిర్ణయం

రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లోకి ఆ దేశ కంపెనీలకు నోఎంట్రీ

దిల్లీ: భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి సాధ్యమైన మార్గాలన్నింటిని భారత్ అన్వేషిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవలోనిదే. జాయింట్‌ వెంచర్లతో సహా రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చైనా కంపెనీని అనుమతించమంటూ బుధవారం ఆయన స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో చైనా పెట్టుబడిదారులు భాగస్వాములు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇటీవల లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడటంతో  రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు మరణించారు. అప్పటి నుంచి సరిహద్దు వద్ద యుద్ధవాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భద్రతా కారణాలు చూపుతూ..చైనాకు చెందిన 59 యాప్స్‌ మీద భారత్ నిషేధం విధించింది. 

‘చైనా భాగస్వామ్యంతో ఉన్న జాయింట్ వెంచర్లకు రహదారి నిర్మాణంలో  పాలుపంచుకొనేందుకు అనుమతులు ఇవ్వం. వారు జాయింట్ వెంచర్ల ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలని చూసినా అనుమతులు ఇవ్వకుండా దృఢవైఖరిని చూపుతాం. చైనా కంపెనీలపై నిషేధం విధిస్తూ, మన దేశ కంపెనీలు ఈ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా నిబంధనల్లో సడలింపులు ఇస్తూ త్వరలో ఒక విధానాన్ని తీసుకురానున్నాం.  ప్రస్తుత, భవిష్యత్తు టెండర్లలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నాం’ అని నితిన్‌ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ చైనా విస్తరణ కాంక్షకు ముకుతాడు వేయడానికి భారత్ అనుసరించనున్న ప్రణాళిక గురించి వివరించారు.

‘సరికొత్త సాంకేతికత, పరిశోధన, కన్సల్టెన్సీ, ఇతర పనుల కోసం ఎంఎస్‌ఎంఈలలో విదేశీ పెట్టుబడులు, జాయింట్ వెంచర్లను మేం ప్రోత్సహిస్తాం. కానీ చైనా కంపెనీలకు మాత్రం ఆ అవకాశం లేదు’ అని గడ్కరీ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌కు తాను ప్రధాన మద్దతుదారుడినని చెప్పుకొచ్చారు. చైనా నుంచి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు, దేశాన్ని స్వావలంబన దిశగా నడిపేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అలాగే ఓడరేవుల వద్ద వస్తువులను ఏకపక్షంగా నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి చెన్నై, విశాఖపట్నం ఓడరేవులకు చేరుకుంటున్న సరుకుల తనిఖీలను కస్టమ్స్‌ అధికారులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. 

ఇవీ చదవండి:

బ్రేకింగ్..టిక్‌టాక్‌పై కేంద్రం నిషేధం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.