close

తాజా వార్తలు

Published : 03/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. అసెంబ్లీని రద్దు చేయండి: చంద్రబాబు సవాల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. టీఎస్‌: మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కుల్‌భూషణ్‌ తరఫు లాయర్‌..భారత్‌కు అవకాశం

గూఢచర్యం కేసులో పాక్‌ చెరలో ఉన్న భారత నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో మరో ముందడుగు పడింది. మరణశిక్ష పునఃసమీక్ష అంశంలో ఆయన తరఫు వాదనలు వినిపించేందుకు లాయర్‌ను నియమించుకునే అవకాశాన్ని భారత్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు కల్పించింది. అయితే, అతడు పాకిస్థానీ న్యాయవాదే అయి ఉండాలని షరతు విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3కు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో కరోనా: 7,822 కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 7,822 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 76,377 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 88,672 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 5,786 మంది కోలుకున్నారు. తాజాగా 63 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,537కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పారదర్శకత కోసమే ఈ-సేవలు: సోమేశ్‌

ప్రభుత్వ కార్యకలాపాలు సులభంగా, పారదర్శకంగా జరగడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, హోం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల్లో.. పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-సేవలు ప్రారంభమయ్యాయి. బీఆర్కే భవన్‌లో ఈ సేవలను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. జిమ్‌/యోగా కేంద్రాలకు ఇవే మార్గదర్శకాలు

కొద్ది రోజుల క్రితం మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు కేంద్రం హోం శాఖ అనుమతించింది. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సైతం కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో మహిపాల్‌రెడ్డితోపాటు ఆయన తల్లి, తమ్ముడు, డ్రైవర్‌, పీఏకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థరణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే  తెలిపారు. 

8. ఎయిమ్స్‌లో చేరకపోవడం ఆశ్చర్యం కలిగించింది

ప్రభుత్వ సంస్థలు ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రముఖులు వాటిని సందర్శించి మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కరోనా వైరస్‌ సోకిన అనంతరం హోం మంత్రి అమిత్‌ షా ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందడాన్ని థరూర్ తప్పుబట్టారు. ‘‘హోం మంత్రి అనారోగ్యానికి గురైనప్పుడు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వెళ్లకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని శశిథరూర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. త్రిభాషా విధానానికి వ్యతిరేకం: తమిళనాడు

కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్రిభాషా విధానాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ నూతన విధానాన్ని రాష్ట్రంలో అమలుచేయమని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. చైనాలోనూ 7కోట్ల ఉద్యోగాలు మాయం!

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో మాత్రం పరిస్థితులపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే  చైనా కూడా కరోనా ఆర్థికంగా కుంగిపోయినట్లు అక్కడి ఆర్థికరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. మార్చి నెలలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో చైనాలో చాలాచోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగాయి. ఈ సమయంలో దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.