close

తాజా వార్తలు

Updated : 07/04/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు నెలల్లో అంబానీ ఎంత కోల్పోయారంటే!

ముంబయి: కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సామాన్యుడి నుంచి కుబేరుడి వరకు అందరిపైనా ప్రభావం చూపిస్తోంది. తాజాగా భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత రెండు నెలల్లో స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అంబానీ మార్చి 31 నాటికి రోజుకి 300 మిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయన మొత్తంగా 19 బిలియన్‌ డాలర్ల మేర సంపదను కోల్పోయి అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయినట్లు హురున్ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ అనే సంస్థ వెల్లడించింది. ఇక మరో భారత్ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ 37 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌ నాడార్ 26 శాతం, ఉదయ్‌ కొటక్‌ 28 శాతం మేర సంపదను కోల్పోయినట్లు సదరు సంస్థ వెల్లడించింది. దీంతో వీరంతా టాప్‌ 100 జాబితాలో స్థానాన్ని కోల్పోయారని హురున్‌ పేర్కొంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీ మాత్రమే టాప్‌ 100 జాబితాలో కొనసాగుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా స్టాక్‌మార్కెట్లలో షేర్ల అమ్మకాల ఒత్తిడి ఉండటంతో గత రెండు నెలల్లో 25 శాతం మేర మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. 

‘‘స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత్‌లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు 26 శాతం మేర సంపదను కోల్పోయారు. అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ 5.2 శాతం మేర పడిపోయింది. ముకేశ్‌ అంబానీకి కూడా తన సంపదలో 28 శాతం కోల్పోయారు’’ అని హురున్‌ నివేదిక మేనేజింగ్ డైరెక్టర్‌ అనాస్ రెహమాన్‌ తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంపద కోల్పోయిన కుబేరుల్లో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఇక మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ్య ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎమ్‌హెచ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ బెర్నాడ్ ఆర్నాల్ట్‌ ఉన్నారు. వీరితో పాటు వారెన్‌ బఫెట్ 19 శాతం, జెఫ్ బెజోస్‌ 9 శాతం, బిల్‌ గేట్స్ 14 శాతం మేర సంపదను కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని