close

తాజా వార్తలు

‘పేరుకు దిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’

హైదరాబాద్‌: మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరొకసారి బలంగా విశ్వసించించారంటూ ఆయన ధన్యవాదాలు చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్‌, ఛైర్మన్‌ ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ధాటికి  ప్రత్యర్థి పార్టీలు తిప్పలు పడ్డాయని.. పలుచోట్ల కాంగ్రెస్‌, భాజపా కుమ్మక్కయ్యాయని చెప్పారు. మక్తల్‌లో భాజపా అభ్యర్థి మున్సిపల్‌ ఛైర్మన్‌గా నిలబడితే కాంగ్రెస్‌ మద్దతిచ్చిందని.. మణికొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఛైర్మన్‌గా.. కాంగ్రెస్‌ అభ్యర్థి వైస్‌ఛైర్మన్‌గా గెలిచారని ఆయన తెలిపారు. తుర్కయాంజల్‌లోనూ ఇలాగే జరిగిందన్నారు.

వారిది అపవిత్ర అవగాహన

‘‘పేరుకి దిల్లీ పార్టీలు.. చేసేవన్నీ సిల్లీ పనులు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే భాజపా, కాంగ్రెస్‌.. చివరికి పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వారిది అపవిత్ర అవగాహన అని ఎన్నికల ముందే చెప్పాం. ఇప్పుడు అది బయటకు వచ్చింది. నిస్సిగ్గుగా విలువలకు తిలోదకాలిచ్చి ఈ రకంగా చేస్తున్నారు. అయినప్పటికీ మేం జయకేతనం ఎగురవేశాం. రేపు జరగనున్న మేడ్చల్‌, నేరేడుచర్లలోనూ కచ్చితంగా గెలుస్తాం.  కేవలం 8 మాత్రమే ఇతరులకు వెళ్లాయి. కాంగ్రెస్‌ 4, భాజపా 2, ఎంఐఎం 2 మున్సిపాలిటీలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెరాస సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 120 మున్సిపాలిటీల్లో 112, పదింటికి పది కార్పొరేషన్లను గెలుపొందడమంటే కలలో కూడా ఊహించని గొప్ప విషయం. ఈ విషయంలో మాకు అండగా నిలబడిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు’’ అని కేటీఆర్‌ చెప్పారు. 

ప్రతి వార్డులో నాలుగు కమిటీలు..

‘‘ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం. వాటిని తు.చ తప్పకుండా అమలు చేసే బాధ్యతను మున్సిపల్‌ శాఖ మంత్రిగా నేను తీసుకుంటాను. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఘన విజయాన్ని అందజేసినందున ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తాం. పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లందరికీ పట్టణాభివృద్ధిపై శిక్షణ అందిస్తాం. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సమర్ధంగా అమలు చేస్తాం. త్వరితగతిన ప్రజలకు పౌర సేవలు అందిస్తాం. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేస్తాం. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు చేపడతాం. ప్రతి వార్డు, డివిజన్లలో నాలుగు రకాల కమిటీ ఏర్పాటు చేస్తాం. యువజన కమిటీ, మహిళా కమిటీ, సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీ, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీల ద్వారా మున్సిపాలిటీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతాం. జవాబుదారీతనాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా యూనిఫైడ్‌ సర్వీసెస్ తీసుకొచ్చాం. ఏ మున్సిపల్‌ ఉద్యోగి అయినా రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసే విధానాన్ని తీసుకొచ్చాం. ఇప్పటికే దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాన్ని సమర్థంగా అమలు చేస్తాం’’ అని మంత్రి వివరించారు.  

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.