
తాజా వార్తలు
భారత నౌకాదళం అత్యుత్తమం: రక్షణ మంత్రి
నావికాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాజ్‌నాథ్‌సింగ్
దిల్లీ: భారత నౌకాదళం అత్యుత్తమమైనదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించారు. శుక్రవారం భారత నావికా దినోత్సవ సందర్భంగా ఆయన నౌకాదళ నైపుణ్యాలను, వారి సేవలను కొనియాడారు. ‘‘నావికా దినోత్సవ సందర్భంగా ఈ అత్యుత్తమ సైన్యానికి శుభాకాంక్షలు. మన సముద్రాలు సురక్షితంగా ఉండేలా చూస్తున్న వారి శౌర్యానికి, ధైర్యానికి నా వందనం’’ అని రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. నావికా దినోత్సవ సందర్భంగా త్రివిధ దళాధిపతులు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. సముద్ర భద్రతను కాపాడుతున్న నేవీ సిబ్బంది నిబద్ధత అద్భుతమైనది అని నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంలో పాకిస్థాన్ నౌకలపై భారత నౌకాదళ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా డిసెంబరు 4ను నావికా దినోత్సవంగా జరుపుతున్నారు. చైనా నౌకాదళానికి చెందిన ఓడలు, జలాంతర్గాములు భారత సముద్రజలాల్లోకి ప్రవేశిస్తుండటంతో భారత నౌకాదళం నిఘాను పెంచి, హిందూ మహా సముద్రంలో కార్యకలాపాలను విస్తరించింది. నావికాదినోత్సవ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రముఖులు నౌకా దళానికి శుభాకాంక్షలు తెలిపారు.