close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా: వేడుక చేసే వేదిక ఏది?

అన్ని వేదికల్లో ఐపీఎల్‌ ఆతిథ్యం కష్టం

రెండు వేదికలు చాలంటున్న విశ్లేషకులు

హైదరాబాద్‌-విశాఖ సర్క్యూట్‌ భద్రం!

 ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదాపడితే ఐపీఎల్‌-2020కి మార్గం సుగమం అవుతుంది. అక్టోబర్‌ విండోలో లీగ్‌ నిర్వహణకు అడ్డంకులేమీ ఉండవు. అప్పటికి విదేశీ ఆటగాళ్ల రాకపైనా స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అన్ని ఫ్రాంచైజీలు ఆశాభావంతోనే ఉన్నాయి. అయితే గతంలో మాదిరిగా అన్ని వేదికల్లో మ్యాచులు కష్టం. ఆటగాళ్ల ప్రయాణం కష్టం. మరి దీన్ని అధిగమించేదెలా?


 ప్రయాణం ప్రమాదకరం 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. దిల్లీ క్యాపిటల్స్‌కు అరుణ్‌ జైట్లీ (కోట్లా), రాజస్థాన్‌ రాయల్స్‌కు సవాయ్‌ మాన్‌సింగ్‌, ముంబయి ఇండియన్స్‌కు వాంఖడే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు రాజీవ్‌ గాంధీ (ఉప్పల్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చిదంబరం, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు చిన్నస్వామి, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈడెన్‌గార్డెన్స్‌, కింగ్స్‌ XI పంజాబ్‌కు ఐఎస్‌ బింద్రా సొంత మైదానాలు. ఒక్కో జట్టు 14 లీగ్‌ మ్యాచులు ఆడుతుంది. ఇందులో ఏడు సొంత మైదానాల్లో తలపడితే మిగతా ఏడు ప్రత్యర్థి మైదానాల్లో ఆడతాయి. అంటే మ్యాచ్‌ ముగియగానే ఏదో ఒక జట్టు విమానం ఎక్కాల్సిందే. మరి కరోనా వైరస్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో విపరీతంగా ప్రయాణించే తీరికలేని షెడ్యూలు మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.


రెండు నగరాలకే పరిమితం!


 

ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి గానీ వైరస్‌ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రయాణాలు చేస్తే ఎక్కువగా సంచారం ఉంటుంది. ఇది వైరస్‌ సంక్రమణానికి దారితీస్తుంది. భౌతిక దూరం కష్టమవుతుంది. అందుకే 3 లేదా 4 మైదానాలుండే నగరాలను వేదికలుగా ఎంపిక చేయాలని టీమ్‌ఇండియా మాజీ సారథి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే, హైదరాబాదీ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచిస్తున్నారు. ఎలాగూ అభిమానులకు ప్రవేశం లేదు.  ఇలా రెండు నగరాలను ఎంపిక చేస్తే ప్రయాణాలు తగ్గుతాయి. ఆతిథ్యం, బస సులభం అవుతాయి. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ఫ్రాంచైజీ సిబ్బంది, అధికారులు వైరస్‌ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి దొరుకుతుంది. ఉపశమనం కలుగుతుంది. మరి ఏయే నగరాలు ఇందుకు అత్యుత్తమం?


ప్చ్‌.. ముంబయి!

దేశంలోని అగ్రశ్రేణి 50 అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల్లో ఎక్కువగా ముంబయిలోనే ఉన్నాయి. అక్కడ వాంఖడే, బ్రబౌర్న్‌, జింఖాన ఉన్నాయి. వాంఖడే ఎక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. దేశంలో ఎక్కువ కొవిడ్‌-19 కేసులున్న నగరం ముంబయి. అక్కడ వైరస్‌ను నియంత్రించేందుకు స్థానిక ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. అక్టోబర్‌ వరకు కేసుల సంఖ్య తగ్గుదలను బట్టే అక్కడ ఆతిథ్యం ఉంటుంది. ఇప్పటికైతే సురక్షితం కాదు. ఇక దిల్లీ విషయానికి వస్తే అరుణ్‌ జైట్లీ (కోట్లా), నెహ్రూ స్టేడియం అంతర్జాతీయ మ్యాచులకు వేదికలుగా నిలిచాయి. ఇవి కాకుండా పాలం, హర్బక్స్‌సింగ్‌ ఉన్నాయి. ఇక్కడ రంజీలు ఆడతారు. వైరస్‌ ఇక్కడా ఉగ్రరూపమే దాల్చింది. బెంగళూరులో చిన్నస్వామి, కోల్‌కతాలో ఈడెన్‌ మాత్రమే ముఖ్యమైనవి. ఇతర మైదానాలు లేవు. హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ (ఉప్పల్‌), ఎల్‌బీ స్టేడియంకు అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చిన అనుభవం ఉంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కరోనా బెడద తక్కువగానే ఉంది. విశాఖలో ఇందిరా ప్రియదర్శిని, వైఎస్‌ఆర్‌ స్టేడియాలు ఉన్నాయి. చెన్నైలో చిదంబరం, నెహ్రూ స్టేడియం ఉన్నప్పటికీ వైరస్‌ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది.


హైదరాబాద్‌+విశాఖ సర్య్కూట్‌

ఎక్కువ స్టేడియాలున్న ప్రాంతాల్లోనేమో కరోనా తాండవం చేస్తోంది. జైపూర్‌, బెంగళూరు, కాన్పూర్‌, లక్‌నవూ, తిరువనంతపురం వంటి నగరాల్లోనేమో ఒకే స్టేడియం ఉంది. అలాంటప్పుడు సమీప ప్రాంతాల్లో బయో బబుల్‌ సృష్టించి ఆడించడమే మార్గంగా కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రెండు స్టేడియాల్లో నాలుగు జట్లను ఉంచాలి. విశాఖలోని రెండు మైదానాల్లో మరో నాలుగు జట్లు ఉండాలి. పరిస్థితులను బట్టి ఒక్కో జట్టు ఒక్కో నగరంలో కనీసం మూడు లేదా ఆరు మ్యాచులు ఆడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి విశాఖకు విమాన ప్రయాణం సైతం సులభంగానే ఉంటుంది. వైరస్‌ భయమూ మరీ లేదు. లేదంటే బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, భువనేశ్వర్‌/కటక్‌ను ఒక సర్క్యూట్‌గా చేసి ఆడించొచ్చు. తిరువనంతపురం-బెంగళూరు-హైదరాబాద్‌-విశాఖనూ సర్య్కూట్‌గా చేయొచ్చు. వీటితో పోలిస్తే మొహాలి-కాన్పూర్‌-లక్‌నవూ-గువాహటి సర్క్యూట్‌లో ఒక స్టేడియమే ఉండటం, ప్రయాణం, నిర్వహణ, ఆతిథ్యం కాస్త ఇబ్బందికరం! మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాల్సిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.