close

తాజా వార్తలు

నా బిడ్డను..ఆ దేవుడే కాపాడతాడు!

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళను చూడండి... 
తన ఒడిలో ఉన్న బిడ్డకు మూడునెలల కిందటే జన్మనిచ్చింది...
మా ఇంటి మహాలక్ష్మి అంటూ మురిసిపోయింది... అదే ఆనందంతో గడుపుతోంది... 
ఇంతలోనే ఏమైందో ఏమో.. 
మూడురోజుల కిందట బిడ్డకు జబ్బు చేసింది.. 
గిరిశిఖర ప్రాంతం నుంచి చిన్నారితో సాలూరు ఆసుపత్రికి చేరింది.. 
శ్వాసకోశ వ్యాధితోపాటు రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారికి రెండు రోజులు అత్యవసరం వైద్యం అందించిన వైద్యులు.. పరిస్థితి విషమిస్తోందని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. 
అయితే ఇక్కడ ఓ తిరకాసు, అంబులెన్సు ఉన్నా పెట్రోలుకు డబ్బులుంటేనే తీసుకెళతారట..
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది.. 
‘తినడానికి కూడా చేతిలో డబ్బుల్లేవు... ఇక దారి ఖర్చులకు డబ్బులెలా వస్తాయ్‌.. అక్కడ ఉచితంగా వైద్యం చేసినా.. మేం వెళ్లే పరిస్థితి లేదంటూ ఆమె ఆ  దేవుడిపైనే భారం వేసింది.. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిపోయింది... 


..ఇదీ సాలూరు మండలం కురుకుట్టి గిరిజన ప్రాంతానికి చెందిన ఓ బాలింత దయనీయ గాథ.. గిరిజన ప్రజలకు అన్ని వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెబుతున్న మన యంత్రాగం నిరుపేద  గిరిజన రోగులను అంబులెన్సులో కూడా పెద్దాసుపత్రికి చేర్చలేని దుస్థితి.. నిత్యం ఇటువంటి ఘటనలు ఈ  ప్రాంతంలో మామూలే అయిపోయాయి.. ఎన్నో ప్రాణాలకు వైద్యం అందక గాలిలోనే కలిసిపోతున్న ఉదంతాలు కూడా ఉంటున్నాయి.

 - న్యూస్‌టుడే, సాలూరు

న్యూస్‌టుడే, సాలూరు: సాలూరు మండలం కురుకుట్టి గ్రామానికి చెందిన వంతల లక్ష్మి మూడునెలల కిందట ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇటీవల మూడురోజుల కిందట ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది. కొండ శిఖర గ్రామమైనా మైదాన ప్రాంతంలోని సాలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించారు. వైద్యులు పాపకు వైద్య పరీక్షలు చేసి, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోందని చెప్పారు. రక్తహీనత కూడా పీడిస్తుందన్నారు. శ్వాస అందక బాధపడుతున్న చిన్నారికి రెండు రోజులుగా వైద్యులు ఆక్సిజన్‌ అందించి ప్రాణం నిలబెట్టారు. పాప పరిస్థితి విషమిస్తోందని, కేంద్రాసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం రిఫర్‌ చేశారు. అయితే తమ దగ్గర  డబ్బులు లేవని, ఒడిశాలో కూలిపనులు చేసుకుని బతుకుతున్నామని వెళ్లేందుకు కూడా డబ్బులు లేవని వాపోయింది పాపం ఆ తల్లి. పెద్దాసుపత్రికి తీసుకెళ్లలేని వాపోయింది. తన బిడ్డను ఆ దేవుడే కాపాడతాడంటూ చిన్నారి తీసుకుని భర్త సుబ్బారావుతో పాటు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది. లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా అమ్మ అనే పిలుపునకు నోచుకోని వారెంతో మందిని చూస్తున్నాం. జన్మనిచ్చిన బిడ్డ అనారోగ్యంతో బాధపడితే ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందించలేక బిడ్డను కాపాడుకోలేని తల్లులు ఉన్నారు అనేందుకు ఈ లక్ష్మి దయనీయ గాథే ఓ ఉదాహరణ... 
బిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు సాలూరు సీహెచ్‌సీ నుంచి జిల్లా కేంద్రంలోని కేంద్రాసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితులు జిల్లాలోని అదీ గిరిజన ప్రాంతంలో కనిపిస్తూనే ఉన్నాయి.. వైద్యం ఉచితంగానే అందిస్తారని చెప్పినా.. తినేందుకు కూడా తమ దగ్గర డబ్బులు లేవని, అంత దూరం పాపతో ఎలా వెళ్లగలమని, ఎక్కడ ఉండాలని బాధపడుతూ తల్లిడిల్లిపోయింది ఆ తల్లి. ఇక చేసేది లేదని తన బిడ్డను ఆ దేవుడే కాపాడుతాడంటూ వెళ్లిపోయింది. 

బిడ్డను తీసుకువెళ్లొద్దని వారిస్తున్న ఆసుపత్రి సిబ్బంది

అంబులెన్స్‌ ఇంధనానికి నిధుల్లేవు
ప్రభుత్వాసుపత్రి అంబులెన్స్‌ వాహనానికి ఇంధనం వేసేందుకు నిధులు లేవు. ఎన్నో ఏళ్లుగా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. కానీ మంజూరు చేయడం లేదు. రోగులకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్‌ చేస్తే రోగులే అంబులెన్స్‌ వాహనానికి ఇంధనం పోయించుకుని వెళుతున్నారు. వెళ్లక తప్పదు. వాహనం, డ్రైవరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. నిధులు లేవు. 

- ఎస్‌వి. రామ్మూర్తి, సీహెచ్‌సీ వైద్యాధికారి, సాలూరు


గిరిజనులకు ఏదీ సాయం..
అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో కేంద్రాసుపత్రికి వెళ్లలేని గిరిజనులకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాల్సిన ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం మానేశారు. వారే శ్రద్ధ చూపితే ఇటువంటి ఘటనలు జరిగేవే కాదు.. గతేడాది సెప్టెంబరులో జనవరి వలస గ్రామానికి చెందిన గిరిజనుడు కేంద్రాసుపత్రికి అంబులెన్స్‌లో వెళ్లేందుకు డబ్బులు లేవని ఇంటి దారి పట్టాడు. ఇంటికి వెళ్లిన మరుసటి రోజునే అనారోగ్యంతో మృతి చెందాడు. అలాగే పాచిపెంట మండలానికి చెందిన బాలింత కూడా నిస్సహాయస్థితిలోనే ఉండిపోయి మృత్యువాత పడింది. ఇటువంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరుగుతున్నా.. అధికారుల్లో మాత్రం చలనం ఉండటం లేదు. గిరిజనులకు వైద్యం అందించేందుకు, అంబులెన్స్‌ ఖర్చులకోసం రూ.10వేలు నిధులు ప్రభుత్వాసుపత్రికి ఐటీడీఏ సమకూర్చేది. గత రెండేళ్లుగా నిధులు ఇవ్వడం లేదు. సరైన వైద్యం అందించడం లేదు. అందుకే అనారోగ్యానికి గురైన గిరిజనులకు ఆర్థిక ఇబ్బందులే యమగండంగా మారుతున్నాయి.   


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.