close

తాజా వార్తలు

Published : 25/09/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. బాలు.. నువ్వు నా మాట వినలేదు: ఇళయరాజా

తన ప్రాణ మిత్రుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. నోట మాటలు రావడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. ‘బాలు.. నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని, త్వరగా తిరిగి రమ్మని నీకు చెప్పా. కానీ నువ్వు నా మాటలు వినలేదు, వెళ్లిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్లావు?, ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇప్పుడు ప్రపంచంలోని దేన్నీ నేను చూడలేను. నాకు మాటలు రావడం లేదు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఏ దుఖాఃనికైనా ఓ పరిమితి ఉంటుంది, కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు..’ అని ఆయన భావాల్ని వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలుగుతల్లికి గర్భశోకం:జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తన అమృతగానంతో తెలుగు భాష, సాహిత్య చరిత్రలను సజీవంగా ఉంచడమే కాకుండా ప్రజ్వరిల్లింపజేసిన మహనీయుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ఆయన మరణం తెలుగు భాషకు, జాతికి తీరని లోటని చెప్పారు. సుస్వర మాధుర్యంతో యావత్‌ ప్రపంచాన్ని ఆనందసాగరంలో ఓలలాడించిన గొప్ప మనిషి ఎస్పీ బాలు అని ఆయన కొనియాడారు. ‘‘తన అమరగానంతో తెలుగుభాషలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టి యావత్‌ సంగీత సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన జైత్రయాత్రికుడు ఆయన’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రైతుల ప్రయోజనం కోసమే సంస్కరణలు: మోదీ

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాలు, వారి వాగ్దానాలను గాలికి వదిలేశాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి రైతులకు, కులీలకు అబద్దాలు చెబుతూనే ఉన్నారని.. తాజా సంస్కరణలపై ఇప్పుడు కూడా రైతులను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో కరోనా.. 7,073 కొత్త కేసులు

ఏపీలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల వ్యవధిలో 69,429 నమూనాలను పరీక్షించగా 7,073 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 8,695 మంది కోలుకోగా.. 48 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 8, అనంతపురం 6, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, కడప 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,606కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచే దుర్గంచెరువు తీగల వంతెన (కేబుల్‌ బ్రిడ్జి) అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దీన్ని ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణతోపాటు మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ మధ్య ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గనున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. ఎల్‌ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు కనువిందు చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టాటా నుంచి వైదొలగనున్న పల్లోంజీ..!

టాటా-సైరస్‌ మిస్త్రీ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల టాటా గ్రూప్‌లోని తమ వాటాలను విక్రయించి వైదొలుగుతామని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ పేర్కొంది. ఈ కంపెనీకి టాటాలో 18.4శాతం వాటా ఉంది. దీనిలోని వాటాలను విక్రయించి తమ ఎస్‌పీ గ్రూపులో పెట్టాలని నిశ్చయించుకుంది. గతంలో ఈ వాటాలాను తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకున్నారు. కానీ, టాటా తాము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు వెల్లడించడంతో ఎస్‌పీగ్రూప్‌ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది. ఇక్కడ మరోసారి టాటాలు.. మిస్త్రీల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆమె కోసం భూమి అమ్మి.. ఏనుగు కొన్నాడు

భార్య కోరిక తీర్చడం కోసం నగలు, ఆస్తులు కొనేవారు ఎందరో ఉన్నారు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన దులాల్‌ చంద్ర రాయ్‌ (46) అనే వ్యక్తి తన భార్య ముచ్చట తీర్చటం కోసం చేసిన కొనుగోలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దులాల్‌ చంద్ర తన భార్య తులసీ రాణి దాసితో లాల్‌మోనిర్హాత్‌ అనే చిన్న గ్రామంలో ఉంటున్నాడు. ఆయన భార్యకు తాము ఓ ఏనుగును కొన్నట్టు.. దానిని పెంచుకుంటున్నట్టు ఏడాది క్రితం కల వచ్చిందట. దాంతో ఏనుగును పెంచుకోవాలని ఆమె భావించింది. కాగా, భార్య సరదా తీర్చటం కోసం దులాల్‌ తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మి.. వచ్చిన 16.5 లక్షల టాకాలతో ఓ ఏనుగును కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గావస్కర్‌పై అనుష్క తీవ్ర ఆగ్రహం

టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌‌ గావస్కర్‌ వివాదంలో చిక్కుకున్నాడు. భారత సారథి విరాట్‌ కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ నటి అయిన అనుష్క శర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 టోర్నీ‌లో గురువారం జరిగిన బెంగళూరు×పంజాబ్‌ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా ఉన్న గావస్కర్..‌ అనుష్కపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వ్యాక్సిన్‌ వినియోగానికి WHO మద్దతు: చైనా!

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను వినియోగించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు అనుమతించినట్లు తాజాగా చైనా ప్రకటించింది. ఇప్పటికే మూడో దశ ప్రయోగాలు కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ను, ప్రజలకు ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు తెలిపినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోన్న ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర కార్యక్రమం కింద వేల మంది ప్రజలకు ఇస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ ప్రమాదం పొంచివున్న ఆరోగ్యకార్యకర్తలకు, ప్రజలకు ఈ టీకాలను వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గాల్లోనే చక్కర్లు: విమాన ప్రయాణంలో వినూత్న సేవలు

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా విమాన ప్రయాణాలను మిస్‌ అవుతున్న ప్రయాణికుల కోసం ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వాంటస్‌ ఎయిర్‌వేస్‌ వినూత్న సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లైట్‌ టు నోవేర్‌’ పేరుతో నడిపే ఈ విమానంలో సిడ్నీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని, ఏడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టి.. మళ్లీ సిడ్నీ విమానాశ్రయంలోనే దింపేస్తారట. ప్రయాణికులకు ఈ ఏడు గంటల్లో ప్రముఖ సందర్శక ప్రాంతాలు క్వీన్స్‌లాండ్‌, న్యూ సౌత్‌ వేల్స్‌, గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌, ఊలూరు, సిడ్నీ హార్బర్‌ తదితర ప్రాంతాలను విమానంలోనుంచే చూపిస్తారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.