close

తాజా వార్తలు

Published : 07/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో (9AM-9AM) కొత్తగా 10,171 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,20,464 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 62,938 నమూనాలు, ఇప్పటి వరకు 23,62,270 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ మౌనం వెనుక కుట్ర: ఉత్తమ్‌

పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్‌ వైఫల్యం చెందారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జూమ్‌ యాప్‌ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడు అంశంలో కేసీఆర్‌ మౌనం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి హాజరుకాకుండా కేబినెట్‌ భేటీ ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో సీమ ఎత్తిపోతలను ఆపే ఒక్క అంశం లేదని చెప్పారు. పిటిషన్‌లో కర్ణాటక, మహారాష్ట్రను ఎందుకు చేర్చారో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోతే కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అక్కడికెళ్తే  హోం ఐసోలేషన్‌ తప్పనిసరి‌‌!

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ముంబయి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై నగరానికి వచ్చిన ప్రయాణికులెవరైనా 14 రోజులపాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ మేరకు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. దేశంలో ఎక్కడి నుంచైనా ముంబయికి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా దీన్నుంచి మినహాయింపు పొందాలనుకుంటే మాత్రం రెండు రోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు బీఎంసీ ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బీరుట్‌ బ్లాస్ట్‌: స్వతంత్ర దర్యాప్తు జరపాలి-ఐరాస!

లెబనాన్‌లో రాజధాని బీరుట్‌లో జరిగిన భారీ పేలుళ్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనలో 150మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో జవాబుదారీ కోరుతున్న బాధితుల గొంతుకను తప్పక వినాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం స్పష్టం చేసింది. బీరుట్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం అధికార ప్రతినిధి రూపెర్ట్‌ కోల్‌విల్లే ప్రపంచదేశాలను కోరారు. అత్యంత వేగంగా స్పందించి లెబనాన్‌ను ఆదుకోవడంలో సాయపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ట్విటర్‌ లేబులింగ్‌ ఇలా..

ఫేక్‌న్యూస్‌ కట్టడికి ట్విటర్‌ ఇప్పటికే ఫ్యాక్ట్‌ చెక్‌ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని మరికొంచెం ముందుకు తీసుకెళ్లి మరో కొత్త చర్యను చేపట్టింది. ప్రభుత్వ అధికారులు, కీలక సంస్థలు, మీడియా ప్రతినిధుల ట్విటర్‌ ఖాతాలకు లేబుల్స్‌ ఇస్తోంది. ఈ విధానం వల్ల ప్రజలు వారు చెప్పేదానిని అంచనావేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. అధికారులు, ఉద్యోగులు సమాచారం పంచుకోవడాన్ని కొనసాగించవచ్చని వెల్లడించింది.  ముఖ్యంగా అమెరికా ఎన్నికలు సమీపిస్తుండటంతో తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టిక్‌టాక్‌ బ్యాన్‌: అమెరికాపై చైనా ఆగ్రహం!

దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా విరుచుకుపడింది. ట్రంప్‌ తాజా ప్రకటనను చైనా పూర్తిగా వ్యతిరేకించింది. తమ దేశానికి చెందిన వాణిజ్య కంపెనీలకు తాము మద్దతుగా ఉంటామని చైనా స్పష్టం చేసింది. నిర్ణయం అనంతర పర్యవసానాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అమెరికాను హెచ్చరించారు. ‘జాతీయ భద్రత అనే సాకు చూపుతూ తమకున్న అధికారాలతో అమెరికాయేతర కంపెనీలను అమెరికా అణచివేస్తోంది. ఇది కేవలం ఆధిపత్య ధోరణి మాత్రమే. అమెరికా వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనాను జయించిన 105 ఏళ్ల వృద్ధురాలు!  

కొవిడ్‌ నుంచి కోలుకోవాలంటే మందులు ఒక్కటే కాదు.. మనోధైర్యం కూడా ముఖ్యమే అని చెబుతోంది 105 ఏళ్ల ఓ వృద్ధురాలు. ఈ వయసులో కొవిడ్‌ను జయించి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి చేరుకుని అందరిరీ ఆదర్శంగా నిలుస్తోంది. కర్నూలు పాతనగరంలోని పెద్దపడకానా ప్రాంతంలో నివాసం ఉండే మోహనమ్మ ఇటీవల కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. జులై 19న వచ్చిన ఫలితాల్లో కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు మోహనమ్మను కర్నూలు సర్వజన వైద్య శాలలో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండటంతో ఆమెకు వైద్యులు ఆక్సిజన్‌ కూడా అందించారు. ఈ క్రమంలో కేవలం 14 రోజుల్లోనే మోహనమ్మ కొవిడ్‌ నుంచి బయట పడటం అందరికీ ఆశ్చర్చానికి గురిచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌×ఇంగ్లాండ్‌: వాయిదా వేసిన బీసీసీఐ

ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరగాల్సిన భారత్‌-ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడింది. ఈ సిరీస్‌ను 2021కి వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు తొలగకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. వచ్చే ఏడాది టెస్టు సిరీస్‌ తర్వాత ఈ సిరీస్‌ను కొనసాగిస్తారు. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడతారు. ‘ఇంగ్లాండ్‌తో అన్ని ఫార్మాట్ల షెడ్యూలును ధ్రువీకరించుకొనేందుకే ఈసీబీ, బీసీసీఐ సంపద్రింపులు జరిపాయి. 2021 జనవరి నుంచి మార్చి వరకు ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు భారత్‌లో పర్యటిస్తుంది’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆమె మాటలు స్ఫూర్తిదాయకం: నాగ చైతన్య

కరోనా వైరస్‌ బారినపడిన సామాన్యులు ఎలా విజేతలుగా నిలిచారనే విషయంపై  ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇటీవల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా హీరో నాగచైతన్యను నామినేట్‌ చేశారు. ఇటీవల నాగచైతన్య... సునీత అనే నర్సుతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఇప్పుడు ఈ బృహత్‌ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను చైతన్య నామినేట్‌ చేశారు. కొవిడ్‌-19ను జయించిన సునీత అనే నర్సుతో చైతన్య గత వారం ఆన్‌లైన్‌ ద్వారా ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో సునీత మాటలు చాలా సహాయకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కామత్‌ కమిటీలోకి మరో ముగ్గురు..?

రుణ పునర్నిర్మాణాల కోసం నిబంధనలు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన  కె.వి.కామత్‌ కమిటీలోకి ముగ్గురు కీలక సభ్యులను తీసుకొన్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. వీరిలో ఎస్‌బీఐ మాజీ ఎండీ దివాకర్‌ గుప్తా(ప్రస్తుత ఏడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌), టీఎన్‌ మోహన్‌(కెనరా బ్యాంక్‌ ఛైర్మన్‌), అశ్విన్‌ ప్రకాశ్‌లు ఉన్నారు. వీరితోపాటు ఐబీఏ సీఈవో ఈ కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయలను సేకరిస్తుంది. వాటి నుంచి ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఈ కమిటీ తమ నివేదికను 30 రోజుల్లోపు ఆర్‌బీఐకి అందజేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.