close

తాజా వార్తలు

Published : 05/12/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. దక్కని ఆధిక్యం

ఉద్వేగభరిత ఉపన్యాసాలు, సవాళ్లు- ప్రతిసవాళ్లు, జాతీయ స్థాయి నేతల ప్రచారంతో దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్నివ్వలేదు. అధికార తెరాసను మేయర్‌ పీఠానికి కాస్తంత దూరంలో నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో కారు వేగాన్ని కమలం నిలువరించింది. 150 డివిజన్లున్న బల్దియాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి  55 స్థానాలు పొంది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అనూహ్యంగా పుంజుకున్న భారతీయ జనతా పార్టీ  48 స్థానాల్లో విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ రాజీనామా

2. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కావు

కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని, పరిస్థితులు అనుకూలంగా లేవని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ సమ్మతితోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌, తేదీలు ప్రకటించేలా పంచాయతీరాజ్‌ చట్టంలో అవసరమైన నిబంధనలు పొందుపరచాలని సభ తీర్మానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైద్యసిబ్బంది, వృద్ధులకు తొలి టీకా

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొన్ని వారాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. శాస్త్రవేత్తలు ఆమోదం తెలపగానే దేశంలో తొలిదశ వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ పంపిణీలో కూడా సమస్యలు లేవని, ఈ విషయంలో భారత్‌కు విస్తృత అనుభవం ఉందని వివరించారు. తొలి దశలో వైద్యసిబ్బందికి, వయోవృద్ధులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన పార్లమెంటులోని వివిధ సభాపక్ష నాయకులతో మాట్లాడారు. కరోనా నియంత్రణ, వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ అంశంలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాగ్‌ నివేదిక రుణం.. భారం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2026 చివరి నాటికి రూ.1,03,550 కోట్ల రుణం తీర్చాల్సి ఉంటుందని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)నివేదిక స్పష్టం చేసింది. 2019 మార్చి చివరి నాటి గణాంకాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ధారణకు వచ్చింది. ఈ రుణాలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో వివేచనతో కూడిన రుణ వ్యూహం అమలు చేయాలని సూచించింది. ఈ అప్పు తీర్చేందుకు సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులు చేయడం కష్టమే అని విశ్లేషించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారతీయ భాషలకు సెంట్రల్‌ వర్సిటీ!

భారతీయ భాషలకు పెద్దపీట వేస్తామని జాతీయ నూతన విద్యావిధానంలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తదనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది. భారతీయ భాషలపై ప్రత్యేకంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ(సీఐఐఎల్‌)ను భారతీయ భాషల విశ్వవిద్యాలయం(బీవీవీ)గా  ఉన్నతీకరించాలన్నది ఆలోచన. సాధ్యాసాధ్యాల పరిశీలన, నిధుల అవసరం తదితరాలపై అధ్యయనంతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌(ఐఐటీఐ) ఏర్పాటుపై నిపుణుల కమిటీని నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తేనె కల్తీపై పరిశోధన వివరాలివిగో..!

ప్రముఖ బ్రాండ్లు విక్రయిస్తున్న తేనెల్లో కల్తీకి సంబంధించి తాము జరిపిన పరిశోధనల వివరాలను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి అందజేసినట్లు శాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) శుక్రవారం వెల్లడించింది. కల్తీ గుట్టును వెలుగులోకి తెచ్చేందుకు తాము అనుసరించిన విధానాలన్నిటినీ సంస్థ అధికారులకు వివరించామని ఒక ప్రకటలో పేర్కొంది. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తనిఖీలకు అందని రీతిలో, ఆధునిక రూపంలో తేనె కల్తీ ఉంటోందని సీఎస్‌ఈ వెల్లడించిన విషయం తెలిసిందే. చైనా కంపెనీలు తాము తయారు చేస్తున్న ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు బహిరంగంగానే పేర్కొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రమాదాన్ని చూస్తున్నవారిపై దూసుకొచ్చిన వ్యాను

అతివేగం.. ఏమరుపాటు.. కారణంగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో అయిదు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సిద్దిపేట రాజీవ్‌ రహదారిపై ఒకేచోట కొద్దిసమయం తేడాతో ఈ ప్రమాదాలు సంభవించడంతో అమాయకులు మృత్యుఒడికి చేరారు. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపుగా వస్తున్న కారు కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. మృతదేహాలను తరలించే సమయంలో అక్కడ గుమికూడిన జనం పైకి వ్యాన్‌ దూసుకు రావడంతో మరో ఇద్దరు విగతజీవులయ్యారు. ఈ దుర్ఘటనలు సిద్దిపేట శివారు రంగీలా చౌరస్తా సమీపంలో శుక్రవారం జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 20, 23, 24 క్యారెట్ల ఆభరణాలకూ పసిడి హాల్‌మార్కింగ్‌: జీజేసీ విజ్ఞప్తి

వచ్చే ఏడాది జూన్‌ నుంచి హాల్‌మార్కింగ్‌ కలిగిన పసిడి ఆభరణాలే విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమిస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) శుక్రవారం స్వాగతించింది. వాస్తవానికి 2021 జనవరి 15 నుంచే ఈ విధానం అమలవ్వాల్సి ఉన్నా, కొవిడ్‌ వల్ల వాయిదా వేశారు. ‘పసిడికి హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేయడానికి స్వాగతిస్తున్నాం. వినియోగదారులకు  పారదర్శక సేవలు అందించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. గిరాకీ ఉన్న 20 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్ల ఆభరణాలను కూడా హాల్‌మార్కింగ్‌ విధానంలోకి తీసుకురావాలి’  అని జీజేసీ ఛైర్మన్‌ అనంత పద్మనాభన్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒక్కడు ఇద్దరై..

కోహ్లి నిరాశపరిచాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో రాహుల్‌ మినహా అందరూ విఫలమయ్యారు. బుమ్రా లేడు. షమి తేలిపోయాడు. అయినా టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. కేఎల్‌ రాహుల్‌ ఆరంభంలో ఇన్నింగ్స్‌కు పునాది వేస్తే.. చివర్లో జడేజా మెరుపులు మెరిపించి జట్టుకు పోరాడే స్కోరునందించాడు. చివర్లో అతడి తలకు బంతి తాకి కంకషన్‌కు గురవడంతో సబ్‌స్టిట్యూట్‌గా అనుకోకుండా జట్టులోకి వచ్చిన చాహల్‌.. ఆసీస్‌ను తన మాయాజాలంతో ముంచేశాడు. యువ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌ కూడా చక్కటి ప్రదర్శన చేయడంతో తొలి టీ20లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బాలయ్య బరిలో దిగితే...

దర్శకులు కథలతో సిద్ధంగా ఉండాలి కానీ... బాలకృష్ణ విరామం లేకుండా సినిమాలు చేస్తారు. వేగంలో ఆయనకి ఆయనే సాటి. బరిలోకి దిగారంటే మెరుపు వేగంతో సినిమాలు పూర్తవ్వాల్సిందే. ఒక పక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్నా సరే... సినిమాలతో క్రమం తప్పకుండా అభిమానుల్ని అలరిస్తుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలయ్య కోసం కొత్తగా రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ఇద్దరు కథానాయకులు కలిసి చేసే సినిమా. ఓ కొత్త దర్శకుడు సిద్ధం చేసిన ఆ కథలో బాలకృష్ణతోపాటు, నాగశౌర్య నటిస్తారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని