
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. బస్తీ హుషారు.. కాలనీ ఉసూరు
బల్దియా ఎన్నికల్లో బస్తీలు ఉత్సాహం చూపగా కాలనీలు బద్ధకించాయి. బస్తీల ప్రభావం ఎక్కువ ఉన్న డివిజన్లలో మెరుగైన పోలింగ్ శాతం నమోదు కాగా, కాలనీలు ఎక్కువగా ఉన్న చోట్ల తక్కువ మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో (45.29%) పోలిస్తే ఇది 1.26 శాతం ఎక్కువ. గురువారం ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీ పోలింగ్ ఉంది. ఇది పూర్తయిన తర్వాత కచ్చితమైన లెక్కతేలనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రెవెన్యూ లోటు పాట్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. అక్టోబరుతో ముగిసిన 7నెలల కాలానికి రూ.48,322.63 కోట్లకు చేరింది. నవంబరు లెక్కలు కూడా కలిపితే లోటు రూ.50వేల కోట్లు దాటినట్లేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏనాడూ ఈ స్థాయిలో రెవెన్యూ లోటు లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో రూ.26,646 కోట్లకు లోటు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7నెలలకే ఆదాయం కన్నా ఖర్చు అనూహ్యంగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ప్రజల భద్రత, మర్యాదలకు భరోసా
3. తగ్గింది... కానీ...
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గరిష్ఠంగా 23 శాతం వరకూ వెళ్లిన పాజిటివ్ కేసులు ప్రస్తుతం 2.57 శాతానికి పరిమితమయ్యాయి. కేసులు తగ్గిన నేపథ్యంలో ఆసుపత్రుల్లో కొవిడ్ పడకలు చాలావరకూ ఖాళీ అయ్యాయి. కానీ ప్రజలు ఏమరుపాటుగా ఉంటే.. మళ్లీ కొవిడ్ విజృంభించే ప్రమాదం ఉందని ప్రజారోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ‘మన దగ్గర కొవిడ్ రెండో ఉద్ధృతి రాదని అనుకోవడానికి వీల్లేదు. ఇటీవల జగిత్యాలలో ఒక పెళ్లికి జనం పెద్ద సంఖ్యలో హాజరవడం వల్ల అక్కడ వైరస్ వ్యాప్తి చెంది, ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఏపీలో పరిస్థితులు చేయిదాటక ముందే అడ్డుకట్ట వేయండి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థల నిధులను ఎన్నికల ప్రయోజనాల కోసం దారిమళ్లిస్తున్నారని, పరిస్థితులు చేయిదాటక ముందే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని.. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు. దీనితో పాటు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ నరేష్కుమార్ తనకు రాసిన లేఖను జత చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ప్రముఖ బ్రాండ్ల తేనె కల్తీనే!
భారత్‌లో అమ్ముడవుతున్న ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె.. చక్కెర పాకంతో కల్తీ అవుతోందని శాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్ఈ) బుధవారం వెల్లడించింది. స్వచ్ఛతను పరీక్షించడానికి 13 బ్రాండ్లకు చెందిన శుద్ధిచేసిన, ముడి తేనెను సీఎస్ఈ ఆహార పరిశోధకులు ఎంపిక చేశారు. మొత్తంగా 22 నమూనాలను పరిశీలించగా ఐదు మాత్రమే అన్ని పరీక్షలను పూర్తిచేసుకున్నాయని, 77శాతం నమూనాల్లో చక్కెర పాకం ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. వచ్చే వారం నుంచి.. బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్లు
కరోనా నివారణ కోసం తయారైన ఫైజర్/ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఈ టీకాకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. వచ్చే వారమే ప్రజలకు టీకాలు వేయడాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసింది. కొవిడ్-19 నుంచి 95% వరకు రక్షణను టీకా కల్పిస్తుందని, ప్రజలకు ఇచ్చేందుకు ఇది సురక్షితమని ‘ఔషధాలు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ’ (ఎంహెచ్ఆర్ఏ) తెలిపింది. ప్రమాణాల పరంగా ఏమాత్రం రాజీ పడకుండా శీఘ్రగతిన చేసిన విస్తృత విశ్లేషణ మేరకు వ్యాక్సిన్‌కు పచ్చజెండా ఊపినట్లు బ్రిటన్ ప్రభుత్వం వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మార్పులు పని చేశాయ్!
మూడో వన్డేలో కోహ్లి చేసిన నాలుగు మార్పులు భారత జట్టుకు కలిసొచ్చాయి. ఓపెనర్ మయాంక్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్.. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ క్రీజులో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. షార్ట్ పిచ్ బంతిని అతనాడిన పుల్ షాట్ సిక్సర్ ముచ్చటగొలిపింది. గిల్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మద్ షమి, యుజ్వేంద్ర చాహల్, నవ్‌దీప్ సైని స్థానాల్లో దిగిన శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మంగళగిరి పురపాలక మాజీ ఛైర్మన్, మాజీ కౌన్సిలర్లపై కేసులు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై తెదేపాకు చెందిన గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి, మరో ఆరుగురు తెదేపా మాజీ కౌన్సిలర్లు, దివంగత మరో కౌన్సిలర్ (వైకాపా)పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో 11 మంది పురపాలక అధికారులపైనా శాఖాపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు ఆదేశించారు. ఆరోపణలను నమోదు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర పురపాలక, అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్‌కు తన నివేదికను అందజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆన్లైౖన్ వ్యాపారం.. అంతా ‘మన’ చేతికే!
టాటా గ్రూప్ గూటికి ఆన్లైన్ గ్రోసరీ సంస్థ బిగ్‌బాస్కెట్ చేరడం ఖాయమైంది. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9800 కోట్ల)కు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ తుదిదశ చర్చలు జరుపుతోంది. అంటే ఈ ప్రకారం బిగ్‌బాస్కెట్ విలువ 1.6 బిలియన్ డాలర్లు అవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.లావాదేవీ ప్రతిపాదన ప్రకారం.. చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా (29 శాతం), ఇతర ముఖ్యమైన పెట్టుబడిదార్ల నుంచి 50-60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ప్రభాస్ కొత్త చిత్రం...‘సలార్’
‘బాహుబలి’ చిత్రాల తర్వాత పాన్ ఇండియా సినిమాలకి కేరాఫ్‌గా మారారు ప్రభాస్. ఆయన వరుసగా కొత్త సినిమాలకి పచ్చజెండా ఊపుతున్నారు. అన్నీ పాన్ ఇండియా స్థాయి చిత్రాలుగా రూపొందుతున్నవే. ‘కె.జి.ఎఫ్’ దర్శకనిర్మాతలతోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. ‘సలార్’ పేరుతో ఆ చిత్రం రూపొందుతోంది. బుధవారం సినిమాని అధికారికంగా ప్రకటించడంతోపాటు ప్రభాస్ లుక్‌నీ విడుదల చేసింది చిత్రబృందం. హోంబలే ఫిలింస్ పతాకంపై, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటినీలోనూ విడుదల చేస్తామని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి