close

తాజా వార్తలు

Published : 24/09/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. వ్యవసాయేతర ఆస్తులు ఉచితంగా నమోదు

పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలోని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల్లో బావుల వద్ద నిర్మించుకున్న ఇళ్లు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను కోరారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్‌ కార్డు సహా కుటుంబ సభ్యుల వివరాలతో పంచాయతీ, పురపాలక సిబ్బంది ఇంటి నంబరు కేటాయిస్తారని, వాటి ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు జరుగుతుందని చెప్పారు. ఈ ఆస్తుల మ్యుటేషన్‌కు, ఎల్‌.ఆర్‌.ఎస్‌.కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘పోలవరం’తో ఎవరికీ ఇబ్బంది రానీయొద్దు

పోలవరం ప్రాజెక్టుతో ఎవరికీ ఇబ్బంది రానీయొద్దని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో భూసేకరణ, పునరావాసం, పరిహారాలకూ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు పరిహారం సక్రమంగా అందేలా చూడాలని పేర్కొన్నారు. బుధవారం షెకావత్‌తో జగన్‌ సుమారు 20 నిమిషాలు భేటీ అయ్యారు. పెండింగ్‌ నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబరు కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీలు చూసుకుని ప్రాజెక్టును సందర్శించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరగా ప్రయత్నిస్తానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీఎస్‌ఆర్టీసీకి రూ.1800 కోట్ల నష్టం: మంత్రి పువ్వాడ

కరోనా వైరస్‌తో తెలంగాణ ఆర్టీసీ మంగళవారం వరకు రూ.1,800 కోట్లు నష్టపోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. కొన్ని బస్సులు నడుపుతున్నా ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉందన్నారు. కరోనా ముందు వరకు టికెట్ల ద్వారా రోజుకు రూ.13 కోట్లు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.2-3 కోట్ల మధ్య వస్తోందని వివరించారు. జీతాలకు ప్రతి నెల బడ్జెటు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.వంద కోట్లు ఇస్తున్నారని తెలిపారు. ‘కర్ణాటక, మహారాష్ట్రలకు అంతర్‌ రాష్ట్ర బస్సులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో ఒప్పందంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) కి ముక్కు ద్వారా ఇచ్చే సింగిల్‌ డోస్‌ టీకా తయారీ కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలను మినహాయించి మిగిలిన దేశాల్లో ఈ టీకా విక్రయించే హక్కులు భారత్‌ బయోటెక్‌ కు ఉంటాయి. ‘ఛింప్‌-అడెనోవైరస్‌’ ఆధారిత ఈ టీకాపై సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలోని వాక్సిన్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఎవల్యూషన్‌ యూనిట్లో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత పరీక్షలను భారత్‌ బయోటెక్‌ మనదేశంలో నిర్వహిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒకే దేశం-ఒకే మార్కెట్‌ అక్కర్లేదు

విశాలమైన భారతదేశం అంతటా పంటల క్రయవిక్రయాలకు ఒకే చట్టం అక్కర్లేదని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ స్పష్టం చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో భిన్నమైన పంటలు సాగవుతాయని, వినియోగంలోనూ తేడాలున్నాయని.. పరిస్థితులూ వేరని చెప్పారు. ఆయన గతంలో కేంద్రంలో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ ఛైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ముంబయిలోని ‘ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌’ సంచాలకుడిగా, ఉపకులపతిగా పని చేస్తున్నారు. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఆయన ‘ఈనాడు’ ‘ఈటీవీ భారత్‌’లకు ప్రత్యేక ముఖాముఖి ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ 60 జిల్లాలపై దృష్టి పెట్టండి

దేశంలో 700కి పైగా జిల్లాలున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పరంగా ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాలు మాత్రమే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అందువల్ల ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారం రోజుల పాటు రోజుకో గంట చొప్పున ఈ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి వైరస్‌ నియంత్రణకు అవసరమైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నేరుగా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, అధికారుల్లో చిత్తశుద్ధి పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆరోగ్య బీమా ప్రీమియం భారం

కరోనా వైరస్‌ వ్యాప్తితో సాధారణ చికిత్సా విధానంలో ఏన్నో మార్పులొచ్చాయి. వైద్య విధానంలోనూ అధునాతన పద్ధతులొచ్చాయి. ఫలితంగా ఎప్పుడో రూపొందించిన ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. వీటిని పాలసీదారులకు మరింత ప్రయోజనకరంగా మార్చడం, పారదర్శకత పెంచేందుకు వీలుగా ఐఆర్‌డీఏఐ గత ఏడాది సెప్టెంబరు 27న పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త నిబంధనలతో పాలసీలను అక్టోబరు 1, 2020 నుంచి అమల్లోకి తేవాలని తెలిపింది. కొన్ని ప్రామాణిక నిబంధనలకూ కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబరు 1 నుంచి బీమా ప్రీమియం భారమయ్యే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘వివేకా’ కేసులో సీబీఐ ముందడుగు!

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. పులివెందులకు చెందిన ఒక చెప్పుల దుకాణం యజమానికి సంబంధించిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు లాకరులోని రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారు నగలను మంగళవారం రాత్రి జప్తు చేశారు. మొదట చెప్పుల దుకాణం యజమానిని ఆదివారం (20న) కడపలో విచారించారు. అప్పుడు ఆయనపై అనుమానం రావడంతో కొందరు అధికారులు మంగళవారం పులివెందులకు చేరుకుని ఆయన బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలో లాకరులో భారీ మొత్తంలో నగదును గుర్తించారు. అనంతరం సంబంధిత వ్యక్తితోపాటు ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ముంబయి మొదలెట్టింది

ముంబయి ఇండియన్స్‌ పుంజుకుంది. ఐపీఎల్‌-13ను ఓటమితో ఆరంభించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. తర్వాతి మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. బుధవారం బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ సత్తా చాటిన ఆ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి పాయింట్ల ఖాతా తెరిచింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. అతడి కష్టాన్ని వృథా కానివ్వకుండా బౌలర్లు సమష్టి ప్రదర్శనతో జట్టును గెలిపించారు. యూఏఈలో ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ముంబయికి అక్కడిదే తొలి విజయం కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వసూళ్లు కురిపిస్తారా? ఉసూరుమనిపిస్తారా?

సినిమా చూస్తే థియేటర్‌లోనే చూడాలి. థియేటర్‌లో చూడటంలో ఉన్న ఆనందం...వేరే ఏ మాధ్యమంలోనూ ఉండదు. - సినీ తారలు...దర్శకులు.. నిర్మాతలు అంటున్న మాటలివీ... ఏళ్ల తరబడి థియేటర్‌లోనే సినిమాను చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు నెమ్మదిగా ఓటీటీ బాట పడుతున్నారు. కానీ ఏదో వెలితి. త్వరలోనే సినిమాను థియేటర్‌లో చూస్తామనే ఆశ. తొందర్లోనే తెరపై బొమ్మ పడి తీరుతుందని చిత్రసీమ కూడా ఆశగా చూస్తోంది. ‘వచ్చే నెల థియేటర్లు తెరుస్తారు’ అనే ప్రచారం సాగుతుంది. వీలైనంత తొందరగా తెరవాలని చిత్రసీమ నుంచి కేంద్రానికి సినీ ప్రముఖులు విన్నవించుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి థియేటర్లు తెరుచుకుంటే ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం చాలా రోజులుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.