close

తాజా వార్తలు

Published : 06/08/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. శ్రీరామం.. శ్రీకారం

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మహోజ్వల ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య రాముడికి మహోన్నతమైన కోవెల నిర్మించేందుకు ఆ పుణ్యమూర్తి జన్మభూమిలో పునాది రాయి పడింది. దేశమంతటా ‘జై శ్రీరామ్‌’ అని జయజయధ్వానాలు పలుకుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉజ్వల ఘట్టాన్ని దేశ విదేశాల్లోని కోట్ల మంది పండుగలా జరుపుకొన్నారు. ఊరూవాడా శ్రీరామ నామ జపంతో తరించింది. ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది టీవీలకు అతుక్కుపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పరిశ్రమల్లో అత్యధిక కొలువులు స్థానికులకే

తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు పరిశ్రమలను రెండు విభాగాలుగా చేసింది. మొదటి విభాగంలోని పరిశ్రమల్లో నైపుణ్యం గల మానవ వనరులలో 50 శాతం మంది స్థానికులు విధిగా ఉండాలి. పాక్షిక నైపుణ్యం కేటగిరీలో 70 శాతం మంది స్థానికులను తీసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాట తప్పారు.. రాజీనామా చేస్తారా?

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అలా చేస్తే తమ శాసనసభ్యత్వాలనూ వదులుకుంటామని ప్రకటించారు. ‘ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని పదే పదే మాట్లాడి.. ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో అమరావతిని ఆవెెూదించారా.. లేదా?’ అని ప్రశ్నించారు. ‘చెప్పింది చేయకపోతే నిలదీయండి, రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పిన మీరు (సీఎం).. మాట తప్పారు. ఇప్పుడు మరి రాజీనామా చేస్తారా? అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా?’ అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమ్మోనియం నైట్రేట్‌ కేంద్రంగా విశాఖ

భారత్‌లో అమ్మోనియం నైట్రేట్‌ ఏకైక దిగుమతి కేంద్రం విశాఖ నగరమే. గతంలో విదేశాల నుంచి దేశంలోని పలు నౌకాశ్రయాల ద్వారా ఈ పదార్థం దిగుమతి అయ్యేది. ఆయా ఓడరేవులకు సమీపంలో ఉండే సంస్థలు వినియోగించుకునేవి. ఈ పదార్థాన్ని కొన్ని నౌకాశ్రయాల నుంచి సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చే పరిస్థితులు లేవని కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక్క విశాఖపట్నం నుంచే దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. దేశంలో ఎవరికి ఈ పదార్థం కావాల్సి వచ్చినా విశాఖ నుంచి తీసుకెళ్లాల్సిందే. ఇక్కడి నౌకాశ్రయానికి ఏటా 2-2.50 లక్షల టన్నుల వరకూ దిగుమతి అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాముడే మా ‘ఇమామ్‌-ఇ-హింద్‌’

రాముడే మా ‘ఇమామ్‌-ఇ-హింద్‌’ అంటూ పలువురు ముస్లిం భక్తులు కొనియాడారు. బుధవారం అయోధ్యలో జరిగిన శంకుస్థాపన క్యార్యక్రమాన్ని వీక్షించిన ముస్లిం భక్తులు పై విధంగా స్పందించారు. కరోనా ప్రభావం తగ్గాక తాము అయోధ్య వెళ్లి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటామంటూ కొందరు చెప్పారు. ‘ఈరోజు మా అందరికీ పండగ రోజు. మేమూ కరసేవకులమే. రాముడినే ఈ దేశ మతాధికారిగా(ఇమామ్‌-ఇ-హింద్‌), ప్రవక్తగా భావిస్తాం’ అని సున్నీ సోషల్‌ ఫోరం అధ్యక్షుడు రాజా రయీస్‌ తెలిపారు. ఆలయ శంకుస్థాపన సందర్భంగా తామంతా డ్రమ్ములు వాయించి సంబరం చేసుకున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యాపిల్‌ తర్వాత రిలయన్సే

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రాండుగా (ఆర్‌ఐఎల్‌) అవతరించింది. ప్రస్తుత సంవత్సరానికి గాను ఫ్యూచర్‌ బ్రాండు రూపొందించిన సూచీలో యాపిల్‌ అగ్రస్థానాన్ని పొందగా.. ఆర్‌ఐఎల్‌ రెండో ర్యాంకు పొందింది. ఈ సూచీలో తొలిసారిగా చోటు దక్కించుకోవడమే కాకుండా.. రెండో స్థానంలో నిలిచిన ఆర్‌ఐఎల్‌ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిందని ఫ్యూచర్‌ బ్రాండు తెలిపింది. ఫ్యూచర్‌ బ్రాండ్‌ 2020 సూచీలో యాపిల్‌, ఆర్‌ఐఎల్‌ తర్వాత మూడో స్థానంలో శామ్‌సంగ్‌ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎన్‌విడియా, మౌటాయ్‌, నైక్‌, మైక్రోసాఫ్ట్‌, ఏఎస్‌ఎమ్‌ఎల్‌, పేపాల్‌, నెట్‌ఫ్లిక్స్‌లు చోటు సంపాదించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కెప్టెన్‌గా నాదే జట్టులో చివరి స్థానం

ఐపీఎల్‌ కోసం ఇంకొన్ని రోజుల్లోనే సన్నద్ధత మొదలుపెట్టనున్నట్లు టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. ‘‘ఇంకో వారంలో నేను వ్యాయామం చేసే జిమ్‌ ఆరంభమవుతుంది. ఒంటిని దృఢంగా మార్చే కసరత్తులు చేస్తా. ఐపీఎల్‌ ముంగిట సాధన విషయంలో ఏం హడావుడి పడాల్సిన పని లేదు. కావాల్సినంత సమయం ఉంది. ఆట కోసం నెమ్మదిగా సన్నద్ధమవ్వొచ్చు. నా కెరీర్లో బ్యాట్‌ పట్టకుండా నేను తీసుకున్న అతి పెద్ద విరామం ఇది. నా శరీరం మెరుగైన స్థితిలోనే ఉందనుకుంటున్నా. గతంలో కంటే బలవంతుడినైనట్లు అనిపిస్తోంది. మనసు కూడా విశ్రాంతి పొందింది’’ అని రోహిత్‌ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అయినా యూరప్‌ వెళతారు

ప్రభాస్‌ కోసం యూరప్‌ హైదరాబాద్‌కి వచ్చింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ కోసం యూరప్‌ తరహా కొన్ని నిర్మాణాల్ని హైదరాబాద్‌లో సెట్స్‌గా తీర్చిదిద్దారు. వాటిలో చిత్రీకరణ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రభాస్‌, ఆయన బృందం రంగంలోకి దిగబోతోంది. అయితే ఇక్కడ చిత్రీకరణ చేసినా, మరోసారి యూరప్‌ కూడా వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అక్కడికి వెళ్లి చిత్రీకరణ చేసుకొచ్చిన చిత్రబృందం, మరోమారు వెళ్లేందుకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం. రాజీ పడకుండా సినిమాని తీర్చిదిద్దేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తిండి పెట్టని తనయుల అరెస్టు

రక్తం పంచుకు పుట్టిన కుమారులు అన్నం పెట్టకుండా కన్నతండ్రిని బజారుపాలు చేశారు. రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా అన్నం పెట్టకుండా కన్నీరు పెట్టించిన ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన కోహెడ ఎస్‌ఐ ముగ్గురు కుమారులను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం పరిధి శంకర్‌నగర్‌కు చెందిన పోతు మల్లయ్య(79)కు రవీందర్‌, జనార్దన్‌, రవీందర్‌ సంతానం. తండ్రి మల్లయ్య వారికి రూ.కోటి చొప్పున ఆస్తి పంచి ఇచ్చాడు. అయినా ఆయన్ను పోషించడానికి వారిలో ఒకరూ ముందుకు రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా‌రెడ్డి కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్‌ఫెక్షన్‌ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌నకు చెందిన రామలింగారెడ్డి 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.