close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/06/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. సైన్యాన్ని దించుతా

హింసాత్మక నిరసనలను తగిన రీతిలో అణచివేయని పక్షంలో సైన్యాన్ని రంగంలో దించుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. రాష్ట్రాల గవర్నర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గట్టి స్వరంతో అల్టిమేటం జారీ చేశారు. అల్లర్లకు దిగడం, దుకాణాలను కొల్లగొట్టడం, భౌతిక దాడులు, ఇతరత్రా విధ్వంసకర చర్యల్ని అడ్డుకునేందుకు లక్షల్లో సైనిక బలగాలను భారీ ఆయుధాలతో పంపిస్తానని ప్రకటించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఆయన హడావుడిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌పై నమ్మకం పెరిగింది

ప్రపంచం ఇప్పుడు నమ్మకమైన భాగస్వామి కోసం ఎదురుచూస్తోందని, అలాంటి పాత్రలో సహజంగా ఒదిగిపోయే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన దేశం పట్ల నమ్మకం బలపడిందన్నారు. తద్వారా కలిగే ప్రయోజనాన్ని భారతీయ పారిశ్రామిక రంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం సీఐఐ 125వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రతి కష్టం నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించడమే మనిషి సత్తాకు ప్రామాణికం. ప్రస్తుతం మనం వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆర్థిక పరిస్థితులపైనా దృష్టిసారించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సవరణం

‘విద్యుత్‌ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణల బిల్లులో ప్రజా ప్రయోజనాలు కానీ, విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రయోజనాలు కానీ లేవు. ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈ బిల్లుపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను పంపాలని గతంలో కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈమేరకు సీఎం ప్రధానికి లేఖ రాశారు. బిల్లులో ప్రతిపాదించిన సవరణలు రాష్ట్ర విద్యుత్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. బిల్లులోని కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూపాయి అప్పు లేకుండా ఇంటిని సమకూర్చాలి

పేదలకు ఒక్క రూపాయి అప్పు కాకుండా ఇళ్లను సమకూర్చాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇంటి నిర్మాణంలో లివింగ్‌ రూం, వంటగది, పడకగది, మరుగుదొడ్డి, వరండా సహా అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టినా... పేదలకు అండగా నిలవాలని, 3,38,144 ఇళ్లకు రూ.1,323 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. చెల్లింపుల్లో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శీతాకాలం.. కరోనా కాలమే?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇక సీజనల్‌ వ్యాధిగా మారొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాతావరణంలో తేమ ఒక్క శాతం మేర తగ్గినా కొవిడ్‌-19 కేసులు 6% మేర పెరుగుతాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని ప్రకారం చూస్తే తేమ తక్కువగా ఉండే శీతాకాలంలో ఈ వ్యాధి విజృంభించొచ్చని వారు పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌-19 ఇక సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉంది. వాతావరణంలో తేమ తగ్గినప్పుడల్లా అది విజృంభించవచ్చు. అంటే.. శీతాకాలాన్ని ఇక కొవిడ్‌ కాలంగా అనుకోవచ్చు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న మైఖేల్‌ వార్డ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌ ‘అథమ’ రేటింగ్‌కు పడిపోదు

‘భారత సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్‌ తగ్గించడం’ అంచనా వేసిన పరిణామమే అని, అయితే ఇంతకన్నా భారత్‌ స్థితి దిగజరాదని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బీఓఎఫ్‌ఓ) పేర్కొంది. భారత్‌ వద్ద ఉన్న భారీ విదేశీ నిల్వలు, పంట దిగుబడి అంచనాలను లెక్కలోకి తీసుకుంటే.. మరింత రేటింగ్‌ తగ్గింపు ఉండకపోవచ్చని అది అంచనా వేసింది. మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ భారత రేటింగ్‌ను ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కి తగ్గిస్తూ, సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. ఇదే అత్యంత తక్కువ పెట్టుబడి గ్రేడ్‌ కావడం గమనార్హం. ఆ తర్వాత ‘అథమ’(జంక్‌) రేటింగ్‌ ఇస్తుంటారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడం కోసం దేశంలో ద్రవ్య ఉద్దీపన చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందని బీఓఎఫ్‌ఏ ఆర్థికవేత్తలు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్నాళ్లీ వివక్ష?

అమెరికాలో ఓ పోలీస్‌ కిరాతక చర్యతో ప్రాణాలు వదిలిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతంపై క్రీడా ప్రపంచం గళం విప్పుతోంది. ఇప్పటికే అమెరికా టెన్నిస్‌ తార కొకో గాఫ్‌, వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఈ ఉదంతం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వర్ణ వివక్ష ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులు స్వరం కలిపారు. అమెరికన్‌ గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌.. ఫ్లాయిడ్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఈ విషాదాంతంలో పోలీసులు గీత దాటారన్నది స్పష్టంగా తెలుస్తోందని అతనన్నాడు. వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డారెన్‌ సామి స్పందిస్తూ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా క్రికెట్‌ ప్రపంచం గళం విప్పాల్సిన సమయం ఇదని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముగిసేది లాక్‌డౌనే..కరోనా కాదు

లాక్‌డౌన్‌ ముగింపు దశకు వస్తోంది కానీ కరోనా మహమ్మారి ఇంకా అలానే ఉంది. ఈ సమయంలోనే ప్రజలంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌. ఆయన మంగళవారం ట్విటర్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘70 రోజులుగా కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి నా ధన్యవాదాలు. కరోనా పోరులో విశేష సేవలందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పడం తక్కువే అవుతుంది. ఇప్పుడిప్పుడే ద్వారాలు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో పాటిస్తున్న నియమ నిబంధనలు, రక్షణ సూత్రాల్ని ఇకపైనా తప్పనిసరిగా కొనసాగించాలి. సురక్షితంగా ఉంటూ భౌతిక దూరాన్ని పాటించండి’’అంటూ ట్వీట్‌ చేశారు వెంకటేష్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ముఖానికి ‘ప్రాణం పోశారు’

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖం పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తికి వరంగల్‌ జిల్లాలో అరుదైన శస్త్రచికిత్స చేసి పూర్వరూపు తీసుకొచ్చారు. వరంగల్‌ గార్డెన్‌ ఆసుపత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స వివరాలను ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ కాళీప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పరకాల మండలం నార్లాపూర్‌ గ్రామానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తి వారం క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నార్లాపూర్‌ బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయారు. దీంతో ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బతింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పుత్ర వ్యామోహం.. పుత్రికకు శాపం

మగ సంతానంపై వ్యామోహంతో..కన్న కుమార్తెను బలి ఇచ్చిన దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట్టై జిల్లాలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దివ్య (13)ను కన్న తండ్రే   నరబలి ఇచ్చాడన్న విషయం దర్యాప్తులో వెలుగుచూసింది. కందర్‌వకోట్టై సమీపంలోని చెరువులో నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన బాలిక ఓ ముళ్లపొదలో గొంతుపై గాయంతో అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులకు సమాచారం అందింది. వారు బాలికను తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చాలా ఏళ్లుగా మగ సంతానం కోసం ఎదురుచూస్తున్న బాలిక తండ్రి...ఓ జ్యోతిష్కుడి  సలహాతో ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.