close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఆరోహణం

ప్రతి మనసూ పట్టుబట్టి కోరితే.. ప్రతి మనిషీ జట్టుకట్టి పోరితే సిద్ధించిన తెలంగాణ గడ్డ.. పసిడి వన్నెలద్దుకుంటోంది. ఎందరో త్యాగాలకు ప్రతీకగా సాకారమైన కలల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తున్నారు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. ఎండిన బీళ్లు, సాళ్లే కాదు.. తడారిన నోళ్లూ... నీళ్లతో తడుస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా నిరంతరాయ కాంతులు విరజిమ్ముతున్నాయి. అప్పుల్లో చిక్కిశల్యమవుతున్న అన్నదాత రుణాలతో పాటు, కష్టాలూ మాఫీ అవుతున్నాయి. పంట సిరుల్ని ఉప్పొంగిస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవం స్ఫూర్తిగా మరిన్ని విజయ ప్రస్థానాలకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా చేసుకున్న తెలంగాణ అతి తక్కువ సమయంలోనే తన విశిష్టతను చాటుకుని పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పంటల ప్రణాళికకు కొత్త లెక్క

రైతు భరోసా కేంద్రం యూనిట్‌గా.. అక్కడి రైతులు ఏ పంటలు సాగు చేయాలనే విషయమై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సాగు చేసిన పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయడంపైనా వెంటనే విధివిధానాలు తయారుచేయాలని స్పష్టం చేశారు. వివాదాలకు తావులేకుండా వీటిని రూపొందించి.. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకేల్లో) ఉంచాలని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘పంటల ప్రణాళిక, ఈ-క్రాప్‌ నమోదు’పై సీఎం సమీక్షించారు. జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారు. అందుకే ఏవి సాగు చేయాలో వారికి సూచించాలి. పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలి’ అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బంకర్లోకి ట్రంప్‌

మెరికా అట్టుడికిపోతోంది. శ్వేతజాతి అమెరికా పోలీసుల కర్కశత్వం కారణంగా ఆఫ్రో-అమెరికన్‌ వ్యక్తి జార్జి ఫ్లాయిడ్‌ మరణించిన తీరుపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకే ఈ సెగ తగిలింది. ఆయన తన కుటుంబంతో సహా శ్వేతసౌధంలోని బంకర్‌లో కొంతసేపు ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష భవనానికి సమీపంలో విధ్వంసానికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టడానికి పోలీసులు తొలుత బాష్పవాయువు ప్రయోగించారు. అప్పటికే ఆందోళనకారులు అక్కడకు సమీపంలోని భవనాల అద్దాలు పగులగొట్టి, వాటికి నిప్పంటించి గందరగోళం సృష్టించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ట్రంప్‌ను, ఆయన సతీమణి మెలనియా, కుమారుడు బ్యారన్‌ను భద్రత బలగాలు హుటాహుటిన బంకర్‌లోకి తరలించినట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రెండు  ప్రపంచ యుద్ధాలంతటి సంక్షోభం

‘రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత తొలిసారి అతిపెద్ద సంక్షోభాన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఆశ, కృతజ్ఞతాభావంతో చూస్తోంది. వైద్యం అందించడంతోపాటు, రోగాన్ని పూర్తిగా నయం చేయాలని వారిని కోరుతోంది. కొవిడ్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న బలమైన పోరాటానికి మూలం వైద్యుల కఠోర శ్రమే. డాక్టర్లు, ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది యూనిఫాంలేని సైనికుల్లా కంటికి కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నారు. ఈ పోరులో వీరు కచ్చితంగా విజయం సాధిస్తారు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఎల్‌జీ పాలిమర్స్‌పై ఎన్జీటీ విచారణ

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ప్లాంటు ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సోమవారం విచారించింది. ఘటనపై జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఆదేశాలు ఇస్తామని ఎన్జీటీ పేర్కొంది. దుర్ఘటనపై సుమోటోగా స్వీకరించిన కేసు, విశ్రాంత ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ ఎస్‌కే సింగ్‌, సభ్యనిపుణడు నాగిన్‌ నందాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విచారణ కమిటీ నివేదికను పరిశీలించి ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. స్టైరీన్‌ ఆవిరి లీకవడానికి ఎల్‌జీ పాలిమర్స్‌ ఎండీ, పలు విభాగాల ఉద్యోగులు కారణమని జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ తేల్చిచెప్పింది. ప్రమాదంపై అధ్యయనం చేసిన ఎన్జీటీ కమిటీ సభ్యులు నిబంధనల ఉల్లంఘనలను నిర్ధారించారు. వాటిని నిరూపించే పలు పత్రాలను పొందుపరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భారత్‌ @ 7

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తూ దేశాన్ని కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. కేసుల పెరుగుదలలో రోజురోజుకూ పాత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో తాజాగా 24 గంటల్లో ఏకంగా 8,392 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.90 లక్షలకు పెరిగింది. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టి భారత్‌ ఏడో స్థానానికి చేరుకుంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 230 మంది కొవిడ్‌ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. 4,835 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆ 6 రాష్ట్రాల వారితో జాగ్రత్త!

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని 7 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు (చెన్నై)ల నుంచి వచ్చినవారి నమూనాలను రైల్వే స్టేషన్లలోనే సేకరించాలని సూచించింది. అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో 7 రోజులు, హోం క్వారంటైన్‌లో మరో 7 రోజులు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో 60 ఏళ్లు దాటిన వారికి, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారికి మినహాయింపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. శ్రీశైలంలో కాజేసింది రూ.2.5 కోట్లు

శ్రీశైలంలో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి పొరుగు సేవల సిబ్బంది కాజేసిన మొత్తం రూ.2.5 కోట్లకుపైగా ఉన్నట్లు తెలిసింది. రూ.150 దర్శన టికెట్లు, అభిషేకం టికెట్లలో అక్రమాలు చేయడం ద్వారా రూ.1.42 కోట్లు కాజేసినట్లు తొలుత గుర్తించిన ఆలయ ఈవో కేఎస్‌ రామారావు.. ఈ వివరాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దర్శన టికెట్లు, దాతల విరాళాలను సాఫ్ట్‌వేర్‌లో లొసుగుల ఆధారంగా కాజేసినట్లు గుర్తించారని తెలిసింది. పెట్రోలు బంకులోనూ రూ.42 లక్షలు వెనకేసినట్లు గుర్తించారని సమాచారం. ఆలయానికి సాఫ్ట్‌వేర్‌ అందించే సంస్థలో పనిచేసే పొరుగు సిబ్బంది ఇదంతా నడిపినట్లు గుర్తించారు. 2016-19 మధ్య ఇది జరిగిందని, ఇద్దరు ఆలయ సిబ్బంది, 20 మంది పొరుగుసేవల సిబ్బంది ఓ బృందంగా ఏర్పడి ఇదంతా చేశారని తేల్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వెళ్తే స్టేడియానికి.. లేకుంటే కొండల్లోకి

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఏం చేసినా అభిమానులకు ఆసక్తే! లాక్‌డౌన్‌ సమయంలో బాగా గడ్డం పెంచుకుని గుర్తు పట్టలేనంతగా తయారై.. కూతురితో ఆడుకుంటూ ఒక ఫొటో పెట్టిన మహి.. మరి లాక్‌డౌన్‌ తర్వాత ఏం చేయబోతున్నాడు? ఈ విషయాన్నే ఓ ఆన్‌లైన్‌ చాట్‌ కార్యక్రమంలో వెల్లడించింది అతని సతీమణి సాక్షి. ‘‘లాక్‌డౌన్‌ తర్వాత క్రికెట్‌ ఉంటే ధోని ఎప్పటిలాగే ప్రాక్టీస్‌ కొనసాగిస్తాడు. లేకపోతే  ఉత్తరాఖండ్‌కు వెళ్లి అక్కడ చిన్న పల్లెటూళ్లలో ఉంటూ మంచు కొండల్లో విహరించాలనేది మా ప్రణాళిక. ధోనికి మంచు అంటే ఇష్టం. ప్రయాణం విమానాల్లో కాకుండా రోడ్డు మార్గంలో చేయాలనుకుంటున్నాం. రాంచీలోనూ మేం ఇలాగే జీవిస్తాం’ అని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఓటీటీ వేదికలతో ముప్పేమీ లేదు

‘సినీ ప్రేమికుల ఓటు ఎప్పుడూ థియేటర్‌కే. పెద్ద తెరపై సినిమాని చూడటంలో ఉన్న అనుభవం వేరు కాబట్టి ప్రేక్షకులు థియేటర్‌కి రావడంపైనే ఆసక్తి చూపుతార’’న్నారు నిర్మాత, పంపిణీదారుడు   అభిషేక్‌ నామా. పంపిణీ రంగంలో ‘హారీపోటర్‌’ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఈ ఏడాది విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో వంద సినిమాల మైలురాయిని అందుకున్నారు. త్వరలోనే నిర్మాతగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా అభిషేక్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘కరోనా వల్ల సినిమా పరిశ్రమకి కొన్నాళ్లు విరామం వచ్చిందంతే. అందరూ అనుకుంటున్నట్టుగా మార్పులంటూ ఏమీ రావు. ఓటీటీ వేదికలతో థియేటర్లకి వచ్చిన ముప్పేమీ లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.