close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. మరణ మృదంగం

కరోనా దెబ్బకు యావత్‌ ప్రపంచానికి కంటి మీద కునుకు కరవవుతోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ మరింత వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలతోపాటు అమెరికాలో కొవిడ్‌ మృత్యు మృదంగాన్ని మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో 24 గంటల్లో 1,150 మరణాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లకు వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ తెలుగు వ్యక్తి ఒకరు ఈ మహమ్మారి కాటుకు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లాక్‌డౌన్‌ మరింత కాలం

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడిగింపునకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశం ఇదే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అన్ని విద్యాసంస్థల మూసివేతను మే 15 వరకు పొడిగించాలని ఈ బృందం సిఫార్సు చేసింది. కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని 90% రాష్ట్రాలు, కొందరు నిపుణులు పేర్కొన్న నేపథ్యంలో కేంద్రం కూడా అలాగే భావిస్తున్నట్లు తెలిసింది.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 12 లేదా 13వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యువతా మేలుకో..!

‘అమెరికాలోని న్యూయార్క్‌లో 35, 36 ఏళ్లున్న యువకులు సైతం కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నా మిత్రుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్న యువ కార్డియాలజిస్టు మరణశయ్యపై ఉన్నాడు. ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన భార్యకూ పాజిటివ్‌ వచ్చింది. ఈ మహమ్మారి మన భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చకముందే ప్రతి ఒక్కరూ అప్రమత్తమై రక్షణాత్మక చర్యలు పాటించాలి. మీ కోసం సమయాన్ని కొనుక్కోండి/దాచి ఉంచుకోండని అమెరికాలో ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే. అతి త్వరలో కొవిడ్‌కు మందులు రాబోతున్నాయి. అప్పటివరకు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి’ అని పులిట్జర్‌ అవార్డు గ్రహీత, పద్మశ్రీ డాక్టర్‌ సిద్ధార్థ ముఖర్జీ ప్రజలకు స్పష్టంచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ పాంచజన్యం

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు దక్షిణ కొరియా తరహా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మిగతా దేశాలకంటే రెండు మూడు అడుగులు ముందున్న దేశాలే వైరస్‌ను విజయవంతంగా నియంత్రించగలిగాయని చెప్పారు. అందుకే తాము నిపుణులు, వైద్యులను సంప్రదించి పరీక్షలు(టెస్టింగ్‌), గుర్తించడం(ట్రేసింగ్‌) , వైద్యం(ట్రీట్‌మెంట్‌), కలిసి పనిచేయడం(టీంవర్క్‌), పర్యవేక్షణ(ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌) వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. పకడ్బందీగా దీన్ని ఆచరణలో పెడతామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విదేశీ ప్రయాణాలు, విస్టా ఆపండి

ఎంపీల జీతాలను 30% తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతించారు. మరిన్ని పొదుపు చర్యలు చేపట్టడం ద్వారా పోగైన నిధులను కొవిడ్‌-19పై పోరాటం కోసం ఉపయోగించాలని సూచించారు. తమ పార్టీ తరఫున ఐదు సూచనలు చేస్తున్నట్లు పేర్కొంటూ ప్రధానమంత్రికి మంగళవారం లేఖ రాశారు. దిల్లీలో పార్లమెంటు సమీపంలో రూ.20వేల కోట్లతో తలపెట్టిన సెంట్రల్‌ విస్టా అభివృద్ధిని తక్షణం నిలిపివేయాలి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలు ఆపేయాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాజకీయ పాలక మండళ్లు!

విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల సభ్యుల నియామకాల్లో రాజకీయ, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో, మార్చి 23న హడావుడిగా రాష్ట్రంలోని 14 వర్సిటీలకు 118 మందిని పాలకమండలి సభ్యులుగా నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యామండలి పంపిన జాబితాలో సభ్యుల పేర్లకు ఎదురుగా ఏ రాజకీయ నాయకులు సిఫార్సు చేశారో సూచించారు. కొన్ని పేర్ల ముందు ‘తప్పనిసరి’ అని కూడా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా నియమించాల్సిన వర్సిటీల పాలకమండళ్ల సభ్యుల నియామకం పూర్తిగా రాజకీయమయంగా మారిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మూలికలనూ ఇవ్వండి: పతంజలి

కరోనా నివారణ, చికిత్స కోసం అల్లోపతి ఔషధమైన హైడ్రాక్సి క్లోరోక్విన్‌తోపాటు సంప్రదాయ వైద్య మూలికలను ఇవ్వాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ.. కేంద్ర ‘ఆయుష్‌’ మంత్రిత్వశాఖకు ఒక ప్రతిపాదనను సమర్పించింది. హరిద్వార్‌ కేంద్రంగా పనిచేసే పతంజలి పరిశోధన సంస్థ నుంచి ఈ సూచన వెళ్లింది. అశ్వగంధ, తిప్పతీగ, తులసిలోని ఫైటోరసాయనాలకు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సత్తా ఉందని వివరించింది. మొక్కల్లో ఉత్పత్తయ్యే రసాయనాలను ఫైటో కెమికల్స్‌గా పేర్కొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పొదుపు ఖాతాలపై 2.75% వడ్డీనే

పొదుపు ఖాతాల్లోని నగదుపై ఇచ్చే వడ్డీ రేటును ప్రస్తుత 3 శాతం నుంచి 0.25 శాతం తగ్గించి 2.75 శాతం చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. కొత్త రేట్లు ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో తగినంత నగదు లభ్యత ఉన్నందున, పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును మార్చినట్లు వెల్లడించింది. అన్ని కాలావధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను సైతం బ్యాంక్‌ 0.35 శాతం మేర తగ్గించింది. ఏడాది కాలవ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లను 0.35 శాతం తగ్గించి 7.40 శాతంగా చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేనెందుకలా నిలబడతానంటే..

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఎన్నో చిత్రమైన బ్యాటింగ్‌ స్టాన్స్‌లను చూశాం. వాటిలో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ స్టాన్స్‌ ప్రత్యేకం. బ్యాట్‌ పైకి లేపి పెట్టి, కాళ్లను ఎడంగా చాచి చిత్రంగా నిలబడే అతను.. బంతి పడ్డాక వికెట్‌కు అడ్డంగా తిరిగి, సర్దుబాటు చేసుకుని షాట్లు ఆడే తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. అయితే ఔటయ్యే అవకాశాల్ని తగ్గించడం కోసమే తాను అలా నిలబడతానని, ఆ స్టాన్స్‌ తనకెంతో సౌకర్యంగా ఉంటుందని స్మిత్‌ అంటున్నాడు. ‘‘ఎవరు బౌలింగ్‌ చేస్తున్నారు.. పిచ్‌ ఎలా ఉంది.. ఎలా పరుగులు చేయాలి.. నన్ను ఔట్‌ చేయడానికి బౌలర్లు ఎలా ప్రయత్నిస్తున్నారు.. అనే విషయాల్ని బట్టి నా స్టాన్స్‌ ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎనిమిది గ్రామాలు దత్తత

వైరస్‌ ప్రభావంతో గ్రామాల్లోనూ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చాలామంది ఉపాధిని కోల్పోయారు. అలాంటివాళ్ల కడుపు నింపడమే లక్ష్యంగా 8 గ్రామాల్ని దత్తత తీసుకున్నారు నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు. చిత్తూరు జిల్లా చంద్రగిరిమండలంలోని 8 గ్రామాల్లో పేదలకి మధ్యాహ్నం, రాత్రి ఆహారం అందిస్తున్నారు. ఆ 8 గ్రామాలతో పాటు మరికొన్ని సమీప గ్రామాలకి కూరగాయల్ని పంపిణీ చేస్తున్నారు. అజిత్‌ సాయం రూ.1.25 కోట్లు: కరోనా సహాయ చర్యల కోసం నటుడు అజిత్‌ రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.