టాప్‌ 10 న్యూస్ @ 9 AM
close

తాజా వార్తలు

Published : 02/04/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఆంధ్రప్రదేశ్‌లో 111 కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులే ఉన్నా.. తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ కాగా.. కడప, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 15 మంది చొప్పున, పశ్చిమగోదావరిలో 14 కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పనిచేసిన రోజులకే వేతనం

కరోనా దెబ్బతో రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు కుదేలవుతున్నాయి. కార్మికుల్లో దాదాపు 70 శాతం మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. కరోనాతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. చిన్న దుకాణాలు తెరుచుకోలేదు. తాత్కాలిక ఉద్దెరపై సరఫరా చేసిన వస్తువులకు నగదు అందలేదు. దీంతో ఆయా యజమానులు.. ప్రస్తుతానికి పని చేసిన రోజులకు వేతనం ఇస్తామని, మిగతాది వ్యాపారం మెరుగైన తరువాత చూద్దామని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ద.కొరియా మార్గం అనుసరణీయం

‘దేశంలోని 24 అత్యవసర కరోనా హాట్‌స్పాట్లలో కృష్ణా జిల్లా ఒకటి. కడపలోనూ శరవేగంగా కరోనా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి ప్రాధాన్య క్రమంలో వారిని వేరు చేసి ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి. వెతకడం, గుర్తించడం, పరీక్షించడంలో లోపాలవల్లే ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగి నియంత్రణ కష్టంగా మారింది. 4టీ విధానంతో దక్షిణ కొరియా ఈ మహమ్మారిని నిరోధించగలిగింది. ఈ విధానం మనకూ అనుసరణీయం. వ్యక్తిగత పరీక్షలతో కోవిడ్‌ వైరస్‌ను గుర్తించి పాజిటివ్‌ కేసులను వేరు పరచడం తక్షణావశ్యం’ అని ప్రతిపక్ష నేత, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అగ్రరాజ్యానికి అతి పెద్ద విపత్తు

‘కరోనా తీవ్రతను అమెరికా ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయింది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడం కష్టంగా మారింది. ఇక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. అమెరికాకు అతి పెద్ద విపత్తు ఇదే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఇండియా (ఎఎపిఐ) అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌రెడ్డి. సుమారు లక్ష మంది వైద్యులు సభ్యులుగా గల ఈ సంఘం అమెరికాలో కరోనా నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అనేక ఆసుపత్రుల్లో భారతీయులు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని డాక్టర్‌ సురేశ్‌రెడ్డి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధితో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా హాట్‌స్పాట్లు 10

దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని లెక్క తేల్చింది. మరోపక్క- 24 గంటల వ్యవధిలోనే 386 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. హజ్రత్‌ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి హాజరైన తబ్లీగీ జమాత్‌ ప్రతినిధుల వల్లనే వైరస్‌ వ్యాప్తి అమాంతం పెరిగినట్లు తేలడంతో వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమయింది. ఇప్పటివరకు 6,000 మందిని గుర్తించి, సుమారు 5,000 మందిని క్వారంటైన్‌కు తరలించారు. తెలంగాణ, గుజరాత్‌, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లోని మరో 2,000 మంది కోసం గాలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహమ్మారిపై పోరుకు రూ.1,125 కోట్లు

కొవిడ్‌-19 విజృంభణ కారణంగా భారత్‌లో నెలకొన్న అసాధారణ ఆరోగ్య, మానవ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విప్రో లిమిటెడ్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ల తరఫున రూ.1,125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో ప్రకటించింది. ఈ  మొత్తంలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్లు సమకూర్చుతాయని విప్రో, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లు బుధవారం ఓ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. సంస్థ ఏటా కేటాయించే సీఎస్‌ఆర్‌ నిధులు, ఇతర దాతృత్వ కార్యక్రమాలకు ఇవి అదనం అని స్పష్టం చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాప పేరు ‘కరోనా’.. బాబు పేరు ‘లాక్‌డౌన్‌’

కరోనా వైరస్‌ మహమ్మారి పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు కుటుంబాలు తమ పిల్లలకు ‘కరోనా’ ‘లాక్‌డౌన్‌’ అని పేర్లు పెట్టుకున్నాయి. జనతా కర్ఫ్యూ రోజు సోహ్‌గౌర గ్రామానికి చెందిన బబ్లు త్రిపాఠి, రాగిని దంపతులకు ఆడ బిడ్డ పుట్టగా ‘కరోనా’ అని పేరు పెట్టుకున్నారు. గత నెల 29న తన భార్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాబుకు జన్మనిచ్చిందని.. ఆ బాబుకు ‘లాక్‌డౌన్‌’ అని పేరు పెట్టామని ఖుఖుండు గ్రామానికి చెందిన పవన్‌ ప్రసాద్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వాహన విలాపం

మార్చిలో దేశీయ వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టయోటా.. ఇలా అన్ని కంపెనీల అమ్మకాలు కుదేలయ్యాయి. కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడి అమ్మకాలు అక్కడే నిలిచిపోయాయి. ఇకపై బీఎస్‌-6 వాహనాలే రిజిస్ట్రేషన్‌ కానున్న నేపథ్యంలో, కొనుగోలుదార్లు ఆచితూచి వ్యవహరించారు. మార్చిలో మారుతీ సుజుకీ అమ్మకాలు 47 శాతం, హ్యుందాయ్‌ 47 శాతం చొప్పున తగ్గాయి. మారుతీ సుజుకీ అమ్మకాలు ఏడాది క్రితం నాటి 1,58,076 వాహనాల నుంచి 47 శాతం తగ్గి 83,792కు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తొమ్మిదేళ్ల కింద ఇదే రోజు..

ధోనీసేన వన్డే ప్రపంచకప్‌ను గెలిచి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2011లో ఇదే రోజు (ఏప్రిల్‌ 2) భారత్‌ కప్పును ముద్దాడింది. కపిల్‌ డెవిల్స్‌ (1983 ప్రపంచకప్‌) తర్వాత ప్రపంచ విజేతగా నిలిచిన భారత రెండో జట్టుగా ధోనీసేన ఘనత సాధించింది. వాంఖడేలో శ్రీలంకతో రవవత్తరంగా సాగిన ఫైనల్‌ అభిమానులను ఉత్కంఠతో ఊపేసి, ఆనంద డోలికల్లో తేలేలా చేసింది. ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని మరోసారి వీక్షించడానికి, ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి క్రికెట్‌ ప్రేమికులకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా రోగి టిక్‌టాక్‌ వీడియో

కరోనా బాధిత మహిళ చేసిన టిక్‌టాక్‌ వీడియోకు సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందని సస్పెండ్‌ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగి ఒకరు ఇటీవల టిక్‌టాక్‌ వీడియో చేయడానికి ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బంది సహకరించారు. వీరు బాధిత మహిళ టిక్‌టాక్‌ చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం ఆమెతో సెల్ఫీ దిగారు. ఐసొలేషన్‌ వార్డులో సెల్‌ఫోన్‌కు అనుమతి లేకపోయినా మహిళ పట్టుబట్టడంతో ఫోన్‌ ఇచ్చామని పారిశుద్ధ్య సిబ్బంది చెప్పినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని