close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. పండగ ప్రయాణం ప్రయాసే!

తెలుగువారి పెద్దపండగ సంక్రాంతికి నెల రోజుల ముందే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. కనీసం బస్సుల్లో అయినా టికెట్లు దొరుకుతాయనుకుంటే అక్కడా నిరాశే ఎదురవుతోంది. ముఖ్యంగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సుల్లో బుకింగ్‌ తెరిచిన ఒకట్రెండు గంటల్లోనే సీట్లన్నీ నిండిపోయాయి. జనవరి 13 వరకూ రిజర్వేషన్లు పూర్తయిపోవడంతో.. పండక్కి సొంతూరు ఎలా వెళ్లాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రపంచ సుందరిగా జమైకా యువతి టోనీ

ప్రపంచ సుందరి-2019గా జమైకా యువతి టోనీ-యాన్‌ సింగ్‌ ఎంపికైంది. శనివారం లండన్‌లో జరిగిన పోటీల్లో ఆమెకు 2018 ప్రపంచ సుందరి వనెస్సా పోన్సె (మెక్సికో) కిరీటం అలంకరించారు. మొదటి రన్నరప్‌గా ఒఫెలే మెజినో (ఫ్రాన్స్‌), రెండో రన్నరప్‌గా సుమన్‌రావు (భారత్‌) నిలిచారు. రెండో రన్నరప్‌ సుమన్‌రావు (20)ది రాజస్థాన్‌. ఈ ఏడాది జూన్‌లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 14 లక్షల మంది ఎదురుచూపులు

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకం నిధుల కోసం 14 లక్షల మంది రాష్ట్ర రైతులు ఎదురుచూస్తున్నారు. గత అక్టోబరు నుంచి ఈ నెలాఖరులోగా మొత్తం 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున కేంద్ర వ్యవసాయశాఖ జమ చేయాలి. ఇప్పటికి 22 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే వేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. మిగిలిన 14 లక్షల మందిలో 6 లక్షల మంది రైతుల పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాల్లో తప్పులున్నందున వాటిని సరిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘హ్యాపీనెస్ట్‌’కి రివర్స్‌ టెండరింగ్‌

అమరావతిలో ‘హ్యాపీనెస్ట్‌’ ప్రాజెక్టుకు సీఆర్‌డీఏ రివర్స్‌ టెండరింగ్‌ నోటీసు జారీ చేసింది. బిడ్లు దాఖలు చేసేందుకు 24 వరకు గడువు ఇచ్చింది. 26న ఈ ప్రక్రియను నిర్వహించి గుత్తేదారును ఖరారు చేయనుంది. గతంలో ఈ ప్రాజెక్టుకి రూ.658 కోట్లకు టెండరు ఖరారు చేసింది. ఎల్‌1గా వచ్చిన షాపూర్జీ పల్లోంజీ సంస్థ పనులు దక్కించుకుంది. ఇప్పటివరకు అక్కడ రూ.2 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని అంచనా వేసిన సీఆర్‌డీఏ. ఆ మొత్తాన్ని మినహాయించి రూ.656 కోట్ల అంచనాతో బిడ్లను ఆహ్వానించింది. రాజధానిలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతున్న మొదటి ప్రాజెక్టు ఇదే అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సంక్రాంతి తర్వాతే కమలదళపతి ఖరారు

భాజపా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. విడివిడిగా పలువురు నేతలు ఆ పదవిని ఇప్పటివరకు ఆశిస్తూ రాగా.. పార్టీలో ముందునుంచి ఉన్నవారికి దక్కుతుందా? కొత్తగా చేరిన నేతల్లో బలమైన సామాజికవర్గానికా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కృష్ణదాస్‌ ఇప్పటికే రెండు విడతలు హైదరాబాద్‌ వచ్చి పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక డిసెంబరు మూడో వారానికి పూర్తి కావాలి. అయితే జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ఆలస్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తప్పు చేస్తే సన్మానాలు చేస్తారా?: అంబటి

తనకు అనుకూలంగా పనిచేస్తారన్న ఉద్దేశంతోనే ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన్ను కాపాడేందుకు ప్రతిపక్షనేత ఎందుకంత తాపత్రయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం తాడేపల్లిలో అంబటి రాంబాబు విలేకర్లతో మాట్లాడారు. అవినీతి ఆరోపణల వల్లే ప్రభుత్వం కృష్ణకిశోర్‌ని సస్పెండ్‌ చేసిందన్నారు. తప్పు చేసినవారిని సస్పెండ్‌ చేయకుండా సన్మానాలు చేయాలా అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శబరిమలకు మహిళలు వెళ్లొద్దు

మహిళలు శబరిమలకు వెళ్లొద్దని ఎంతో వినమ్రతతో కోరుకుంటున్నానని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ కోరారు. చెన్నైలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు అయ్యప్పస్వామి మాల వేసే భక్తులు వారి ఇంట్లోని స్త్రీలనూ చూసేవారు కాదు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరైనా అమ్మాయి శబరిమలకు వెళ్తే దీక్షలో ఉన్న భక్తులు చూస్తారు. ఇది వారి మనసులో చెడు భావనను కలిగిస్తుంది.  అందుకే శబరిమలకు వెళ్లొద్దని మహిళలను వేడుకుంటున్నా. మహిళలు వెళ్లడానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికా-చైనాల మధ్య కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం  

ఏడాదిన్నరగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవర పెడుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడింది. అమెరికా, చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. చైనా ఆర్థిక-వాణిజ్య వ్యవస్థలకు సంబంధించి మేధోహక్కుల పరిరక్షణ, సాంకేతికత బదిలీ, వ్యవసాయం, ఆర్థిక సేవలు, కరెన్సీ, విదేశీ మారకపు ద్రవ్య విధానాలలో వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. రాబోయే సంవత్సరాలలో అమెరికా నుంచి మరిన్ని వస్తుసేవలను కొనుగోలు చేసేందుకు చైనా కట్టుబడి ఉండాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?

ప్రపంచకప్‌ తర్వాత సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలుస్తూ దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. మరో సిరీస్‌పై కన్నేసింది. వెస్టిండీస్‌ను టీ20ల్లో ఓడించిన కోహ్లీసేన వన్డేల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటోంది. చెన్నైలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో శనివారం ప్రాక్టీస్‌ కూడా రద్దయింది. మరి   ఆదివారం వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు

‘మా సినిమాకి తొలి ప్రేక్షకుడు, సమీక్షకుడు, ప్రచారకర్త చిరంజీవి సారే. ఆయన వల్లే ప్రేక్షకులు మా సినిమాకి వచ్చార’’న్నారు నిఖిల్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. లావణ్య త్రిపాఠి నాయిక. సంతోష్‌ దర్శకుడు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మాత. నిఖిల్‌  మాట్లాడుతూ ‘‘మా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడినా నిరుత్సాహ పడకుండా అంతా మన మంచికే అనుకుని కష్టపడ్డాం. చివరికి మంచి విజయాన్ని అందుకున్నాం. నిర్మాతలు, పంపిణీదారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సంతోషకరమైన రోజు వస్తుందని అనుకోలేదు’’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.