close

తాజా వార్తలు

Updated : 18/09/2020 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. పోలవరం కేసు సుప్రీంకు బదిలీ చేయం: ఎన్జీటీ

పోలవరం ముంపు బాధితులకు ఆరునెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీలో బాధితులకు పునరావాసం, పరిహారంపై పెంటపాటి పుల్లారావు, తెలంగాణలో ముంపు ప్రభావానికి సంబంధించి పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. ముంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఎన్జీటీ ఆమోదించింది. కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. అంతర్రాష్ట్ర జలవివాదాల జోలికి వెళ్లకుండా  పర్యావరణంపై ప్రభావం, బాధితులకు పరిహారం అంశాలపై విచారిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇళ్ల పరిశీలనను అర్ధంతరంగా ఆపేసిన కాంగ్రెస్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనను కాంగ్రెస్‌ నేతలు నిలిపివేశారు. రెండోరోజు పరిశీలనలో భాగంగా మంత్రి తలసాని, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు (వీహెచ్) వెళ్లారు. ఇవాళ తుక్కుకూడ, రాంపల్లి ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాల పరిశీలన కార్యక్రమాన్ని అర్ధంతరంగా ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను చూపిస్తామని తెరాస నేతలు సవాలు చేశారని.. ఇప్పటి వరకు 3,428 ఇళ్లను మాత్రమే చూపించారని భట్టి ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో కరోనా.. కొత్తగా 8వేల కేసులు

ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 74,710 నమూనాలను పరీక్షించగా.. 8,096 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 6,09,558కి చేరింది. 24 గంటల్లో 69 మంది కరోనాతో మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. కడప జిల్లాలో 8, చిత్తూరు 7, కృష్ణా 7, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, నెల్లూరు 5, శ్రీకాకుళం 5, పశ్చిమగోదావరి 4, ప్రకాశం 3, విజయనగరం 3, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,244కి చేరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి: మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులు చరిత్రాత్మకమని, రైతులకు రక్షణ కవచంలా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు మాత్రం వీటిపై  రైతులను తప్పుదోవ పట్టించొద్దని మండిపడ్డారు. ఈ బిల్లులతో రైతులకు సరైన ధర లభించదంటూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్నారు. బిహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌‌ మాధ్యమంలో ప్రారంభించిన మోదీ.. లోక్‌సభలో నిన్న ఆమోదం పొందిన వ్యవసాయ సంబంధిత బిల్లులపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నా కుమారుడికి లక్షల్లో ఫ్యాన్స్‌: ఏపీ మంత్రి

తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి గుమ్మనూరు జయరాం ఖండించారు. తన కుమారుడికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారని.. దీనిలో భాగంగా ఆయన చేతులుమీదుగా చాలా మంది బహుమతులు అందుకుంటారని చెప్పారు. అయ్యన్న చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చెప్పిన బెంజ్‌ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. తన కుమారుడి పేరిట కారు రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని జయరాం సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధింపు

6. ఇక పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌!

మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచదేశాలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ ప్రయోగాలన్నీ వయోజనులపైనే జరుగుతున్నాయి. తాజాగా వీటిని చిన్నారులు, టీనేజీ పిల్లలపై జరిపేందుకు చైనా సంస్థ సినోవాక్‌ సిద్ధమైంది. మూడు నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన వారిలో తొలి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌లు ప్రపంచంలో అన్ని వయస్సుల వారిలో వైరస్‌ను సమర్థవంతంగా నిరోధించగలిగినప్పుడు మాత్రమే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పేటీఎం తొలగింపు

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎంను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు గూగుల్‌ నోటీసులు జారీ చేసిందని, తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ నిబంధనల ప్రకారం.. ఎలాంటి జూదాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహించకూడదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ట్రంప్‌ నాతో తప్పుగా ప్రవర్తించారు..

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అమెరికాకు చెందిన ఓ మాజీ మోడల్‌ ఆరోపించారు. ఆయన తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు చోటుచేసుకోవటం గమనార్హం. 1997 యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ పోటీలు న్యూయార్క్‌లో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అమీడోరిస్‌ అనే ఈ మాజీ మోడల్‌ వివరించారు. ఆ సమయంలో తాను ట్రంప్‌ను వారించినా.. అతను పట్టించుకోలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనాలో వ్యాపిస్తున్న బ్రూసెల్లోసిస్‌..!

ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్‌కు పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్‌ఝౌ నగరంలో బ్రూసెల్లోసిస్‌ అనే జబ్బు క్రమంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన 3,245 మంది పడ్డట్లు ప్రకటించారు. బ్రూసెల్లా అనే బ్యాక్టిరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. బ్రూసెల్లోసిస్‌నే ‘మాల్టా ఫీవర్‌’ అని కూడా పిలుస్తారు. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్ల-కండరాల నొప్పి, వెన్ను నొప్పి, చలి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా బ్యాంక్‌‌, పైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో భారీ నష్టాల నుంచి సూచీలు తప్పించుకున్నాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్లు నష్టపోయి 38,845.82 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 11,504.95 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.45గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.