close

తాజా వార్తలు

Published : 13/08/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్‌ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’‌ పేరుతో ప్రత్యేక సంఖ్య జారీచేయనుంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సర్వే నిమిత్తం ఉత్తర్వులు జారీచేసింది. పరిశ్రమల్లోని కార్మికులు, విద్యుత్‌, భూమి, నీటి లభ్యత గురించి తెలుసుకోవాలని నిర్ణయించింది. ఎగుమతి-దిగుమతి, ముడిసరకు లభ్యత, మార్కెటింగ్‌ సహా మొత్తం 9 అంశాల్లో వివరాలను పరిశ్రమల శాఖ సేకరించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. బాలిక మృతి: ప్రత్యేక కమిటీ ఏర్పాటు

అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు అనాథ శరణాలయంలో బాలిక అత్యచారానికి గురై మృతి చెందిన ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీలో బాలల హక్కుల కమిషన్‌, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్‌ సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మహిళా కమిషన్‌ కార్యదర్శి జి. సునంద కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై.. ఆ తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలువనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రిలయన్స్‌తో టిక్‌టాక్‌ చర్చలు..!

ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పునరాగమనానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఉన్న తన యూజర్‌ బేస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు భారత్‌లో తన వ్యాపారాన్ని విక్రయించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ చర్చలు జరిపినట్లు ‘టెక్ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్‌ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనింగ్‌ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఇళ్లస్థలాలకు మైనింగ్‌ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సుశాంత్‌ సూసైడ్‌: సుప్రీంకు బిహార్‌ తుది నివేదిక

గత వారం పది రోజులుగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను బిహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించి తాము కేవలం ఎఫ్ఐఆర్‌ మాత్రమే నమోదు చేశామని, విచారణ మొత్తం సీబీఐకి అప్పగించినట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. 9,996 కొత్త కరోనా కేసులు @ ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో (9am-9am)కొత్తగా 9,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 55,692 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులో 9,499 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,05,459 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆ పెన్‌డ్రైవ్‌లో సంభాషణ నిజనిర్ధారణ చేయండి!

జడ్జి కె.రామకృష్ణ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు ఆయన ఇచ్చిన పెన్‌డ్రైవ్‌లోని సంభాషణను నిజనిర్ధారణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌కు బాధ్యతలు అప్పగించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, అవసరమైతే సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘ఎమ్మెల్సీ రవీంద్రబాబును అనర్హుడిగా ప్రకటించాలి’

న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు, రాష్ట్రపతి, గవర్నర్‌కు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఇటీవల న్యాయస్థానాలను, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన్ను.. ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. న్యాయవ్యవస్థపై పెద్ద కుట్ర జరుగుతోందన్న లక్ష్మీనారాయణ.. ఇటీవల కుట్రపూరితంగా కోర్టులను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. గంభీర్‌ కెరీర్‌ ముగింపుపై ఎందుకలా అన్నానంటే?

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కెరీర్‌ తనవల్లే ముగిసిపోయిందని గతేడాది సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ తాజాగా దానికి వివరణ ఇచ్చాడు. ఇటీవల అతడు సవేరా పాషా అనే క్రికెట్‌ వ్యాఖ్యాతతో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ తన గురించి, టీమ్‌ఇండియా క్రికెటర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2012లో భారత పర్యటనకు వచ్చిన ఈ పాక్‌ పేసర్‌.. ఎత్తు ఎక్కువగా ఉండడంతో తన బౌన్సర్లతో అప్పుడు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఆరంభంలో లాభాలు.. ఆఖర్లో నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాలు ఆర్జించినప్పటికీ చివరికి స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం 100కు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆద్యంతం ఒడుదొడుకులకు లోనైంది. చివరికి 59.14 పాయింట్ల నష్టంతో 38,310.49 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 7.90 పాయింట్లు నష్టపోయి 11,300.50 వద్ద స్థిరపడింది.  డాలరుతో రూపాయి మారకం విలువ 74.84గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.