close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోం:పవన్‌

వైకాపా వినాశనం మొదలైంది.. భవిష్యత్తులో వైకాపా మనుగడ ఉండదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు.  ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘‘ పోలీస్‌ శాఖను వైకాపా నేతలు వ్యక్తిగతానికి వాడుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు. మీ శరీరంపై తాకిన దెబ్బలు నా గుండెలకు బాగా తాకాయి. అమరావతి ఇక్కడే ఉంటుంది.. మీకు అండగా నేనుంటా’’ అని పవన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. జైలు నుంచి విడుదలైన గల్లా జయదేవ్‌

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టయిన తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళగిరి న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను విడుదల చేశారు. అనంతరం జైలు వద్ద జయదేవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు అసెంబ్లీ వద్దకు వెళ్లి శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే పోలీసులే తమతో దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.  సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో ప్రణాళిక ప్రకారం దాడి చేయిస్తున్నారని.. తన పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని జయదేవ్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఎస్సీలపై మీకున్న గౌరవం ఇదేనా?:జగన్‌

చరిత్రాత్మక వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం తెదేపా సంకుచిత స్వభావానికి నిదర్శనమని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ విమర్శించారు. సభకు ఆటంకం కలిగిస్తూ తెదేపా సభ్యులు నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కమిషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లునే కాకుండా ఎస్సీ కమిషన్‌ బిల్లును కూడా మండలిలో అడ్డుకోడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే లేనివిధంగా ఎస్సీల కోసం మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ కమిషన్‌ బిల్లును అడ్డుకోవడమే వారిపై తెదేపాకున్న గౌరవమా? అని జగన్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సీఏఏను వెనక్కితీసుకోం..ఆందోళనలు చేసుకోండి

పౌరసత్వ సవరణచట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న ఆందోళనను కొనసాగించుకోమని, ఎట్టిపరిస్థితుల్లోను సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో సీఏఏకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, సీఎం మమతా బెనర్జీ, అఖిలేశ్‌ యాదవ్‌కు సవాలు విసిరారు. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మండలి రద్దుచేస్తామంటే భయపడేది లేదు:లోకేశ్‌

వైకాపా నాయకులు బెదిరించి పాలన సాగించాలని చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఆరోపించారు. మండలి రద్దు కంటే అప్రజాస్వామికం ఏమీ ఉండదన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూల్‌ 71పై ఎన్నిరోజులైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండలి రద్దు చేస్తామంటే భయపడేది లేదన్నారు. ఈ విషయంలో తెదేపా సభ్యులెవరూ ఆందోళనలో లేరని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం ఎవరిది?

ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హత అంశంలో నిర్ణయాధికారం ఎవరికి ఉండాలి అన్నదానిపై పునరాలోచన చేయాలని సుప్రీంకోర్టు పార్లమెంట్‌ను అడిగింది. ప్రస్తుతం ఈ అధికారం స్పీకర్‌కు ఉన్నప్పటికీ ఆయన కూడా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే కదా అని అభిప్రాయపడింది. అలా కాకుండా ప్రజాప్రతినిధుల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు స్వతంత్ర, శాశ్వత యంత్రాంగం ఏర్పాటు చేసే విషయం గురించి పార్లమెంట్‌ ఆలోచించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఫేషియల్‌ రికగ్నిషన్‌ నిషేధానికి పిచాయ్‌ మద్దతు!

ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికతను తాత్కాలికంగా నిషేధించాలన్న ఐరోపా సమాఖ్య ప్రతిపాదనను అల్ఫాబెట్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్వాగతించారు. ఈ సాంకేతిక వల్ల దుష్ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని పిచాయ్‌ అభిప్రాయపడ్డారు. సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ ఉన్నతస్థాయి సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతపై మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో.. వాటిని ఉపయోగించే రంగాలను బట్టి నిబంధనలు ఉండాలని ఆయన సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కివీస్‌ టీ20 సిరీస్‌కు ధావన్‌ దూరం!

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరం కానున్నట్టు తెలుస్తోంది. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడు అందుబాటులో ఉండడని సమాచారం. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి టీమిండియా ఆక్లాండ్‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. కానీ ధావన్‌ భారత జట్టుతో కివీస్‌కు బయలుదేరలేదు. దీంతో కివీస్‌ టీ20 సిరీస్‌ నుంచి గబ్బర్‌ దూరమవ్వడం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రూ 1.47లక్షలకోట్లు కట్టేందుకు సమయమివ్వండి

రూ.1.47 లక్షల కోట్ల బకాయిలను చెల్లించేందుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా సర్వీసెస్‌తో పాటు పలు టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను గతంలో ఏ ధర్మాసనం విచారించిందో అదే మళ్లీ దీన్ని స్వీకరిస్తుందని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. వచ్చే వారం దీన్ని విచారణ జరగనుంది. తమ పిటిషన్‌ను ఛాంబర్‌లో కాకుండా బహిరంగ విచారణ జరపాలని టెలికాం కంపెనీలు అభ్యర్థించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 41కే ఆలౌట్‌.. ఐదుగురు డకౌట్‌

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్మురేపుతోంది. పసికూన జపాన్‌తో జరుగుతున్న మ్యాచులో సంచలన ప్రదర్శన చేసింది. ప్రత్యర్థిని 22.5 ఓవర్లకు 41 పరుగులకే ఆలౌట్‌ చేసేసింది.  ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 4.5 ఓవర్లలోనే ఛేదనను ముగించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ (29; 18 బంతుల్లో 5×4, 1×6), కుమార కుశాగ్ర (13; 11 బంతుల్లో 2×4) అజేయంగా నిలిచారు. గ్రూప్‌-ఏలో ప్రస్తుతం భారత్‌ 2 విజయాలు, 4 పాయింట్లు, +3.702 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.