close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు ముహూర్తం ఖరారైంది. బుధవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరకు  10పైసలు పెంచారు. అయితే మొదటి రెండు స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు లేదు. సిటీ, ఆర్డినరీ  బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపులేదు. ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 20 పైసలు పెంచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హైదరాబాద్‌ మెట్రోలో G5 సేవలు వచ్చేశాయ్‌!

మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చిన G5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పించింది. మెట్రోలో షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ను మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రారంభించారు. షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌తో ఇంటర్నెట్‌ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘వారి విడుదల నిర్ణయం స్థానిక యంత్రాంగానిదే’

కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో తెలిపారు. అధికరణ 370 రద్దు తర్వాత నిర్బంధంలోకి తీసుకున్న వారి విడుదల అంశాన్ని స్థానిక పాలనా యంత్రాంగమే చూసుకుంటుందని వివరించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. వారిని ఒక్కరోజు కూడా అదనంగా నిర్బంధంలో ఉంచబోమని.. స్థానిక యంత్రాంగం ఆదేశించిన వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఎన్‌కౌంటర్‌పై తెరాస ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా తెరాస ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పౌరసత్వ బిల్లుకు శివసేన ఓటు..రాహుల్‌ ట్వీట్‌

పొరుగు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే దిశగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా శివసేన ఓటెయ్యడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లుపై ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘ఈ బిల్లుకు ఎవరైనా మద్దతిచ్చారంటే దానర్థం.. దేశ పునాదిపై దాడి చేసి నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లే’ అని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. వంశీని ప్రత్యేక సభ్యునిగా ఎలా గుర్తిస్తారు?

ఏపీ శాసనసభ నిర్వహణ తీరును తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాట్లాడించటం శాసనసభ చరిత్రలో దుర్దినమని నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ బయట తెదేపా నేతలు టీడీఎల్పీ ఉపనేత బుచ్చయ్య చౌదరి, పార్టీ సీనియర్‌ నేత చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ వంశీని ప్రత్యేక సభ్యునిగా ఎలా గుర్తిస్తారు? అని వారు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వడ్డీరేట్లను తగ్గించిన బీవోబీ

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల బాటలో ఇప్పుడు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా పయనిస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌తాజాగా ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను అత్యధికంగా 20 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ తగ్గింపు వివిధ కాలవ్యవధి రుణాలపై వివిధ రకాలుగా ఉండనుంది. నెలవారీ రుణాలపై 20బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.65శాతం వడ్డీరేటుకు రానుంది.. ఇక మూడునెలలు.. ఆరునెలల ఎంసీఎల్‌ఆర్‌లు 7.80శాతం, 8.10శాతంగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రాహుల్‌ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న శివసేన.. సోమవారం లోక్‌సభలో ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ నేత చేసిన ట్వీట్‌తో మళ్లీ యూటర్న్‌ తీసుకుంది. రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వబోమని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఈ బిల్లుతో ఎవరూపౌరసత్వం కోల్పోరు: రవీశ్‌కుమార్‌

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్)చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. బిల్లుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ధృవీకరించగినవి కావని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ) గానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) గానీ.. ఈ రెండింటిలో ఏదీ కూడా భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించవని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అమ్మకాలతో మార్కెట్‌ విలవిల

దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ బేర్‌మంది. విదేశీ మదుపర్లు పెట్టబడులకు మొగ్గుచూపినప్పటికీ.. దిగ్గజ షేర్లలో అమ్మకాలతో దేశీయ మార్కెట్లు విలవిల్లాడాయి. భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 247 పాయింట్లు పతనమై 40,240 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 81 పాయింట్లు నష్టపోయి 11,857 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.92గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.