close

తాజా వార్తలు

Updated : 07/07/2020 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంట్లో ఉన్నా ఎన్‌95 మాస్కులు ధరించాలా?

కరోనా ఉద్ధృతిపై నిపుణులు ఏమంటున్నారంటే..

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు అధికమవుతున్నాయి. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తోందనే వార్తలు ఇప్పుడు కొత్త ఆందోళనకు దారితీస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్‌ మూడో స్థానానికి చేరింది. అయితే, రికవరీ రేటు 60శాతానికి పైగా నమోదవ్వడం ఆశాజనకంగా ఉంది. మరోవైపు వచ్చే మూడు, నాలుగు నెలల్లో కొవిడ్ కేసులు తగ్గుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌ బయోటెక్‌తో పాటు మరిన్ని సంస్థలు ఎంతో శ్రమిస్తున్నాయి. ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు కూడా ఈ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంత కాలంలో వాక్సిన్‌ వస్తుందనే విషయాలపై పలువురు ప్రముఖులు ఏమన్నారో వారి మాటల్లోనే.. 

సడలింపులతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది..

భారత్‌లో లాక్‌డౌన్‌ కారణంగా మొదట్లో వైరస్‌ వ్యాప్తిని బాగానే అరికట్టినా, దురదృష్టవశాత్తూ సడలింపులిచ్చాక తీవ్రత పెరిగింది. చైనా, స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ లాంటి దేశాలు ఒక స్థాయికి చేరాక వ్యాప్తిని అరికట్టాయి. అక్కడి ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించింది. వాటి ద్వారా వైరస్‌ సోకిన వారిని గుర్తించి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేశాయి. ఇక మన దేశం పరిస్థితి చూస్తుంటే త్వరలోనే ఒకటి, రెండు స్థానాలకు చేరేలా కనిపిస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే ఇది ఇప్పటికే సామాజిక వ్యాప్తి చెందింది. అందుకు కారణం ర్యాండమ్‌ టెస్టులు చేయకపోవడమే. ఇప్పటివరకు దేశంలో కోటి మందికి మాత్రమే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇంకా విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. టెస్టుల సంఖ్య పెంచి ప్రజలను అప్రమత్తం చేయాలి. 

- డా కృష్ణయ్య, ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు, కిమ్స్‌ ఆస్పత్రి


భారత్‌లో రికవరీ రేటు బాగుంది..

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ రేటు కచ్చితంగా మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. వృద్ధులు, ఇతర జబ్బులున్న వారికే మనం ప్రధాన్యత ఇస్తున్నాం. వారికే ప్రమాద సంకేతాలు అధికంగా ఉన్నాయి. మిగతా వారి పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, వారి పట్ల కూడా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఇక వయసు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో రికవరీ రేటు ఆశించలేం. ఇప్పటికే మన వద్ద ఉన్న ఔషధాలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మూడు, నాలుగు నెలల్లో భారత్‌లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందనే అభిప్రాయాలున్నాయి. కానీ, ఇక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తే ఆ విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎప్పటిలోపు వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందనే విషయాలు ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. 

- డా ఏయూ శంకర్‌ ప్రసాద్‌, ప్రముఖ జనరల్‌ ఫిజిషియన్ సన్‌షైన్‌ ఆస్పత్రి


గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తే చాలా ప్రమాదకరం..

గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా మరింత ప్రమాదం పొంచి ఉంది. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వారు కూడా ఎన్‌-95 మాస్కులు ధరించాలి.  చిన్న గదుల్లో ఉండేవారు. ఏసీలు వాడే వారికి ఇది ప్రమాదకరం. ఇంట్లో ఉన్న వాళ్లు కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉండాలి. ఈ విషయంపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందనే దానికి శాస్త్రీయమైన నిర్ధారణ లేదని కొట్టిపారేసింది.  అయితే, ఆ శాస్త్రవేత్తలు మాత్రం ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. అందుకు అనుగుణంగా తమ మార్గదర్శకాలు మార్చాలని సూచిస్తున్నారు. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే విషయం నిర్ధారణ అయ్యేవరకు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాలన్నారు.  

- డా. ఎం ఎస్‌ ఎస్‌ ముఖర్జీ


కరోనా బారిన పడకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచింది..

వైరస్‌ సోకిన తర్వాత చికిత్స తీసుకోడం, ఆందోళన చెందడం కన్నా ముందే జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. ఇప్పుడు ప్రజల్లోనూ అప్రమత్తత పెరిగింది. లాక్‌డౌన్‌ లేకున్నా ఎంతో మంది ఇళ్లలోనే ఉంటున్నారు. అలాగే వైరస్‌పై వస్తున్న వార్తలు అయోమయానికి గురి చేస్తున్నాయి. వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉన్నా దానికి సరైన విధానం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే మేం ఒక విధానాన్ని ప్రతిపాదించాం. చాలా మంది వైరస్‌ నుంచి కోలుకున్న వారు కూడా ఈ పద్ధతులను పాటించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే.. తరచూ ఆవిరి పట్టడం. మెడిటేషన్‌ చేయడం, ప్రాణయామం చేయడం, రోగనిరోధక శక్తి పెంపొందించే పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. ఇలాంటివి చేయడం ద్వారా వైరస్‌ బారిన పడకముందే దాన్నుంచి బయటపడొచ్చు.  

- మేజర్‌ శివకిరణ్‌, సామాజిక విశ్లేషకులు 


వాక్సిన్‌ రావడానికి కనీసం 9 నెలలు పడుతుంది..

చివరగా భారత్‌ బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొని ఎంత కాలంలో అందుబాటులోకి వస్తుందనే విషయంపై మాట్లాడిన డా కృష్ణయ్య.. ఏదైనా కొత్త వాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే కనీసం 9 నెలల నుంచి ఏడాది కాలం పడుతుందని చెప్పారు. ఒకవేళ ఈ వాక్సిన్‌ విషయంలో కాస్త త్వరితగతిన ప్రయోగాలు చేసినా సుమారు 6 నుంచి 9 నెలల సమయం పడుతుందన్నారు. అలాగే వాక్సిన్‌ తయారీలో రెండు దశలుంటాయని, ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ ఉంటాయన్నారు. దీంతో తొలి దశలో జంతువులపై ప్రయోగించి చూస్తారని, అది విజయవంతమైతే  దశల వారీగా మానవులపై ప్రయోగిస్తారన్నారు. అలాగే ఆ సమయంలో కొత్త మందు ఇతర అనారోగ్య సమస్యలు తెస్తుందేమోనని కూడా పరీక్షిస్తారని వివరించారు. ఈ దశలన్నీ పూర్తవడానికి చాలా సమయం పడుతుందని, అన్ని విజయవంతమయ్యాకే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కృష్ణయ్య వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని