close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5PM

1. నా పర్యటనకు ప్రభుత్వం భయపడింది: పవన్

వైకాపా ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడును తింటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆయన.. మండపేట నియోజవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం రైతులతో మాట్లాడారు. గతంలో నేతలంతా ఓట్ల కోసం పాదయాత్రలు చేశారని, కానీ రైతుల కన్నీరు తుడిచేందుకు ఇప్పుడు పాదయాత్రల అవసరముందని పవన్‌ అన్నారు. ‘జిల్లాలో నా పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వం భయపడింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.80 కోట్లను ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసింది’ అని పవన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దిశ తల్లిదండ్రులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పిలుపు

చటాన్‌పల్లి వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’ తల్లిదండ్రులకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి పిలుపొచ్చింది. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని కోరింది. కేసు విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి తీసుకెళ్లేందుకు పోలీసులు శంషాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. దిశ దశదిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని తొలుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని.. ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కష్టాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కోసం తిప్పలు తప్పడం లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఒంగోలు రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో  మరింత రద్దీ అధికమైందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ ఫైర్‌మ్యాన్‌ రియల్‌ హీరో: దిల్లీ హోంమంత్రి

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు చాకచక్యం ప్రదర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై భవనంలోకి వెళ్లి 11 మంది ప్రాణాలు రక్షించారు. దిల్లీ అగ్నిమాపక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్‌ శుక్లా ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంతో సాహసం ప్రదర్శించి అందరికన్నా ముందు అనాజ్‌ మండీ భవనంలోకి ప్రవేశించారు. అనంతరం మంటల్లో చిక్కుకున్న 11 మందిని ప్రమాదం నుంచి బయట పడేసి, ప్రాణాలు కాపాడగలిగారు. ఈ క్రమంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఉపహార్‌’తర్వాత దిల్లీలో రెండో పెద్ద ప్రమాదం

దేశరాజధాని దిల్లీలోని అనాజ్‌మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 43 మంది వరకు దుర్మరణం చెందారు. దిల్లీ చరిత్రలో ఉపహార్‌ సినిమా అగ్ని ప్రమాదం తర్వాత ఇదే అతి పెద్దది. ఈ ఘటనలో దాదాపు వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేజ్రీవాల్‌ రూ.10లక్షలు పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు కేంద్రం నుంచి  పీఎం సహాయనిధి కింద రూ.2లక్షలు పరిహారాన్ని అందించనున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉత్పత్తి పెంచిన మారుతీ సుజుకీ

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వాహనాల ఉత్పత్తిని పెంచింది. నవంబర్‌లో 4.33 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. డిమాండ్‌లేమి కారణంగా గత తొమ్మిది నెలలుగా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చిన ఆ కంపెనీ.. తొలిసారి ఉత్పత్తిని పెంచడం గమనార్హం. నవంబర్‌ నెలలో మొత్తం 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో ఆ కంపెనీ 1,35,946 యూనిట్లను ఉత్పత్తి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఎంత మంచివాడవురా’ సినిమా ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

8. అగ్రస్థానం కోసం కోహ్లీ×రోహిత్‌ పోటీ!

వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులపై కన్నేశారు. పొట్టిఫార్మాట్‌లో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ సిక్సర్‌ దూరంలో మాత్రమే నిలిచాడు. హిట్‌మ్యాన్‌ మరో సిక్సర్ బాదితే టీ20ల్లో 400 సిక్సర్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ (534), పాక్‌ మాజీ ఆటగాడు షాహీద్‌ అఫ్రీది (476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్‌ 399 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలెండ్‌లో ఆకట్టుకుంటున్న ‘శొంఠిపొడి’ సిటీ

పోలెండ్‌లోని ఓ వాస్తుశాస్త్ర మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి ‘శొంఠిపొడి నగరం’ సందర్శకులను నోరూరిస్తోంది. ఐరోపాకు చెందిన వంద మందికి పైగా భవన నిర్మాణవేత్తలు దీనిని రూపొందించారు. ఇందులో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఆర్ట్‌ గ్యాలరీలు, రైల్వే ట్రాక్‌లను ఆర్కిటెక్ట్‌లు ఏర్పాటు చేశారు. లండన్‌ పార్లమెంటు భవనానికి కూడా ఈ కళాఖండంలో స్థానం కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ ఘటన.. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు

దిల్లీలోని అనాజ్‌మండి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై విపక్షాలు ఆప్‌ ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించాయి. ఈ ప్రమాదానికి దిల్లీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశాయి. సంఘటనా స్థలిని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీతో కలిసి పరిశీలించిన భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ మాట్లాడుతూ.. వీధిలో విద్యుత్‌ తీగలు వేలాడడంపై పదే పదే ఫిర్యాదులు అందినా కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.